హైలైట్స్:
- తమిళనాడు, గుజరాత్ ‘ఈ వేస్ట్’ డంపింగ్ యార్డుగా ఢిల్లీ
- జనంలో ఆందోళన
- పెరుగుతున్న జల, వాయు కాలుష్యం
సోలార్ విద్యుత్ ఉత్పత్తి ఆదాయం తమిళనాడు, గుజరాత్ ప్రభుత్వాలు ఆర్జిస్తుండగా, ఆ రాష్ట్రాల నుంచి వచ్చే సోలార్ ఈ వేస్టుతో ఢిల్లీ మహానగరం సర్వం గుల్ల అవుతోంది. ఫలితంగా ఢిల్లీ వాసులు వాయు, జల, భూ కాలుష్యంతో నిత్యం నరకప్రాయమైన జీవితం అనుభవిస్తున్నారు. కాలం చెల్లిన సోలార్ ప్యానెళ్లు, లిథియం ఇయాన్ బ్యాటరీలు, హానికర వ్యర్థాలు వంటి ఈ వేస్టును ఈ రెండు రాష్ట్రాలు పెద్ద ఎత్తున ఈ రీసైక్లింగ్ కోసం తరలిస్తున్నాయి. వీటిని రీసైక్లింగ్ చేసే సమయంలో వెలువడుతున్న వ్యర్థాలు వాయు, జల కాలుష్యానికి కారణం అవుతున్నాయని పర్యావరణ నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 2047 సంవత్సరం నాటికి సోలార్ ఫొటో వోల్టాయిక్ ఈ వేస్టు 1,12,221 కిలో టన్నులకు చేరుకుంటుందని, ఈవీ లిథియం బ్యాటరీల అదనం చేరిక వల్ల మరింత వ్యర్థాలు పెరుగుతాయని పర్యావరణవేత్తలు అంటున్నారు.
గత దశాబ్దకాలంగా దేశంలో సోలార్ విద్యుత్ ఉత్పత్తి పెరిగింది. పెద్ద ఎత్తున ప్రైవేటు ఉత్పత్తి కంపెనీలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రోత్సహిస్తున్నాయి. తెలంగాణలో సింగరేణి కాలరీస్ కూడా సోలార్ రంగంలోకి ప్రవేశించింది. గుజరాత్, తమిళనాడు రాష్ట్రంలో పెద్ద ఎత్తున సోలార్ విద్యుత్ ప్లాంట్లను ఏర్పాటు చేశారు. సూర్య శక్తిని వినియోగించుకుని విద్యుత్ ఉత్పత్తి చేయడం వరకు బాగానే ఉంది. కాని సోలార్ ప్యానెళ్ల వ్యర్థ నిర్వహణలో మాత్రం ఈ రెండు రాష్ట్రాలు పూర్తిగా విఫలం అయ్యాయి. కొన్ని సంవత్సరాల తరువాత ప్యానెళ్లు, బ్యాటరీలను మార్చి కొత్తవాటిని ఏర్పాటు చేస్తుంటారు. కాలం చెల్లిన ఈ వ్యర్థాలను పునర్ వినియోగించుకునే అవకాశాలు లేవు. వీటిని పర్యావరణానికి హాని కలిగించని రీతిలో శాస్త్రీయ విధానంలో ధ్వంసం చేయాల్సిన బాధ్యత ప్యానెల్ వినియోగించిన కంపెనీలతో పాటు రాష్ట్ర ప్రభుత్వాలపై ఉంది. ఈ బాధ్యతను అటు సోలార్ విద్యుత్ ప్లాంట్లను ఏర్పాటు చేసిన కంపెనీలు, ఇటు కేంద్ర రాష్ట్రాలు పూర్తిగా మరిచిపోయాయి.
ఢిల్లీ నెత్తిన 5వేల ఈ వేస్ట్ యూనిట్లు, 50వేల మందికి ఉపాధి…
వాయు కాలుష్యం, పొరుగున ఉన్న హర్యానా, పంజాబ్ రాష్ట్రాల నుంచి వచ్చే పంట వ్యర్థాల పొగ కాలుష్యంతో ఢిల్లీ ప్రజలు ప్రతినిత్యం నరకం అనుభవిస్తున్నారు. చలికాలంలో అయితే రోడ్లపై దారి సక్రమంగా కన్పించదు, ఎయిర్‌పోర్ట్‌లో విమానాలు ల్యాండ్ అయ్యేందుకు ఆటంకాలు ఎదురవుతుంటాయి. ముఖ్యంగా చిన్నారులు ఊపిరి ఆడక అవస్థలు పడుతుంటారు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రజల ఆరోగ్యానికి హానికరంగా మారిన ఈ వేస్ట్‌పై కేంద్ర ప్రభుత్వం, ఢిల్లీ ప్రభుత్వం చర్యలు తీసుకోవడంలో విఫలం అవుతున్నాయి. ఢిల్లీ చుట్టు పక్కల ఐదు వేల వరకు ఈ వేస్ట్ ను ధ్వంసం లేదా వాటిని పార్టులు గా మార్చి పునర్ వినియోగించే యూనిట్లు ఉన్నాయి. ఈ యూనిట్లలో సుమారు 50వేల మంది ప్రత్యక్షంగా ఉపాధి పొందుతున్నారు. వీటిని సెంట్రల్ పొల్యుషన్ కంట్రోల్ బోర్డు నిబంధనల ప్రకారం శాస్త్రీయ విధానంలో ధ్వంసం చేసిన తరువాతే భూమిలో పాతి పెట్టాల్సి ఉంటుంది. వీటిని ఎలా ప్రాసెస్ చేయాలనే దానిపై ప్రత్యేక నిబంధనలు రూపొందించారు. సాధారణంగా చెత్తను వదిలించుకుంటున్న మాదిరి సోలార్ ఈ వేస్ట్ ను వదిలేస్తున్నారని పర్యావరణ నిపుణులు మండిపడుతున్నారు. అల్యుమినియం ప్రేములు, కాపర్ వైర్లు, జంక్షన్ బాక్సులను విభజించి తొలగిస్తున్నారు. గ్లాస్, పాలిమర్ తెరలు, సిలికాన్ సెల్స్, మెటల్స్ ను కార్మికులు ఎలాంటి రక్షణ కవచాలు ఉపయోగించకుండా విడదీసి పడేస్తున్నారు. సోలార్ ఫ్యానెళ్లను ముక్కలు చేయడం లేదా ముద్దగా చేస్తున్నారు. వీటిని పాలిమర్, సిలికాన్ తో కలిపేసి భూమిలో పాతి పెడుతున్నారు. అయితే ఈ వేస్టు ధ్వంసంలో అనుసరిస్తున్న విధానాల మూలంగా ఢిల్లీ నగరం ప్రజల ఆరోగ్యానికి ప్రమాదంగా పరిణమించింది. పద్దతి లేకుండా సోలార్ ప్యానెళ్లను ధ్వంసం చేయడం మూలంగా వాటినుంచి హానికర విషవాయువులు వెదజల్లుతాయని అంటున్నారు. దీని మూలంగా కార్మికులు, సమీప ప్రాంతాల ప్రజల ఆరోగ్యానికి హాని చేస్తాయని హెచ్చరిస్తున్నారు. 2024 నాటికి దేశ వ్యాప్తంగా పీవీ వేస్ట్ 146 కిలో టన్నులు కాగా 2047 నాటికి 11,221 కిలోటన్నులకు చేరుకోనున్నదని తమ నివేదికలో వెల్లడించారు.
తోడైన లిథియం ఇయాన్ బ్యాటరీలు
ఇదొక సమస్య అయితే వాహనాల్లో వినియోగించే లిథియన్ ఇయాన్ బ్యాటరీల మూలంగా మరింత దారుణంగా ఉంటుందని పర్యావరణ నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్న క్రూడాయిల్ తో నష్టాలు వస్తున్నాయని, విదేశీ మారకద్రవ్యం భారం పెరుగుతుందంటూ కేంద్ర ప్రభుత్వం ఎలక్ట్రిక్ వాహనాలను ప్రోత్సహిస్తున్నది. ఫలింతగా బ్యాటరీ వాహనాల వినియోగం ప్రతి ఏడాది పెరుగుతోంది. వాహనాల్లో నిర్ణీత కాలం తరువాత బ్యాటరీలు పనిచేయకుండా నిర్వీర్యం అయిపోతాయి. వీటిని శాస్త్రీయ విధానంలో ఈ వేస్ట్ కు తరలించి, భూమిలో పాతిపెట్టాల్సి ఉంటుంది. మరో నాలుగైదు సంవత్సరాలలో కాలం చెల్లిన బ్యాటరీల సమస్య పెరిగి పెద్దది అవుతుంది. నిబంధనలు పాటించకుండా అలాగే వదిలేస్తే వాటి నుంచి వచ్చే కెమికల్ రియాక్షన్ మూలంగా పర్యావరణంలో అనూహ్య మార్పులు చోటు చేసుకుంటాయి. వీటి సేకరణ, తరలింపు, రీసైక్లింగ్ విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కఠినంగా వ్యవహరించనట్లయితే భూ, వాయు, జల కాలుష్యం తప్పదని పర్యావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారు.