దేశంలో తొలి హైడ్రోజన్ రైలు పట్టాలపై పరుగులు తీసేందుకు సిద్ధంగా ఉంది. డీజిల్, విద్యుత్ బదులు హైడ్రోజన్‌తో ఈ రైలు నడవనున్నది. గరిష్ఠంగా గంటకు 75 కిలోమీటర్ల వేగంతో ఇది ప్రయాణించగలదు. నార్తర్న్ రైల్వే పరిధి హర్యానా రాష్ట్రం జింద్ – సోనిపత్ మధ్య ప్రయోగాత్మకంగా ఈ రైలును విజయవంతంగా నడిపించారు. త్వరలోనే ఈ మార్గంలో పది కోచ్‌ల సామర్థ్యంతో ఉన్న రైలును ప్రయాణికులకు అందుబాటులోకి తేనున్నారు. టెస్ట్ రన్ విజయవంతం కావడంతో ఇండియన్ రైల్వే అధికారులు దీనిని పూర్తి స్థాయిలో నడిపేందుకు అనుమతులు ఇచ్చారు. రక్షణపరంగా ఎలాంటి సమస్యలు లేవని కూడా నిర్థారించారు. ఈ రైలులో డీజిల్ బదులు హైడ్రోజన్ సెల్స్ వినియోగించనున్నారు. రైలులో ఉన్న మోటర్లు హైడ్రోజన్ సెల్స్ నుంచి విద్యుత్‌ను ఉత్పత్తి చేస్తాయి. దీని వల్ల పర్యావరణానికి ఎలాంటి హాని కలుగకపోగా, కేవలం వృథా నీరు మాత్రమే బయటకు వస్తుంది. పూర్తి స్వదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో దీన్ని తయారు చేశారు. 2030 నాటికి కాలుష్యాన్ని తగ్గించే క్రమంలో భాగంగా ఇండియన్ రైల్వేను ఆధునీకరించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. ఇందులో భాగంగానే హైడ్రోజన్ రైలును తయారు చేసి నడపాలని నిర్ణయించింది. ఎంపిక చేసిన రైలు మార్గాలలో పర్యావరణ అనుకూల రవాణా సౌకర్యాన్ని మెరుగుపర్చేందుకు డీజిల్ స్థానంలో హైడ్రోజన్‌తో నడిచే రైళ్లను ప్రవేశపెట్టనున్నారు.
చెన్నైలో తయారీ
2021 సంవత్సరంలో రీసెర్చ్ డిజైన్స్ అండ్ స్టాండర్డ్స్ ఆర్గనైజేషన్ ఈ ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టింది. డిజైన్లు ఖరారు చేసిన తరువాత చెన్నైలోని ఇంటెగ్రల్ కోచ్ ఫ్యాక్టరీకి ట్రైన్ తయారీ బాధ్యతలు అప్పగించారు. స్పెషల్ కోచ్‌లకు హైడ్రోజన్ సిలిండర్లు అమర్చడం, బ్యాటరీలు రూపొందించడం, ఎయిర్ రిజర్వాయర్లను రూపొందించే బాధ్యతలు అప్పగించారు. ప్రపంచంలోనే మొదటిసారిగా బ్రాడ్ గేజ్ లైనులో నడిపేందుకు హైడ్రోజన్ రైలును సిద్ధం చేశారు. పది కోచ్‌లు ఉండే రైలులో రెండు కోచ్‌లను పూర్తిగా డ్రైవర్లకు కేటాయించారు. మిగతా ఎనిమిది కోచ్‌లలో ప్రయాణికులు కూర్చోవడానికి అవకాశం కల్పించారు. ఈ ఎనిమిది కోచ్‌లలో 2,600 మంది కూర్చునేందుకు బెర్తులను ఏర్పాటు చేశారు. ఒక డ్రైవర్ కోచ్‌లో 1200 కిలోవాట్స్ సామర్థ్యం కలిగిన పవర్ యూనిట్ ఏర్పాటు చేశారు.
35 హైడ్రోజన్ రైళ్ల తయారీ
35 హైడ్రోజన్ రైళ్లను కొత్తగా తయారు చేసేందుకు రైల్వే మంత్రిత్వ శాఖ 2023-24 ఆర్థిక సంవత్సరం బడ్జెట్‌లో రూ.2,800 కోట్లు కేటాయించింది. ఈ నిధులను పరిశోధన, డిజైన్, టెస్టింగ్, తయారీ కోసం వినియోగించాలని ప్రతిపాదించారు. కీలకమైన మార్గాలలో మౌలిక సదుపాయాల కల్పనకు కూడా వినియోగించనున్నారు. హైడ్రోజన్ పర్ హెరిటేజి ప్రాజెక్టు కింద 35 హైడ్రోజన్ రైళ్లను చారిత్రక, కొండ ప్రాంతాలలో నడిపించనున్నారు. పది కోచ్‌లు ఉండే ఒక రైలుకు రూ.80 కోట్లు ఖర్చవుతుండగా, మౌలిక సదుపాయాల కల్పనకు అదనంగా మరో రూ.70 కోట్లు వ్యయం అవుతున్నది. కర్బన ఉద్గారాలను తగ్గించేందుకు, పర్యాటక రంగాన్ని మరింతగా ప్రోత్సహించేందుకు ఈ రైళ్లను పెద్ద ఎత్తున వినియోగంలోకి తీసుకురావాలని రైల్వే మంత్రిత్వ శాఖ నిర్ణయించింది. ఇందులో భాగంగానే పైలెట్ ప్రాజెక్టకు ఆమోదం తెలిపింది.
పైలట్ ప్రాజెక్టుకు రూ.111.83 కోట్లు మంజూరు
కొత్తగా హైడ్రోజన్ రైలును తయారు చేసి పట్టాలెక్కించేందుకు ఇండియన్ రైల్వే ఈ పైలట్ ప్రాజెక్టకు రూ.111.83 కోట్లు మంజూరు చేసింది. ఈ నిధులతో ప్రస్తుతం నడుపుతున్న డెము రైళ్లను హైడ్రోజన్ రైళ్లుగా మార్చాలని సూచించింది. మేథా సెర్వో డ్రైవ్స్ అనే సంస్థకు ఈ బాధ్యతలు అప్పగించారు. డీజిల్ బదులు హైడ్రోజన్ సెల్స్ ను ఇంధనంగా వినియోగంచనున్నారు. ద పెట్రోలియం అండ్ ఎక్స్ ప్లోజివ్స్ సేఫ్టీ ఆర్గనైజేషన్ (పెసో) నడిపేందుకు అనుమతులు ఇచ్చింది. పట్టాలపై సమస్యలు తలెత్తకుండా సులువుగా నడిపేందుకు శిక్షణ పొందిన నిపుణులు డ్రైవర్ కోచులలో సిద్ధంగా ఉండనున్నారు.
జర్మనీ, జపాన్, చైనా దేశాల సరసన
ప్రస్తుతం జర్మనీ, జపాన్, చైనా, అమెరికా వంటి దేశాలలో హైడ్రోజన్ ఇంధనంగా నడిచే రైళ్లను విరివిగా నడపిస్తున్నారు. ఈ రైలు పట్టాలెక్కితే ఆ దేశాల సరసన భారతదేశానికి చోటు లభించనున్నది. ఈ రైళ్లను నడపడం మూలంగా పర్యావరణ సమతుల్యత కలుగనున్నది. కాలుష్యాన్ని తగ్గించేందుకు, ఇంధన సామర్థ్యం మెరుగుపర్చుకునే చర్యలలో భాగంగా హైడ్రోజన్ రైళ్లను ఇండియన్ రైల్వే ప్రవేశపెట్టింది. నికర శూన్య కర్బన ఉద్గారాల లక్ష్యంలో భాగంగా ఈ సాంకేతికతను అందిపుచ్చుకోవాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. అయితే ఇప్పటికీ ఆ దేశాలలో హైడ్రోజన్ సెల్స్ తో నడిచే రైళ్లు ఇంకా అభివృద్ధి దశలోనే ఉన్నాయి. దీని నిర్వహణ కోసం అనేక జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. ఇంధనం నింపడం, తనిఖీలు నిర్వహించడం, నిర్వహణ, నిపుణులైన ఉద్యోగులను నియమించడం వంటివి నిర్వహణలో కీలకంగా మారాయి. హైడ్రోజన్ ను ఇంధనంగా మార్చే క్రమంలో మంటలు చెలరేగకుండా రక్షణ చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. గత ఏప్రిల్ నెలలో ఢిల్లీ మెట్రో రైలు కార్పొరేషన్ దేశంలోనే మొదటిసారిగా హైడ్రోజన్ తో నడిచే బస్సును ప్రారంభించింది. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ రెండు హైడ్రోజన్ బస్సులను అందుబాటులోకి తెచ్చింది. ప్రతి బస్సులో 38 మంది కూర్చుని ప్రయాణించేందుకు సీటింగ్ సౌకర్యం కల్పించారు. ప్రయాణీకుల భద్రత కోసం సీసీటీవీలతో పాటు జీపీఎస్ ట్రాకింగ్ ను అమర్చారు. సెంట్రల్ విస్టా ప్రాంతంలో ఈ బస్సులను షటిల్ సర్వీసు కోసం నడిపిస్తున్నారు.
Read Also|
అక్కడ లీటర్ పెట్రోల్ ధర రూ.82.46.. రూ.100 లోపు దొరికే ప్రాంతాలు ఇవే..
మొన్న కేరళ.. నేడు కర్ణాటక.. రాజకీయ రుతుపవనం తెలంగాణనూ తాకేనా? రేవంత్ వద్ద ‘ప్లాన్ బీ’ ఉందా?
మరో వైభవ్ సూర్యవంశీ రెడీ..!
