Asia Cup Final 2025 | ఆసియా కప్‌ ట్రోఫీతో పారిపోయిన పాక్‌ క్రికెట్ చీఫ్‌

ఆసియా కప్ ఫైనల్‌లో భారత్ విజయం సాధించినా ట్రోఫీతో హైడ్రామా చోటుచేసుకుంది. టీమిండియా నఖ్వీ చేతుల మీదుగా ట్రోఫీ తీసుకోవడానికి నిరాకరించడంతో పాక్ చీఫ్ ట్రోఫీతో పారిపోయారు.

Asia Cup 2025: Pakistan PCB Chief Walks Away With Trophy After India’s Refusal

దుబాయ్‌:
ఆసియా కప్ ఫైనల్‌లో (Asia Cup Final 2025) పాకిస్థాన్‌పై ఐదు వికెట్ల తేడాతో భారత్ విజయం సాధించింది. తెలుగు కుర్రాడు తిలక్ వర్మ అసమాన పోరాటం, కుల్దీప్ యాదవ్ అద్భుత ప్రదర్శనతో టీమిండియా విజయ కేతనం ఎగురవేసింది. అయితే మ్యాచ్ ముగిసిన తర్వాత మైదానంలో పెద్ద వివాదం చెలరేగింది.

ఆసియా క్రికెట్ కౌన్సిల్ అధ్యక్షుడు, పాకిస్థాన్ వ్యవహారాల మంత్రి, పిసిబి చీఫ్‌ అయిన మొహిసిన్ నఖ్వీ చేతుల మీదుగా ట్రోఫీ తీసుకోవడానికి టీమిండియా నిరాకరించింది. తటస్థ అధికారి అయిన ఎమిరేట్స్​ క్రికెట్​ అధినేత చేతుల మీదుగా మాత్రమే ట్రోఫీ తీసుకుంటామని భారత ఆటగాళ్లు స్పష్టం చేశారు. దీనికి నిరాకరించిన నఖ్వీ ఆగ్రహంతో స్టేజి వదిలి వెళ్లిపోయారు. అంతే కాదు, తనతో పాటు ట్రోఫీని, ఆటగాళ్లకు ఇవ్వాల్సిన మెడల్స్‌ని కూడా తీసుకెళ్లిపోవడం అంతర్జాతీయ స్థాయిలో సంచలనంగా మారింది

భారత్ ధీటైన వైఖరి

“భారత క్రికెట్ జట్టు ఒక రాజకీయ నాయకుడి చేతిలో నుండి ట్రోఫీ తీసుకోదు. తటస్థ అధికారి నుండి మాత్రమే అందుకుంటాం” అని బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియా స్పష్టం చేశారు. భారత్ తరఫున ఇప్పటికే ఐసీసీ సమావేశంలో ఈ విషయాన్ని బలంగా ప్రస్తావించనున్నట్టు తెలిపారు.

భారత్ కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ఆగ్రహం వ్యక్తం చేస్తూ —
“నా క్రికెట్ కెరీర్‌లో ఇంత వరకు ఒక విజేత జట్టుకి ట్రోఫీ ఇవ్వకుండా నిరాకరించడం ఎప్పుడూ చూడలేదు. నిజమైన ట్రోఫీలు నా డ్రెస్సింగ్​ రూమ్‌లో కూర్చున్న 14 మంది ఆటగాళ్లు, సపోర్ట్ స్టాఫ్. మేం గెలిచాం.. అది చాలు” అన్నారు. భారత్ ఆటగాళ్లు ట్రోఫీ లేకపోయినా కల్పిత ట్రోఫీని లేపుతూ సెలబ్రేషన్ చేసుకోవడం అభిమానులను ఉత్సాహపరిచింది.

 

పాక్‌ చీఫ్‌పై తీవ్ర విమర్శలు

మ్యాచ్ తర్వాత స్టేడియంలో నఖ్వీ ప్రవర్తనపై సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

కాగా, పాకిస్తాన్​ కెప్టెన్​ సల్మాన్​ ఆఘా కూడా రన్నర్​అప్​ చెక్కును విసిరేయడం కూడా ప్రేక్షకులకు ఆగ్రహాన్ని తెప్పించింది.

ఇది స్పష్టంగా క్రికెట్ కన్నా రాజకీయ రంగు పులుముకున్న వివాదంగా మారింది.

Exit mobile version