Purnima Shrestha | 13 రోజుల్లో మూడుసార్లు ఎవరెస్ట్ అధిరోహణ.. రికార్డు నెలకొల్పిన నేపాలీ మహిళ.. ఆమె ఏమంటోందంటే..
Purnima Shrestha | ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించాలంటేనే ఎన్నో ధైర్య సాహసాలు ఉండాలి. ఎంతో మంది పర్వతారోహకులు ఒక్కసారి ఎవరెస్ట్ ఎక్కినా జన్మ ధన్యమైనట్లే అని భావిస్తారు. అలాంటిది నేపాల్‌కు చెందిన 33 ఏళ్ల మహిళ పూర్ణిమా శ్రేష్ఠ కేవలం పదమూడు రోజుల వ్యవధిలోనే మూడుసార్లు ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించి రికార్డు నెలకొల్పింది. ప్రపంచంలో ఈ ఫీట్ సాధించిన మొదటి మహిళగా ఆమె గుర్తింపు పొందింది.

Purnima Shrestha : ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించాలంటేనే ఎన్నో ధైర్య సాహసాలు ఉండాలి. ఎంతో మంది పర్వతారోహకులు ఒక్కసారి ఎవరెస్ట్ ఎక్కినా జన్మ ధన్యమైనట్లే అని భావిస్తారు. అలాంటిది నేపాల్‌కు చెందిన 33 ఏళ్ల మహిళ పూర్ణిమా శ్రేష్ఠ కేవలం పదమూడు రోజుల వ్యవధిలోనే మూడుసార్లు ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించి రికార్డు నెలకొల్పింది. ప్రపంచంలో ఈ ఫీట్ సాధించిన మొదటి మహిళగా ఆమె గుర్తింపు పొందింది. నేపాల్‌లో వృత్తిరీత్యా ఫొటో జర్నలిస్ట్ అయిన పూర్ణిమ సాటి మహిళలను ప్రోత్సహించడానికి సవాళ్లనే సోపానాలుగా చేసుకుంటున్నాని చెప్పారు. ప్రపంచంలో ఒకే సీజన్‌లో ఎవరెస్ట్ శిఖరాన్ని మూడుసార్లు అధిరోహించిన మొదటి మహిళగా గుర్తింపు రావడం ఎంతో ఆత్మవిశ్వాసాన్ని ఇచ్చిందని తెలిపారు. పర్వతారోహణలో పాల్గొంటున్న మహిళలను ఇప్పటికీ వేళ్లమీద లెక్కించవచ్చని, వారికి ఆసక్తి ఉంటుంది కానీ భయంతో వెనుకంజ వేస్తుంటారని ఆమె అన్నారు.
ఇప్పుడు చాలామంది యువతులు పర్వతారోహణ గురించి తనను కలుస్తుంటారని, వారిలో ప్రభావంతమైన మార్పును తీసుకురాగలుగుతున్నందుకు ఆనందంగా ఉందని, రాబోయే రెండేళ్లలో 14 మంది మహిళలను ఎవరెస్ట్ అధిరోహణకు తీసుకెళ్లగలనని నమ్మకం ఉందని పూర్ణిమ చెప్పారు. ఎప్పుడూ ఒక విధమైన జీవనంలో మూసపద్ధతిలో కొనసాగడం తనకు ఇష్టం ఉండదన్నారు. తాను సంపన్నుల ఇంట్లో పుట్టలేదని, అమ్మానాన్నలు నేపాల్‌లోని గోర్ఖా ప్రాంతంలోని మారుమూల గ్రామంలో రైతులని తెలిపారు. తన చిన్నప్పుడు ఇంట్లో ఎప్పుడూ నీటి కొరత ఉండేదని, రాగిబిందెతో కిలోమీటర్ల దూరం నుంచి నీళ్లు మోసుకొచ్చేదాన్నని, ఆ కష్టం తనలో సవాళ్లకు మార్గం చూపిందని, ఇప్పటివరకు తాను ఎనిమిది శిఖరాలను అధిరోహించానని పూర్ణిమ చెప్పారు.
‘నా సవాళ్ల సాధన కోసం స్నేహితులు, బంధువులు, కుటుంబ సభ్యుల నుంచి డబ్బు తీసుకున్నా. గైడింగ్ కంపెనీ నుంచి కొంత లోన్ తీసుకున్నా. తిరిగి ఈ అప్పు తీర్చడానికి మౌంటనీర్ గైడ్‌గా చేయాలనుకుంటున్నా. రికార్డ్ సాధించి, పర్వతారోహణలో మహిళలు పాల్గొనడానికి ఉన్న అడ్డంకులను తొలగించాలన్నది నా లక్ష్యం. చాలామంది అడ్డు చెప్పారు. కానీ 8,000 కిలోమీటర్ల రికార్డ్‌ను సాధించాను. ‘ఒక సాధారణ అమ్మాయి రికార్డ్ బ్రేక్ చేసింది’ అనే మాటలు విన్నప్పుడు, ప్రపంచంలో అగ్రస్థానంలో నిలిచినందుకు ఎంతో సంతోషంగా ఉంది’ అని తెలిపారు. ఈ సీజన్‌లో ఎవరెస్ట్ శిఖరాన్ని తొలి రెండుసార్లు సులువుగానే అధిరోహించానని, మూడోసారి కొంచెం అలసటకు గురై ఇబ్బందిపడ్డానని చెప్పారు.
‘నా గైడ్, నేను ఈ అధిరోహణకు బయల్దేరాం. అలసటతో నా అడుగులు భారంగా అనిపించాయి. శిఖరాగ్రానికి చేరుకోవడానికి మధ్యలోనే అలసటతో కొంతసేపు నిద్రలోకి జారుకున్నా. నిద్రలేపడానికి గైడ్ నా ముఖంపైకి మంచుగడ్డలను విసరారు. వాతావరణం అనుకూలంగా ఉండటంతో త్వరగానే తేరుకున్నా. ఒక్కో అడుగు వేయడంపై దృష్టిపెట్టి మధ్యాహ్నం ఒంటిగంటకు శిఖరాగ్రానికి చేరుకుని రికార్డ్ సృష్టించా. దాదాపు ఒక గంటపాటు పైభాగంలోనే ఉన్నాం. నేను చాలా ఉద్వేగానికి లోనయ్యా’ అని పూర్ణిమ తెలిపారు. ‘స్కూల్ చదువు పూర్తయ్యాక ఫొటో జర్నలిజం చేశా. 2017లో ఎవరెస్ట్ మారథాన్ కవర్‌చేసే ఫొటోగ్రఫీ అసైన్‌మెంట్ సమయంలో పర్వతారోహణ ప్రపంచానికి పరిచయమయ్యా. శిఖరపు అంచున నిలబడి, అక్కడి నుంచి ప్రపంచాన్ని చూడటంలోని కష్టాన్ని అర్థం చేసుకోవాలనుకున్నా’ అన్నారు.
స్త్రీలు ఇంటిపని కోసం మాత్రమే పుట్టారనే అభిప్రాయంతో చాలామంది ఉంటారు. గ్రామాల్లో చాలామంది అమ్మాయిలు మధ్యలోనే చదువు మానేస్తుంటారు.పెళ్లే జీవనసాఫల్యంగా ఉంటారు. ఆ తర్వాత వెంటనే మాతృత్వం, ఇంటి పనులతో జీవితం గడిపేస్తారు. కానీ నా జీవనం అలా ఉండకూడదు అనుకున్నా. 2018లో నా పర్వతారోహణ ప్రక్రియను ప్రారంభించా. 2022లో కాంచన్ జంగా, లోత్సే, మకాలు పర్వతాలను అధిరోహించా. అదే నెలలో అతి తక్కువ రోజుల్లో మూడుసార్లు ఎవరెస్ట్‌ను అధిరోహించగలననే నమ్మకం కలిగింది. ఎవరెస్ట్ పైనుంచి కొత్తగా లేదా గొప్ప పనిచేస్తే ప్రజలు ముఖ్యంగా మహిళల్లో మార్పు వస్తుందని అనుకున్నా. ప్రజలలో మహిళలపట్ల ఉన్న అభిప్రాయాన్ని మార్చడమే నా ఉద్దేశ్యం’ అని పూర్ణిమ చెప్పిన మాటలు యువతకు స్ఫూర్తి.