‘Arrive Alive’తో పల్లెల్లోకి పోలీసులు.. ప్రజా భద్రత అంశాలపై చైతన్యం

నిత్యం శాంతి భద్రతల్లో నిమగ్నమై హడావుడిగా ఉండే పోలీసులు భద్రత అంశాలు ప్రామాణికంగా ప్రజలను చైతన్యవంతం చేసే కార్యక్రమాలను నిర్వహిస్తూ పల్లె ప్రజలతో కలిసిమెలిసి పోతున్నారు. ఈ కార్యక్రమానికి ఆయా జిల్లాల్లో సానుకూల ఫలితాలు వస్తున్నాయి. ఖాకీ యూనిఫారమ్‌లో కరుకుగా కనిపించే పోలీసు అధికారులు గ్రామాల్లోకి వెళ్ళి యువతను ప్రభావితం చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వం 99 రోజుల పాటు చేపట్టిన ప్రజాపాలన, ప్రగతి అభివృద్ధి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా చేపట్టిన ఈ కార్యక్రమానికి మంచి స్పందన లభిస్తోంది.

  • By: TAAZ |    telangana |    Published on : Mar 24, 2026 8:06 PM IST
‘Arrive Alive’తో పల్లెల్లోకి పోలీసులు.. ప్రజా భద్రత అంశాలపై చైతన్యం
  • ప్రజాపాలనలో ప్రత్యేక కార్యక్రమం
  • ప్రజల నుంచి సానుకూల స్పందన
  • రోడ్డు భద్రత, మత్తు పదార్ధాలు, సైబర్ క్రైమ్‌పై అవగాహన

విధాత, ప్రత్యేక ప్రతినిధి:

సమాజానికి సమస్యగా మారిన రోడ్డు ప్రమాదాలు, శాంతి భద్రతల పరిరక్షణ, మత్తు పదార్ధాల నివారణ, సైబర్ నేరాలపై “Arrive Alive” అంటూ అవగాహన కల్పించేందుకు నడుంబిగించారు తెలంగాణ పోలీసులు. ఈ సందర్భంగా స్థానికంగా సీసీ టీవీల ఏర్పాటుతో పాటు మహిళలు, పిల్లల భద్రత అంశాలు, యువత గంజాయి ఇతర మత్తు పదార్ధాల బారిన పడకుండా తీసుకోవాల్సిన చర్యలను వివరిస్తున్నారు. రోడ్డు ప్రమాదాల్లో యువకులు ప్రాణాలు కోల్పొతున్నందున డ్రంకెన్ డ్రైవ్‌ను నివారించడమే కాకుండా హెల్మెట్ వినియోగం, రోడ్డు భద్రతా ప్రమాణాలు పాటించేలా అవగాహన కల్పిస్తున్నారు. ప్రతి జిల్లాలో ఈ కార్యక్రమం జిల్లా ఎస్పీల ఆధ్వర్యంలో కొనసాగిస్తున్నప్పటికీ మహబూబాబాద్ ఎస్పీ డాక్టర్ శబరీష్ ఆధ్వర్యంలో జిల్లాలోని పల్లెల్లో చేపట్టిన కార్యక్రమానికి మంచి స్పందన లభిస్తోంది.

ప్రజా ప్రతినిధులతో ముందడుగు

భద్రత కార్యక్రమాన్ని అమలు చేసేందుకు ‘మీ గ్రామం మీ చేతుల్లో.. సమాజ శ్రేయస్సు కోసం కలసి పనిచేద్దాం’ అంటూ ముందుగా జిల్లా కేంద్రంలో జిల్లా పోలీసుల ఆధ్వర్యంలో విస్తృత స్థాయి కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచులు, వార్డ్ సభ్యులు, కౌన్సిలర్లు, మున్సిపల్ చైర్మన్లు, వైస్ చైర్మన్లు పాల్గొన్నారు. రోడ్డు ప్రమాదాలపై అవగాహన కల్పిస్తూ, హెల్మెట్ ధరించడం, ట్రాఫిక్ నియమాలు పాటించడం ద్వారా ప్రాణాలను కాపాడుకోవచ్చని తెలియజేశారు. “Arrive Alive” సందేశంతో సురక్షిత ప్రయాణం ప్రతి ఒక్కరి బాధ్యత అని గుర్తు చేశారు.

telangana-police-village-outreach

సీసీ కెమెరాల ప్రాముఖ్యతను వివరిస్తూ, గత కేసుల పరిష్కారంలో వాటి పాత్రను ప్రదర్శించారు. ప్రతి గ్రామంలో సీసీ కెమెరాల ఏర్పాటు ద్వారా నేర నియంత్రణ సాధ్యమని సూచించారు. డ్రగ్స్, గంజాయి వాడకం యువత భవిష్యత్తును ఎలా దెబ్బతీస్తుందో వివరించి, గ్రామ స్థాయిలోనే నివారణ చర్యలు చేపట్టాలని ప్రజాప్రతినిధులను కోరారు. మహిళలు, చిన్నారుల భద్రత మరియు సైబర్ నేరాలపై అవగాహన కల్పిస్తూ OTPలు, బ్యాంక్ వివరాలు ఎవరితోనూ పంచుకోకూడదని, అవసరమైనప్పుడు 100 & 1930 హెల్ప్‌లైన్స్ వినియోగించాలని సూచించారు. ఈ సందర్భంగా గ్రామ భద్రత, అభివృద్ధి కోసం రూపొందించిన చెక్‌ లిస్ట్ పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆదర్శంగా నిలిచిన గ్రామ సర్పంచ్‌లను సన్మానించారు. “గ్రామ స్థాయిలో ప్రజాప్రతినిధుల చురుకైన భాగస్వామ్యం ఉంటేనే సమాజంలో శాంతి, భద్రతలు బలోపేతం అవుతాయంటూ యువతను సరైన దిశలో నడిపించడం మన అందరి బాధ్యత.” అంటూ ప్రజాప్రతినిధులు, పోలీసులు కలిసికట్టుగా సాగాల్సిన అవసరాన్ని వివరించారు.

పల్లెల్లో ప్రజా కార్యక్రమం

జిల్లా స్థాయి కార్యక్రమం తర్వాత పోలీస్ స్టేషన్ ల పరిధిలోని గ్రామాల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమాల్లో యువత, స్థానిక ప్రజాప్రతినిధులను భాగస్వామ్యం చేస్తున్నారు. ప్రజల ముందుకు పోలీసు సేవలంటూ ఎస్పీ ప్రదర్శిస్తున్న చొరవతో మిగిలిన పోలీసులు కూడా ప్రజలు, యువతతో కలిసిపోయేందుకు యత్నిస్తున్నారు.