Harish Rao Slams Over Congress 6 Guarantees | కాంగ్రెస్ పాలన మార్పు కాదు..ఏమార్పు

మాజీ మంత్రి హరీష్ రావు: కాంగ్రెస్ పాలన మార్పు కాదు, రేవంత్ 420 హామీలతో ప్రజలను మోసం చేశారని విమర్శించారు.

Harish Rao Slams Over Congress 6 Guarantees | కాంగ్రెస్ పాలన మార్పు కాదు..ఏమార్పు

విధాత : కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వ పాలనలో మార్పు మొదలైందంటూ ఊదరగొట్టిన సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్ర ప్రజలను ఏ మార్చాడని..ఆరు గ్యారంటీలు..420హామీలుతో ప్రజలను నమ్మించి గొంతు కోసాడని బీఆర్ఎస్ మాజీ మంత్రి టి.హరీష్ రావు విమర్శించారు. సిద్దిపేట క్యాంప్ కార్యాలయంలో కాంగ్రెస్ బాకీ కార్డు విడుదల కార్యక్రమంలో మాట్లాడారు. బతుకమ్మ సందర్భంగా కేసీఆర్ చీరలు ఇచ్చారని..నేను పట్టుచీరలు ఇస్తా అన్న సీఎం రేవంత్ రెడ్డి..అంతుకుముందుచ్చిన చీరలు కూడా ఇవ్వలేదన్నారు. గ్యారంటీలకు టాటా చెప్పిన రేవంత్ రెడ్డి లంక బిందెలకు వేట పట్టిండని ఎద్దేవా చేశారు. పైసలు లేవు అంటునే..మల్లన్న సాగర్ నుండి మూసీల నీళ్లు పోస్తా అని రూ.7000 కోట్లతో ప్రాజెక్టు ప్రారంభించాడన్నారు. ఢిల్లీకి మూటలు కట్టడానికి, కాంట్రాక్టర్ల దగ్గర కమిషన్లు తీసుకోవడానికి, బీహార్ ఎన్నికలకు పంపడానికి పైసలు ఉన్నాయి గాని.. ఇచ్చిన గ్యారెంటీలు అమలు చేయడానికి పైసలు లేవా అని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. గోదావరి నీళ్లు కాళేశ్వరం ద్వారా కాలువల్లో పారుతుంటే కళ్ళుండి చూడలేని కబోదులు కాంగ్రెస్ నాయకులు అంటూ విమర్శించారు. నీళ్ల విషయంలో అబద్ధాలు, నియామకాల విషయంలో అబద్ధాలు, నోరు తెరిస్తే అన్ని అబద్ధాలేనని మండిపడ్డారు. యూరియా బస్తాలు ఇచ్చే తెలివి లేదు కానీ ఊరుకో మద్యం దుకాణం పెడతాడట అని ఎద్దేవా చేశారు.

ప్రతి ఇంటికి కాంగ్రెస్ బాకీ కార్డుల పంపిణీ

ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీల మేరకు ప్రజలకు బాకీ పడిన మొత్తాలను వివరిస్తూ బీఆర్ఎస్ శ్రేణులు ఇంటింటికి పంపిణీ చేపట్టాయని హరీష్ రావు వెల్లడించారు. వందరోజుల్లో హామీలు అమలు చేస్తామన్న రాహుల్ గాంధీ హామీ ఏమైందని ప్రశ్నించారు. ప్రతి రైతుకు కాంగ్రెస్ పార్టీ 75 వేల రూపాయలు రైతుబంధు బాకీ పడిందన్నారు. కౌలు రైతుకు రైతుబంధు బాకీ పడ్డారన్నారు. రాష్ట్రంలో సీలింగ్ ఉండగా..54 ఎకరాల కంటే ఎవరికీ ఎక్కువ భూమి ఉండదని.. 25 ఎకరాల మీద ఎంతమందికి తెలంగాణలో భూమి ఉంది అని లెక్క తీస్తే 3శాతం మాత్రమే ఉన్నారని.. 97 శాతం మంది రైతులు 10 ఎకరాల లోపే ఉన్నారని తేలిందన్నారు. ఇప్పుడు కుర్చీలో కూర్చుంటే కేసీఆర్ చేసింది కరెక్ట్ అని రైతుబంధు పథకంలో రేవంత్ రెడ్డికి అర్థమైందన్నారు. ప్రతి మహిళకు బాకీ పడ్డ 44 వేల ఇచ్చి స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ ఓట్లు అడగాలని డిమాండ్ చేశారు. కేసీఆర్ తొమ్మిదేళ్లలో 20,000 కోట్లు ఫీజు రియంబర్స్మెంట్ డబ్బు చెల్లించగా..ఒక రూపాయి చెల్లించని చేతకాని ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అని విమర్శించారు. 200 ఉన్న పెన్షన్ ని కేసీఆర్ 2000 చేసి ఇచ్చారని..కాంగ్రెస్ 4000 పెన్షన్ ఇస్తా అన్నది ఈరోజు వరకు ఇవ్వలేదన్నారు. 18 ఏళ్లు నిండిన ప్రతి అక్కకు చెల్లెకు మహాలక్ష్మి కింద రూ.2,500 ఇస్తామన్నారు. మహిళలను కోటీశ్వరులని చేస్తామని చెప్పి ఎవరిని చేయలేదన్నారు.

కాంగ్రెస్ కు ఉరి తాడు బాకీ కార్డు

కాంగ్రెస్ బాకీ కార్డు లోకల్ బాడీ ఎన్నికల్లో బ్రహ్మాస్త్రం అని..ఇది కాంగ్రెస్ పాలిట ఉరితాడు అవుతుందని హరీష్ రావు చెప్పుకొచ్చారు. రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తానని రాహుల్ గాంధీ అశోక్ నగర్ చౌరస్తాలో చెప్పాడని..ప్రియాంక గాంధీ హుస్నాబాదులో నిరుద్యోగ భృతి 4000 ఇస్తామన్నారని..వారి హామీలు అమలు కాకపోగా..జాబ్ క్యాలెండర్ జాబ్ లెస్ కేలండర్ అయిందన్నారు. విద్యార్థులకు 5 లక్షల భరోసా కార్డు అన్నారని.. ఒక విద్యార్థి కైనా ఇవ్వలేదన్నారు. 2లక్షల ఉద్యోగాలు ఇస్తామన్న కాంగ్రెస్ కనీసం 5000 ఉద్యోగాలను ఇవ్వలేదని..కేసీఆర్ నోటిఫికేషన్ ఇచ్చి పరీక్ష పెట్టి రిజల్ట్ ఇస్తే కాయితాలు పంచి రేవంత్ రెడ్డి తన ఖాతాలో వేసుకున్నాడని విమర్శించారు. ఆరోగ్యశ్రీ డబ్బులు ఇవ్వక..వైద్య సేవలు బంద్ అయినాయని..తులం బంగారం, స్కూటీలు పత్తా లేవని..సన్నవడ్లకు 1300 కోట్ల రూపాయలు బోనస్ బాకీ పడ్డాడని హరీష్ రావు వివరించారు. కల్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ నామమాత్రమైందన్నారు. గురుకులాల పిల్లకు భోజన బిల్లులు కూడా ఇవ్వడం లేదన్నారు. మంత్రి కోమటిరెడ్డి నరకమంటే బాగా నరుకుతాడు కానీ గుంతపడని రోడ్డు ఎక్కడైనా ఉన్నదా అని ప్రశ్నించారు. ఫ్యూచర్ సిటీ అని లేని సిటీకి రేవంత్ రెడ్డి ఆరు లైన్ల రోడ్ వేస్తాడటగాని..ఉన్న రోడ్లను మాత్రం పట్టించుకోరంట అని విమర్శించారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం పర్సంటేజ్ కు భయపడి కాంట్రాక్టర్లు టెండర్లు వేయని పరిస్థితి నెలకొందని ఆరోపించారు.