Jagadish Reddy : మెట్రో టేకోవర్ వెనుక సీఎం రేవంత్ రెడ్డికి రూ.1000కోట్ల ముడుపులు
జి. జగదీష్ రెడ్డి ఎల్ఆండ్ టీ టేకోవర్, మెట్రో, ఫ్యూచర్ సిటీపై రేవంత్ రెడ్డి రియల్ ఎస్టేట్ స్కామ్ అని ఆరోపించారు.

విధాత, హైదరాబాద్ : ఎల్ఆండ్ టీ నుంచి సీఎం రేవంత్ రెడ్డి రూ.1000కోట్ల ముడుపులు తీసుకుని మెట్రో రైల్ సంస్థలను ప్రభుత్వానికి టేకోవర్ చేసుకున్నారని బీఆర్ఎస్ మాజీ మంత్రి జి.జగదీష్ రెడ్డి ఆరోపించారు. సోమవారం ఆయన తెలంగాణ భవన్ లో మీడియాతో మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డి పథకం ప్రకారం ఎల్ఆండ్ టీ సంస్థపై ఒత్తిడి తెచ్చి వాళ్లను వెళ్లగొట్టి.. వేయి కోట్లు దండుకొని, ప్రజలపై రూ.15 వేల కోట్ల ప్రజలపై భారం మోపిండని ఆరోపించారు. ప్రభుత్వానికి ఇప్పటికే ఆర్థిక పరిస్థితి బాగాలేనప్పుడు నష్టాల్లో ఉన్న మెట్రోను టేకోవర్ చేసుకోవడం వెనుక మతలబు ఏమిటో ప్రజలు ఆలోచించాలన్నారు. సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయంతో ఎల్ ఆండ్ టీ సంస్థ ఆస్తుల విలువ ఒకేసారి రూ.12వేలకోట్ల మేరకు పెరిగిందన్నారు. నష్టాల్లో ఉన్న మెట్రోను ప్రభుత్వానికి అంటగట్టడంతో పాటు మెట్రోకు ఉన్న రూ. 35 వేల కోట్ల విలువ గల 300 ఎకరాల ఆస్తులను ఆయన దోస్తులు అదానీ, మేఘా కృష్ణారెడ్డిలకు కట్టబెట్టాలని రేవంత్ రెడ్డి చూస్తున్నాడని జగదీష్ రెడ్డి ఆరోపించారు.
ఫ్యూచర్ సిటీ రేవంత్ రెడ్డి రియల్ ఎస్టేట్ స్కామ్
ఇకపోతే ఫ్యూచర్ సిటీ సీఎం రేవంత్ రెడ్డి చేస్తున్న మరో రియల్ ఎస్టేట్ స్కామ్ అని జగదీష్ రెడ్డి ఆరోపించారు. జనమే లేని చోట, ఇండ్లు లేని చోట, జనావాసాలు లేని ఫ్యూచర్ సిటీకి రోడ్లు, మెట్రో వేస్తాడని రేవంత్ రెడ్డి చెప్పడం హాస్యస్పదంగా ఉందన్నారు. ఇదంతా ప్రజాధనం దుర్వినియోగమేని ఆరోపించారు. అసలు సీఎం రేవంత్ రెడ్డి ఫ్యూచర్ ఏందో ఆయనకే తెల్వదని..ఇంక ఫ్యూచర్ సిటీ ఏం కడుతారని ప్రశ్నించారు. మరి విడ్డూరంగా ఫ్యూచర్ సిటీ నుంచి కట్టని అమరావతికి క గ్రీన్ ఫీల్డ్ హైవే నిర్మిస్తారటని..మళ్లీ దాని పక్కన రైల్వే ప్రయాణ వసతి ఏర్పాటు చేస్తామంటూ రేవంత్ రెడ్డి చెబుతున్నారని విమర్శించారు. అమరావతి కి రైలులో గురు శిష్యులు చంద్రబాబు, రేవంత్ లు ఒకే రైలులో వస్తారా..? అని ప్రశ్నించారు. ఇదంతా కేవలం రియల్ ఎస్టేట్ దందా కోసమే రేవంత్ రెడ్డి చేస్తున్నారని..ఆయన కుటుంబం, బంధుమిత్రులు కొన్న భూముల రేట్లు పెంచుకోవడానికే తప్ప ఎక్కడా కూడా ప్రజల అవసరం ఇందులో లేదన్నారు. రాష్ట్రంలో రోడ్ల పరిస్థితి దారుణంగా ఉందని..కాంగ్రెస్ వచ్చాక ఒక్క తట్టెడు మట్టి కూడా వేయలేదని..అలాంటప్పుడు ఫ్యూచర్ సిటీ, మెట్రో టేకోవర్ వంటి నిర్ణయాలు ఎందుకని జగదీష్ రెడ్డి ప్రశ్నించారు. రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు జరుగుతాయన్న నమ్మకం ప్రజలకు లేదని..ప్రభుత్వంపై విశ్వాసం లేదన్నారు. రాహుల్ గాంధీ ప్రధాని అయ్యే వరకు రిజర్వేషన్లు రావని ముఖ్యమంత్రి ఢిల్లీలోని ధర్నాలోనే చెప్పారన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో రాహుల్, ప్రియాంకగాంధీలు వచ్చి చెప్పిన గ్యారంటీల హామీల మాటలు ప్రజలు నమ్మి కాంగ్రెస్ ను గెలిపించారన్నారు. గెలిచాక ఎన్నికల హామీలను అమలు చేయనందునా బీఆర్ఎస్ బాకీ కార్డు పేరుతో ప్రజలను కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నించేలా చైతన్యం చేస్తున్నామన్నారు. మంత్రి జూపల్లి కృష్ణారావు, వెంకట్ రెడ్డి శాఖలలో వారికి తెలియకుండానే నిర్ణయాలు జరిగిపోతున్నాయంటున్నారని..మరికొందరు ఎమ్మెల్యేలు సొంత ప్రభుత్వంపైనే విమర్శలు చేస్తున్నారని జగదీష్ రెడ్డి సెటైర్లు వేశారు.