విధాత, హైదరాబాద్ : బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిపై సీఐడీ పోలీసులు నోటీసులు జారీ చేశారు. ఏప్రిల్ 4న విచారణకు హాజరు కావాలని నోటీసులలో పేర్కొన్నారు. జనవరి 29న హుజూరాబాద్‌లో సమ్మక్క జాతర వేళ గొడవకు సంబంధించి కేసు నమోదైంది. కరీంనగర్ సీపీ, పోలీసులపై కౌశిక్ రెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారని కేసులో అభియోగాలు మోపారు. ఇప్పటికే అసెంబ్లీలో కడియం శ్రీహరిని బెదిరించేలా కౌశిక్ రెడ్డి వ్యవహరించారన్న వివాదం విచారణ ఎథిక్స్ కమిటీ పరిశీలనలో ఉంది. ఇప్పుడు హుజూరాబాద్ జాతర కేసులో నోటీసులు జారీ కావడం.. కౌశిక్ రెడ్డి పట్ల ప్రభుత్వ సిరీయస్ వైఖరికి నిదర్శనం కనిపిస్తుంది.
ఎన్ని కేసులు పెట్టినా ప్రశ్నించడం ఆపను : కౌశిక్ రెడ్డి
ఏ తప్పు చేయకపోయినా… ఏదో ఒక విధంగా ఇబ్బంది పెట్టాలనే ఉద్దేశంతో నాకు, నా కుటుంబానికి, మా బీఆర్ఎస్ సభ్యులకు సీఐడీ పోలీసులు నోటీసులు ఇవ్వడం ఎంతో బాధ కలిగించిందని ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ట్వీట్ చేశారు. ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాననే కారణంతో నా కుటుంబ సభ్యులను , బీఆర్ఎస్ సభ్యులను ఇలా బెదిరింపులకు గురిచేయడం తగునా? అని ప్రశ్నించారు. రాజకీయాలు నాపై చేయండి… కానీ నా కుటుంబాన్ని, బీఆర్ఎస్ సభ్యులను ఇబ్బంది పెట్టడం ఎంతవరకు న్యాయం? అని పేర్కొన్నారు.
సీఎం రేవంత్ రెడ్డి నన్ను లక్ష్యంగా చేసుకోండి … నాపై కేసులు పెట్టండి… నాకు నోటీసులు ఇవ్వండి..కాని నా కుటుంబాన్ని, బీఆర్ ఎస్ సభ్యులను ఇబ్బంది పెట్టడం మాత్రం బాధాకరం అని పేర్కొన్నారు. అయినా సరే.. నన్ను ఎన్ని ఇబ్బందులు పెట్టినా… ఎన్ని నోటీసులు ఇచ్చినా నేను వెనక్కి తగ్గనని స్పష్టం చేశారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చే వరకు…ప్రజల తరఫున మిమ్మల్ని ప్రశ్నిస్తూనే ఉంటానని, నిలదీస్తూనే ఉంటానని, ఇది నా వ్యక్తిగత పోరాటం కాదు…
ప్రజల కోసం చేసే బాధ్యత అని తెలిపారు. ప్రశ్నించే గొంతును అణుచలేరు…
ప్రజల కోసం నా పోరాటం కొనసాగుతూనే ఉంటుందని పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి :
Stampede At Sheetla Temple | ఆలయంలో తొక్కిసలాట.. 8 మంది భక్తుల మృతి!
Jayalalithaa building seized| హైదరాబాద్‌లోని మాజీ సీఎం జయలలిత భవనం సీజ్
