తాజా మాజీ ఎమ్మెల్యేలపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత మండిపాటు

నిజామాబాద్ లోక్ సభ నియోజకవర్గ సమీక్ష సమావేశంలో బీఆర్ ఎస్ ఎమ్మెల్సీ కవిత ఇటీవల ఎన్నికల్లో ఓడిపోయిన మాజీ ఎమ్మెల్యేలపై మండిపడ్డారు.

నిజామాబాద్ లోక్ సభ నియోజకవర్గ సమీక్ష సమావేశంలో బీఆర్ ఎస్ ఎమ్మెల్సీ కవిత ఇటీవల ఎన్నికల్లో ఓడిపోయిన మాజీ ఎమ్మెల్యేలపై మండిపడ్డారు. కార్యకర్తలు అధిష్టానాన్ని కలవకుండా కొందరు నేతలు అడ్డుపడ్డారని తాను స్వయంగా కార్యకర్తలను కలిసేందుకు వస్తే రకరకాల అడ్డంకులు సృష్టించారని కవిత ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ ఉద్యమంలో అండగా నిలబడ్డ నిజామాబాద్ జిల్లాలో బీఆర్ఎస్ ఓడిపోయిందంటే ఆత్మ పరిశీలన చేసుకోవాలని అసహనం వ్యక్తం చేశారు. అయితే ఈసారి నిజామాబాదులో ఎంపీ సీటు గెలిచి కేసీఆర్ కు బహుమతిగా అందివ్వాలని కవిత కోరారు

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ లోక్ సభ ఎన్నికల్లో త్రిముఖ పోరు ఉంటుందని గట్టిగా పోరాడితే ఎన్నికల్లో విజయం సాధిస్తామన్నారు . తెలంగాణ ప్రయోజనాల పరిరక్షణ కోసం ఢిల్లీలో గులాబీ జెండా ప్రాతినిధ్యం ఉండాల్సిందేనన్నారు..ఎన్నికల్లో గెలిచేందుకు కాంగ్రెస్ పార్టీ అడ్డగోలు హామీలు ఇచ్చి ప్రజలను పక్కదారి పట్టించిందన్నారు. హామీల అమలుపై కాంగ్రెస్ ఇప్పటికే మాట దాట వేస్తుందన్నారు అప్పులు.. శ్వేత పత్రాలు అంటూ అభయ హస్తం హామీలను తప్పించుకునే ప్రయత్నం చేస్తుందని ఆరోపించారు. ఇప్పటికే గృహలక్ష్మి పథకాన్ని రద్దు చేసిందని ఆయన గుర్తు చేశారు. అంతే కాదు దళిత బంధు పథకం పైన ప్రభుత్వం స్పందించడం లేదని మండిపడ్డారు.



కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది ఆరు గ్యారెంటీలు కాదు 420 హామీలను విమర్శించారు.. అసెంబ్లీ సాక్షిగా నిరుద్యోగ భృతి ఇవ్వలేమని డిప్యూటీ సీఎం భట్టి మాట తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారన్నారు. పేదల కోసం బీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన పథకాలను కాంగ్రెస్ ప్రభుత్వం రద్దు చేసేందుకు కుట్ర చేస్తుందని ఆరోపించారు. దళిత బంధు, బీసీ బంధు ,గృహలక్ష్మి ఇతర సంక్షేమ కార్యక్రమాలను రద్దు చేస్తే ఆయా లబ్ధిదారులతో కలిసి బీఆర్ఎస్ పోరాటం చేస్తుందన్నారు. రైతుబంధు డబ్బులు వేయకుండా ప్రభుత్వం మభ్యపెట్టే ప్రయత్నం చేస్తుందన్నారు.