విధాత : గ్రూప్ 2 అభ్యర్ధి ప్రవళిక ఆత్మహత్య సందర్భంగా ఆందోళన నిర్వహించిన పలు పార్టీల నాయకులు, విద్యార్ధి సంఘాల నాయకులపై పోలీసులు కేసులు నమోదు చేశారు. సెక్షన్స్ 143, 148, 341, 332 ఆర్‌డబ్ల్యు 149 ఐపీసీల కింద 13మందిపై కేసులు నమోదు చేశారు.
కాగా.. కేసులు మోపబడిన వారిలో బీజేపీ ఎంపీ లక్ష్మణ్, కాంగ్రెస్ నేతలు, మాజీ ఎంపీ అనిల్ కుమార్ యాదవ్, ఫిరోజ్ ఖాన్, కార్పొరేటర్ విజయా రెడ్డి, ఓయూ నేతలు సురేష్ యాదవ్, భాను ప్రకాష్, నీలిమ, జీవన్ లపై కేసులు నమోదు చేశారు. పోలీసులు ఈ కేసులో నాయకులపై కేసులు పెట్టడటం పట్ల రాజకీయ పార్టీలో, విద్యార్ధి సంఘాల్లో నిరసన వ్యక్తమవుతున్నది.
ప్రవళిక కేసులో పురోగతి..శివరాం అరెస్టు
ప్రవళిక ఆత్మహత్య కేసులో పోలీసులు కీలక పురోగతి సాధించారు. ఆమె ప్రియుడుగా భావిస్తున్న శివరాంను అదుపులోకి తీసుకున్నారు. అతడి కోసం ఐదు బృందాలుగా గాలించిన పోలీసులు ఎట్టకేలకు అతడిని అరెస్టు చేయడంతో ఈ కేసులో చిక్కుముడులు వీడే అవకాశముంది. ఆమె ఆత్మహత్యకు శివరాం కారణమని పోలీసులు, ప్రభుత్వం, కుటుంబ సభ్యులు చెబుతున్నారు. ప్రతిపక్షాలు, విద్యార్ధి సంఘాలు మాత్రం ప్రభుత్వమే రాజకీయ కోణంలో కేసును తప్పుదోవ పట్టిస్తుందని ఆరోపిస్తున్నారు.