Y-Category Security To Mallojula Venugopal & Ashanna | లొంగిపోయిన మావోయిస్టులకు Y- కేటగిరి భద్రత
ప్రభుత్వానికి లొంగిపోయిన మావోయిస్టు నాయకులు మల్లోజుల వేణుగోపాల్, ఆశన్నలకు కేంద్రం వై కేటగిరీ భద్రత కల్పించనుంది. భద్రత ఏర్పాట్లు మొదలయ్యాయి.

విధాత, హైదరాబాద్: ఇటీవల ప్రభుత్వానికి ఆయుధాలు అప్పగించి లొంగిపోయిన మావోయిస్టు అగ్రనాయకులు మల్లోజుల వేణుగోపాల్ అలియాస్ సోను, తక్కళ్లపల్లి వాసుదేవరావు అలియాస్ ఆశన్నలకు కేంద్ర ప్రభుత్వ వై కేటగిరీ భద్రత కల్పించాలని నిర్ణయించినట్లు కేంద్ర ఇంటెలిజెన్స్ వర్గాల సమాచారం. ప్రస్తుత పరిస్థితుల్లో సాయుధ పోరాటాన్ని విరమించాలని భావించిన మల్లోజుల వేణుగోపాల్, ఆశన్నలను పార్టీలోని ఒక వర్గం తీవ్రంగా వ్యతిరేకించింది. దీంతో మల్లోజుల,ఆశన్నలు తమ మద్దతు దారులతో కలిసి మహా రాష్ట్ర ముఖ్యమంత్రి ఫడ్నవిస్ వద్ద మల్లోజుల, చత్తీస్ ఘడ్ సీఎం విష్ణుదేవ్ సాయ్ ముందు ఆశన్నలు తమ మద్దతు దారులతో కలిసి ఆయుధాలు అప్పగించి లొంగి పోయారు. ఆతరువాత జరిగిన పరిణామాల నేపధ్యంలో మావోయిస్టు పార్టీ అభయ్ పేరుతో వీరిద్దరిని విప్లవ ద్రోహులుగా అభివర్ణిస్తూ వీరికి ప్రజలు శిక్ష వేస్తారని ప్రకటించింది. మావోయిస్టు పార్టీ నాయకులు ప్రజలు శిక్షిస్తారని ప్రకటించారంటే తాము చంపేస్తామని పరోక్షంగా ప్రకటన చేసినట్లుగానే ఉంటుందన్న అభిప్రాయం ప్రజల్లో ఉంది. దీంతో ప్రభుత్వానికి ఆయుధాలు అప్పగించి అజ్ఞాత వాసం నుంచి బయటకు వచ్చిన మల్లోజుల, ఆశన్నలకు పూర్తి స్థాయి భద్రత కల్పించడం కోసమే కేంద్రం వై కేటగిరి భద్రత ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు ఇంటిలిజెన్స్ వర్గాల ద్వారా తెలుస్తున్నది. ముఖ్యంగా మహారాష్ట్ర పోలీసులు ఈ భద్రతకు ఏర్పాట్లు చేస్తున్నట్లు సమాచారం.