స్టేష‌న్ ఘ‌న్‌పూర్ నియోజ‌క‌వ‌ర్గంలోని మాణిక్య‌పురం అనే గ్రామంలో చుక్క స‌త్త‌య్య అనే పేరుమోసిన ఒగ్గు క‌ళాకారుడు ఉండే. నీళ్లు ప‌డ‌క‌పోతే 58 బోర్లు వేస్తే చుక్క నీరు రాలేద‌ని ముఖ్య‌మంత్రి కేసీఆర్ గుర్తు చేశారు.

విధాత‌: స్టేష‌న్ ఘ‌న్‌పూర్ నియోజ‌క‌వ‌ర్గంలోని మాణిక్య‌పురం అనే గ్రామంలో చుక్క స‌త్త‌య్య అనే పేరుమోసిన ఒగ్గు క‌ళాకారుడు ఉండే. నీళ్లు ప‌డ‌క‌పోతే 58 బోర్లు వేస్తే చుక్క నీరు రాలేద‌ని ముఖ్య‌మంత్రి కేసీఆర్ గుర్తు చేశారు. ఆ బోర్లు వేసుడు ఎంత బాధ‌. ఒక‌డు కొబ్బ‌రికాయ‌, ఒక‌డు తాళ‌పుచెవిల గుత్తి, ఒక‌డు తంగేడు పుల్ల ప‌ట్టుకొని వ‌స్త‌డు. ఎన్నిక‌ల ర‌కాల బాధ‌లు చూశాం. అవ‌స్థ‌లు ప‌డ్డాం. మోటార్లు, ట్రాన్స్‌ఫార్మ‌ర్లు కాలితే బాధ అయింది.

చుక్క స‌త్త‌య్య త‌న ఒగ్గు క‌థ‌ల మీద వ‌చ్చిన పైస‌ల‌న్నీ ఆ బోరు పొక్క‌ల్లోనే పోశారు. 58 బోర్లు వేస్తే చుక్క నీరు రాలేదు. ఇది చుక్క స‌త్త‌య్య క‌థ‌. ఇంత ఘోరం ఉండే స్టేష‌న్ ఘ‌న్‌పూర్‌లో. ఎక్క‌డ నీళ్లు లేకుండే. దేవాదుల కాడ ప‌నులు జ‌ర‌గ‌క‌పోతే ఇదేం స్కీం రా నాయనా అని పోయి పిండం పెట్టి వ‌చ్చిండు ఎమ్మెల్యే రాజయ్య‌. పిండం పెట్టి ఆనాడు ప్ర‌భుత్వాన్ని నిల‌దీశాడు. మీరు బేకార్ గాళ్లు అని మండిప‌డ్డారు.

ఇలా అనేక బాధ‌లు ఉండే. ఆ బాధ‌ల‌న్నీ ఇవాళ లేవు. ఒక ల‌క్షా 10 వేల ఎక‌రాల‌కు స‌స్య‌శ్యామ‌లంగా నీళ్లు పారుతున్నాయి. వేలేరుకు నీళ్లు రావాల‌ని కొట్లాడి తెచ్చుకున్నారు. మ‌ల్క‌పురం రిజ‌ర్వాయ‌ర్ కావాల‌ని క‌డియం శ్రీహ‌రి కోరుతా ఉండే. ఇట్ల నీళ్ల కోసం ఇక్క‌డి బిడ్డ‌లు తండ్లడారు కాబ‌ట్టి.. గ‌వ‌ర్న‌మెంట్ స‌హ‌క‌రించింది కాబ‌ట్టి ల‌క్ష 10 వేల ఎక‌రాల‌కు నీళ్లు వ‌చ్చాయి.

క‌నీసం ఇంత పంట‌లు పండించుకుని ఒక తెలివికి వ‌చ్చాం. బోర్ల బాధ, క‌రెంట్ బాధ త‌ప్పింది. వాగులు, న‌దుల మీద చెక్ డ్యాంలు క‌ట్టుకున్నాం. భూగ‌ర్భ జ‌లాలు పెరిగాయి. బోర్ల‌లో నీళ్లు మంచిగా వ‌స్తున్నాయి. రైతాంగానికి దేవాదుల ద్వారా నీళ్లు వ‌స్తున్నాయి. దేశ వ్యాప్తంగా ముక్కు పిండి నీళ్ల ట్యాక్స్ వ‌సూలు చేస్తున్నారు. కానీ మ‌న ద‌గ్గ‌ర నీటి తిరువా ర‌ద్దు చేశాం.

కాంగ్రెస్ నాయ‌కులు మాట్లాడితే కొన్ని విష‌యాల్లో సిగ్గుండాలి. రైతురుణ‌మాఫీ చేస్తామ‌ని రెండు సార్లు చెప్పాం. బాజాప్తా చేసినం. అందులో క‌రోనా రావ‌డం వ‌ల్ల ఒక సంవ‌త్స‌రం ఆదాయం సున్నా అయింది. రూపాయి కూడా రాలేదు. దాని వ‌ల్ల లేట్ అయింది. లేదంటే ఎప్పుడ అయిపోవు రైతు రుణ‌మాఫీ. రుణ‌మాఫీ మూడేండ్ల కింద‌నే అయిపోవాలి. క‌రోనా కొట్టిన దెబ్బ‌కు రాష్ట్ర ప్ర‌భుత్వ ఆదాయం ప‌డిపోయి ఆల‌స్య‌మైంది. మొన్న చేసినం. 90 శాతం అయిపోయింది రుణ‌మాఫీ. ఏనుగు వెళ్లింది తోక చిక్కింది. ల‌క్ష వ‌ర‌కు అంద‌రికీ అయిపోయింది.

ఆ పైన ఉన్నోళ్ల‌కు ఓ నాలుగైదు శాతం మందికి మిగిలింది. అది ఇయ్య‌మా మేం. దాన్ని కూడా ఇష్యూ చేశారు కాంగ్రెసోళ్లు. అడ్డు ప‌డ్డ‌ది కూడా కాంగ్రెసోడే. ఎల‌క్ష‌న్ క‌మిష‌న్‌కు ఫిర్యాదు చేసి ఇప్పుడు ఇవ్వొద్ద‌ని ఫిర్యాదు చేసిండు. మ‌ళ్లా బ‌జార్ల‌కు వ‌చ్చి రుణ‌మాఫీ కాలేద‌ని మాట్లాడుతున్న‌రు. సిగ్గు కూడా ఉండాలి. మిగిలిన‌ వాళ్ల‌కు కూడా 100 శాతం ఇమిడియ‌ట్‌గా ఇచ్చేస్తాం. దాని గురించి అస‌లు ఆలోచించే అవ‌స‌రం లేదు రైతులు. మంచేదో, చెడు ఏందో నిర్ణ‌యించాలి.. ఆలోచించి ఓటేయాలి.

ఇందిర‌మ్మ రాజ్యం తెస్తామ‌ని కాంగ్రెస్ నేత‌లు అంటున్న‌రు. ఇందిర‌మ్మ రాజ్యం అంతా ఆక‌లే క‌దా..? ఎమ‌ర్జెన్సే క‌దా..? ఎన్‌కౌంట‌ర్లు, న‌క్స‌లైట్ ఉద్య‌మాలే క‌దా..? ఇందిర‌మ్మ రాజ్యం ఏం చ‌క్క‌ద‌నం ఏడ్సింది. మందిని ప‌ట్టుకుపోయి జైళ్లో ప‌డేసిండ్రు క‌దా..? మంచినీళ్లు, క‌రెంట్ లేకుండే క‌దా..? ఇవాళ ఎవ్వ‌ళ్ల‌కు కావాలి ఇందిర‌మ్మ రాజ్యం. ఎవ్వ‌ళ్లు కోరుతున్నారు.. ఇందిర‌మ్మ రాజ్యం కావాల‌ని మ‌నం కోరుతున్నామా..? ఆ దిక్కుమాలిన రాజ్యం. ఏముండే, ఏం జ‌రిగింది. ఏం లేదు. బ‌లిసినోడు బ‌లిసిపోయిండు.. తిండికి లేనోడు తిండికి పోయిండు.

ఇందిర‌మ్మ రాజ్యం అంత స‌క్క‌ద‌నం ఉంటే ఎన్టీ రామారావు ఎందుకు పార్టీ పెట్టాల్సి వ‌చ్చింది. రూ. 2కే బియ్యం ఎందుకు ఇయ్యాల్సి వ‌చ్చింది. మాడిన క‌డుపులు ఉన్నాయ‌ని, ఎండుతున్న డొక్క‌లు ఉన్నాయ‌ని నాడు 2 రూపాయాల‌కే బియ్యం పెట్టాల్సి వ‌చ్చింది. మీ అంద‌రికీ తెలుసు. ఇందిర‌మ్మ రాజ్యం స‌క్క‌గా ఉంటే రామారావు పార్టీ ఎందుకు పెట్టాల్సి వ‌చ్చింది. మ‌నం ఆలోచ‌న చేయాలి. ప్ర‌జాస్వామ్య ప‌రిణితితో ఈ నిర్ణ‌యాలు చేయాలి.

ఆర్టీసీ బిడ్డ‌లు ఉన్నారు. వాళ్ల‌ది పాపం ఎప్పుడు ఉద్యోగం పోత‌దో తెల్వ‌దు. ఒక అభ‌ద్ర‌తా భావం. ఆర్టీసీ బిల్లు పాస్ చేసినం. అది గ‌వ‌ర్న‌ర్ ఆల‌స్యం చేయ‌డం వ‌ల్ల అది కొంత‌ ఆల‌స్య‌మైంది. ఎల‌క్ష‌న్ తెల్లారే ఆర్టీసీ బిడ్డ‌ల‌ను రెగ్యుల‌రైజ్ చేసి గ‌వ‌ర్న‌మెంట్ ఉద్యోగ‌స్తులుగా చేస్తాం. మ‌న వ‌ద్ద ల‌క్ష‌ల మంది ఆటో రిక్షా బిడ్డ‌లు ఉన్నారు. ఇండియా మొత్తంలో ఆటో రిక్షాల‌కు ట్యాక్స్ ఉంది. ఒక్క తెలంగాణ రాష్ట్రంలో లేదు. వారు పేద‌వాళ్లు బ‌తుకుతున్నార‌ని ట్యాక్స్ మిన‌హాయింపు ఇచ్చాం. వాళ్ల‌కు ఇంకో స‌మ‌స్య ఉంది. ఏందంటే ఫిట్‌నెస్ కోసం పోతే ఏడాదికి రూ. 1200 క‌ట్టాల్సి వ‌స్తుంది.

అది కూడా ఎలక్ష‌న్ తెల్లారి ర‌ద్దు చేస్తామ‌ని చెబుతున్నా. ఆటో రిక్షా కార్మికుల‌కు కూడా ఫిట్‌నెస్ ట్యాక్స్‌, ప‌ర్మిట్ ట్యాక్స్ ర‌ద్దు చేస్తాం. జీరో చేస్తాం. ప్ర‌భుత్వానికి రూ. 100 కోట్ల న‌ష్టం వ‌స్త‌ది అయినా ప‌ర్వాలేదు. వాళ్లు పేద‌వాళ్లు ఐదారు ల‌క్ష‌ల మంది ఆటో న‌డిపి బ‌తికేవారు ఉన్నారు. వాళ్ల సంక్షేమం కోసం అది కూడా చేస్తామ‌ని క‌రీంన‌గ‌ర్‌లో ప్ర‌క‌ట‌న చేశాను. ఆ విధంగా ఆటో కార్మికుల‌ను ఆదుకుంటాం. అలా ప్ర‌తి వ‌ర్గాన్ని ఆదుకుంటూ ముందుకు పోతున్నాం.

క‌డియం శ్రీహ‌రి గురించి నేను ఎక్కువ చెప్పాల్సిన అవ‌స‌రం లేదు. టికెట్ శ్రీహ‌రికి ఇచ్చామ‌ని రాజయ్య‌ను చిన్న‌చూపు చూడం. ఆయ‌న కూడా మంచి హోదాలో, ప‌ద‌విలో ఉంటారు. ఎవ‌రు బాధ‌ప‌డాల్సిన అవ‌స‌రం లేదు. నేను మీకు మాట ఇస్తున్నా.. రాజయ్య కూడా మంచి హోదాలో బ్ర‌హ్మాండంగా ఉంటారు. ఆయ‌న కూడా సేవ చేస్త‌నే ఉంటారు. దానికి ఇబ్బందేం లేదు. కానీ శ్రీహ‌రి గురించి ఆయ‌న‌ చరిత్ర చాలా పెద్ద‌ది.

ఘ‌న‌పురంలో ఆయ‌న ఎట్ల ప‌ని చేసిండో, అభివృద్ధి కోసం ఎట్ల తండ్లాడిండో మీ అంద‌రికీ కూడా తెలుసు. ఆయ‌న మంత్రిగా ఉన్న‌ప్పుడు, లేన‌ప్పుడు ప్ర‌జ‌ల రైతుల గురించి ఎంత సేవ చేసిండో నేను మీకు చెప్పే అవ‌స‌రం లేదు. ఆయ‌న గెలిస్తే బ్ర‌హ్మాండంగా ఘ‌న‌పురం అభివృద్ధి జ‌రుగుత‌ది. ఆయ‌న కోరిన కోరిక‌లు గొంతెమ్మ కోరిక‌లు కావు. ఘ‌న‌పురం మున్సిపాలిటీ, కొన్ని విద్యాసంస్థ‌లు రావాల‌ని కోరారు. అవ‌న్నీ చేయించే బాధ్య‌త నాది అని మ‌న‌వి చేస్తున్నా. క‌డియం శ్రీహ‌రి మంచి, ఉత్త‌మ‌మైన నాయ‌కుడు, గెలిపించాల‌ని కోరుతున్నా.

Updated On
Somu

Somu

Next Story