Hyderabad Middle Class Housing Crisis | మధ్యతరగతి ప్రజల సొంతింటి కలలపై నీళ్లు చల్లుతున్న భూముల ధరలు

హైదరాబాద్‌లో మధ్యతరగతి ప్రజల సొంతింటి కలలు రోజు రోజుకూ భారమై.. దూరమైపోతున్నాయి. కోకాపేట నియోపొలిస్‌ వంటి చోట్ల భూముల ధరలు పెరిగిపోయాయని ప్రభుత్వం సంబరపడినా.. అక్కడ నిర్మించే అపార్ట్‌మెంట్లలో ఫ్లాట్లు కొనలేని దీనావస్థకు మధ్యతరగతి వర్గం నెట్టేవేతకు గురవుతున్నది.

Hyderabad Middle Class Housing Crisis | మధ్యతరగతి ప్రజల సొంతింటి కలలపై నీళ్లు చల్లుతున్న భూముల ధరలు

హైదరాబాద్‌, విధాత ప్రతినిధి:

Hyderabad Middle Class Housing Crisis |  హైదరాబాద్ మహా నగరంలో మాజీ ముఖ్యమంత్రి ఎన్ చంద్రబాబు హయాంలో ప్రారంభమైన ప్రభుత్వ భూముల వేలం కార్యక్రమం నిరంతరంగా సాగుతునే ఉంది. పార్టీలు మారినా, పాలకులు మారినా ప్రభుత్వ భూములను తెగనమ్మే విధానాలకు ఫుల్‌స్టాప్‌ పడటం లేదు. ఇటీవల నార్సింగి, ఇతర ప్రాంతాలలో భూములను హెచ్ఎండీఏ వేలం వేసింది. కోకాపేట గోల్డెన్ మైల్ ప్రాజెక్టులో ఎకరా రూ.77.75 కోట్లు, కోకాపేట నియోపోలిస్‌లో ఎకరా రూ.131 కోట్ల చొప్పున విక్రయించారు. 2023 రేట్లతో పోల్చితే ఒక ఎకరాపై 87 శాతం ధరల పెరుగుదల కనిపించింది. నియోపోలిస్‌ లే అవుట్‌లో మూడు విడతల వేలం పాటల్లో రూ.3,708 కోట్లు ప్రభుత్వ ఖజానాలో జమయ్యాయి. ఈ ఏడాది భూముల వేలం ద్వారా రూ.20వేల కోట్ల నిధులు సమకూర్చుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఫలితంగా ఔటర్ రింగ్ రోడ్డు పరిధి లోపల మధ్య తరగతి జీవి గజం భూమిని కొనలేని దుస్థితిని తీసుకువచ్చారన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మంచి రెసిడెన్షియల్ అపార్ట్‌మెంట్‌లో ఫ్లాట్ కొనుగోలు చేయాలన్నా కనీసం రెండు కోట్లు వెచ్చిస్తే తప్ప దొరకని దుస్థితిని కల్పిస్తున్నారనే విమర్శలు మొదలయ్యాయి. ఇలా భారీ ధరలతో భూములను విక్రయించుకుంటూ పోతే మధ్య తరగతి ప్రజల బతుకులు ఏంటనే ప్రశ్న సామాజికవేత్తలను ఆలోచనలో పడేస్తున్నది.

గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ పరిధిని ఇప్పుడున్న 650 చదరపు కిలోమీటర్ల నుంచి రెండు వేల చదరపు కిలోమీటర్ల వరకు విస్తరిస్తూ ప్రభుత్వం ఇటీవలే ఉత్తర్వులు జారీ చేసింది. మహా నగరం చుట్టూ ఉన్న 7 కార్పొరేషన్లు, 20 మునిసిపాలిటీలను విలీనం చేశారు. దీంతో జీహెచ్ఎంసీ పరిధి ఔటర్ రింగ్ రోడ్డు వరకు విస్తరించింది.
విలీనం తరువాత జోన్లు, సర్కిళ్ల పునర్విభజన వేగంగా సాగుతున్నది. పెరిగిన 2వేల చదరపు కిలోమీటర్ల పరిధిలో మూడు లేదా నాలుగు కార్పొరేషన్లు ఏర్పాటు చేయాలనే ఆలోచనలో రాష్ట్ర ప్రభుత్వం ఉన్నట్టు తెలుస్తున్నది. రాచకొండ, సైబరాబాద్, హైదరాబాద్ పేరుతో కార్పొరేషన్లు ఏర్పాటు అయ్యే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. మెరుగైన మౌలిక సదుపాయాలు, పౌర సేవలను కల్పించేందుకు పరిధి విస్తరించడం బాగానే ఉన్నా ఆ మేరకు ప్రజల కొనుగోలు శక్తిని పెంచడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమవుతోందన్న అభిప్రాయాలను నిపుణులు వ్యక్తం చేస్తున్నారు. తద్వారా మధ్య తరగతి కుటుంబాలు జీవించలేని పరిస్థితులను కల్పిస్తున్నారని అంటున్నారు.

హైదరాబాద్‌ ఇక నివాస యోగ్యం కాదా? పట్టని పాలకులు.. అడ్డగోలుగా అనుమతులు

మధ్య తరగతి కుటుంబాలు ప్రతి నెలా రూ.20వేల నుంచి రూ.25వేల వరకు ఇంటి అద్దెలకే వెచ్చించాల్సి వస్తున్నది. దిగువ మధ్య తరగతి ప్రజల పరిస్థితి మరింత దయనీయంగా ఉంది. నగరంలో పెద్ద ఎత్తున ఖాళీ ప్రభుత్వ స్థలాలు అందుబాటులో ఉన్నా డబుల్ బెడ్ రూమ్‌ ఇళ్లు, ఎల్ఐజీ, ఎంఐజీ క్వార్టర్స్‌ నిర్మాణానికి ఎలాంటి చొరవా చేయడం లేదు. ఉమ్మడి రాష్ట్రంలో మధ్య తరగతి ప్రజల కోసం ప్రభుత్వం భారీగా ఎల్ఐజీ, ఎంఐజీ ఇళ్లను నిర్మించి తక్కువ ధరకు విక్రయించింది. ఉదాహరణకు బాగ్ లింగంపల్లి, విజయనగర్ కాలనీలను చెప్పుకోవచ్చు. ఇదే తరహాలో మధ్య తరగతికి ఇళ్లను నిర్మిస్తే ఎంతో ప్రయోజనకరంగా ఉంటుందని అంటున్నారు. రెండంతస్తుల భవనాలు నిర్మాణం చేస్తే గిట్టుబాటు కాని స్థితి ఉన్నట్లయితే పది అంతస్తుల రెసిడెన్సియల్ అపార్ట్‌మెంట్లు నిర్మాణం చేసినా మధ్య తరగతి ప్రజలు కొనుగోలు చేస్తారని చెబుతున్నారు.

ప్రత్యేక రాష్ట్రం వచ్చిన తరువాత హౌసింగ్ బోర్డు పనిచేయడం లేదని, ప్రజల డిమాండ్‌కు తగ్గట్లుగా ప్రాజెక్టులను చేపట్టడంలో రాజీవ్ స్వ‌గృహ‌ కార్పొరేషన్ విఫలమైందనే విమర్శలు ఉన్నాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఒక పద్దతి, విధానం లేకుండా ఇష్టానుసారంగా నాగోల్ బండ్లగూడ, జవహర్ నగర్ వంటి ప్రాంతాలలో నిర్మించిన ఇళ్లు ఇప్పటికీ బోసిబోయి ఉన్నాయి. ఒక్క లింగంపల్లిలో మాత్రమే పూర్తి స్థాయిలో కొనుగోలుదారులు వినియోగించుకుంటున్నారు.

Skyscrapers | హైదరాబాద్ నగరంలో ఆకాశ హర్మ్యాలతో లాభమా? నష్టమా?

హైదరాబాద్ కోర్ ఏరియాలో ప్రాంతాన్ని బట్టి రెసిడెన్షియల్ అపార్ట్‌మెంట్‌లో ఒక చదరపు అడుగు కనీసం ఆరు వేల రూపాయల నుచి ఎనిమిది వేల రూపాయల మధ్య విక్రయిస్తున్నారు. రోడ్లు విశాలంగా ఉన్న కాలనీల్లో చదరపు అడుగు 8వేల నుంచి 10వేల చొప్పున అమ్ముతున్నారు. నగరం చుట్టు పక్కల ఎక్కడా చదరపు గజం ఆరువేలకు తక్కువకు విక్రయించడం లేదు. హైదరాబాద్ నగరంలో ఉన్న మధ్య తరగతి ప్రజలు ప్రధానంగా సేవా రంగం, సాఫ్ట్‌వేర్‌, చిన్న చిన్న పరిశ్రమలు, ఫార్మా కంపెనీలు, వృత్తి నిపుణులు, వ్యాపార సంస్థల్లో పనిచేసే ఉద్యోగులు ఉన్నారు. ఈ వర్గం వారు ఎక్కడైనా అపార్ట్‌మెంట్‌లో ఫ్లాట్ కొనుగోలు చేయాలంటే కనీసం రూ.1.5 కోట్లు వెచ్చించాల్సి వస్తున్నది. ఆ స్థాయిలో కొనుగోలు శక్తి లేకపోవడం, ఆర్థిక పరిస్థితులు అనుకూలించకపోవడం మూలంగా అద్దె ఇళ్లల్లోనే బతుకు వెళ్లదీస్తున్నారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం మధ్య తరగతి, సామాన్య ప్రజల ఆర్థిక పరిస్థితులను పరిగణనలోకి తీసుకుని ప్రభుత్వ స్థలాల్లో రెసిడెన్షియల్ అపార్ట్ మెంట్లు నిర్మించాల్సిన అవసరం ఎంతైనా ఉందని ప్రజలు కోరుతున్నారు.

Read Also |

Silver Price : 2లక్షల మార్క్ వైపు.. వెండి ధర పరుగు
Garlic | చ‌లికాలంలో ‘వెల్లుల్లి’.. శ‌రీరానికి ఒక వ‌రం..!
Snake Jumps In Air To Hunt Bird : షాకింగ్ వీడియో..ఆకాశంలో పక్షిని వేటాడిన పాము!