విధాత, హైదరాబాద్ : సింగరేణి కార్మికులకు దసరా సందర్భంగా రూ.819కోట్ల బోనస్ ను అందిస్తున్నట్లుగా సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. సచివాలయంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో పాటు పలువురు మంత్రులతో కలిసి ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో రేవంత్ రెడ్డి సింగరేణి కార్మికులకు లాభాల వాటా ప్రకటన చేశారు.
సింగరేణి మొత్తం ఆదాయం రూ.6394 కోట్లుగా వచ్చిందని..ఇందులో రూ.4034 కోట్లు భవిష్యత్ పెట్టుబడులకు కేటాయించాం అని..రూ. l2360 కోట్లు నికర లాభాలు వచ్చాయని రేవంత్ రెడ్డి వెల్లడించారు. వచ్చిన లాభాలలో 34 శాతం రూ.819 కోట్లు పర్మినెంట్ కార్మికులకు బోనస్ కోసం కేటాయించాం అని తెలిపారు. 30వేల మంది కాంట్రాక్ట్ ఉద్యోగులకూ రూ.5,500 చొప్పున అందజేస్తాం అని..కాంట్రాక్ట్ కార్మికులకు బోనస్ ఇవ్వడం దేశ చరిత్రలోనే తొలిసారని చెప్పారు. కోల్ ఇండియా నుంచి వచ్చే బోనస్‌ను దీపావళికి పంపిణీ చేస్తాం అని తెలిపారు.
తెలంగాణ రాష్ట్ర సాధనలో సింగరేణి కార్మికుల పోరాటాన్ని చరిత్ర ఎప్పటికీ మరువదు అని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. రాష్ట్ర సాధన ప్రక్రియలో ప్రత్యేక పాత్ర పోషించిన సింగరేణి కార్మికులను మా పార్టీ, ప్రభుత్వం ఎప్పటికీ గుర్తిస్తూనే ఉంటుంది అన్నారు. సింగరేణిని లాభాల బాటలో నడిపించేందుకు కార్మికులు ఎంతో కృషి చేస్తున్నారని..అందుకే సింగరేణి లాభాలలో కార్మికులకు వాటాలు పంచాలని మా ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని తెలిపారు. కార్పొరేట్ కంపెనీలతో పోటీ పడేలా సింగరేణిని తీర్చిదిద్దుతాం అని తెలిపారు. కేంద్రం జీఎస్టీని సవరించడంతో రాష్ట్రానికి దాదాపు రూ.7 వేల కోట్లు ఆదాయం తగ్గిందని, తక్షణమే రాష్ట్రానికి జరిగే నష్టాన్ని కేంద్రమే పూడ్చాలని డిమాండ్ చేస్తున్నాం అన్నారు. ఏకపక్షంగా నిర్ణయం తీసుకుని రాష్ట్రాలపై భారం వేయడం సరికాదు. వచ్చే ఐదేళ్లపాటు కేంద్రం వయబులిటీ గ్యాప్ ఫండ్ ఇవ్వాలి అని రేవంత్‌రెడ్డి అన్నారు.
ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టిన గనులను కూడా సింగరేణికి అప్పగించేలా చూడాలని కార్మికులు కోరుతున్నారని..
ప్రైవేటు భాగస్వామ్యం పెరుగుతూ పోతే భవిష్యత్ లో సింగరేణి మనుగడ ప్రశ్నార్థకం అవుతుందన్నారు.
ఈ సమస్యను పరిష్కరించాల్సిన అవసరం ఉంది.. ఆ దిశగా కేంద్రంతో మాట్లాడి సమస్య పరిష్కారానికి కృషి చేస్తాం అన్నారు. భవిష్యత్ లో కార్మికులకు అండగా ఉంటాం.. సింగరేణి సంస్థను లాభాల బాటలో పయనించేందుకు కృషి చేస్తాం అని రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, వివేక్ వెంకటస్వామి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, శ్రీధర్ బాబు, సిఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి, ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్ అలీ, హర్కర వేణుగోపాల్, ఎంపీలు రఘురాం రెడ్డి, బలరాం నాయక్, సింగరేణి సీఎండీ బలరాం, ఎమ్మెల్యేలు, కార్పొరేషన్ చైర్మన్లు పాల్గొన్నారు.