విధాత : 2028 డిసెంబర్లో ఎన్నికలు జరగబోవని..2029 మే, జూన్ లోనే ఎన్నికలు జరుగుతాయని..ఎంపీ సీట్లు 26కు, అసెంబ్లీ సీట్లు 182కు పెరుగుతాయని…రాబోయే ఎన్నికల కురుక్షేత్రంలో కాంగ్రెస్ పార్టీ 20 ఎంపీ స్థానాలలో, 117 అసెంబ్లీ స్థానాలకు పైగా రెండోసారి గెలుస్తుందని సీఎం రేవంత్ రెడ్డి జోస్యం చెప్పారు. గడిచిన అసెంబ్లీ ఎన్నికల్లో విజయంతో పాపాల భైరవుడి కేసీఆర్ ను కాంగ్రెస్ లో బంధించామని, ఆ పశుపతి ఇక బయటకు వచ్చేది లేదని, వచ్చే ఎన్నికల్లో కల్వకుంట్ల కౌరవ కుటుంబాన్ని శాశ్వతంగా పాతాళంలోకి తొక్కుతామని స్పష్టం చేశారు. ఖమ్మం రైతు ఆశీర్వాద సభలో సీఎం రేవంత్ రెడ్డి ప్రసంగించారు.
ఇటీవల జరిపిన సర్వేలో వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ ఓడిపోతుందని, బీఆర్ఎస్ మళ్లీ అధికారంలోకి వస్తుందని తేలిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేసిన వ్యాఖ్యలను సీఎం రేవంత్ రెడ్డి ఖమ్మం వేదికగా గట్టిగా తిప్పికొట్టారు. సొంత భజన మండలి దొంగ సర్వేలతో బీఆర్ఎస్ నాయకులు భ్రమల్లో తేలుతున్నారని, జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లోనూ విజయం బీఆర్ఎస్ దేనని, రెఫరెండమ్ అని చెప్పుకున్నారని, ప్రజలు ఆ పార్టీని బండకేసి కొట్టారని రేవంత్ గుర్తుచేశారు. గత అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఖమ్మంలో నిర్వహించిన భట్టి విక్రమార్క పాదయాత్ర ముగింపు సభలో తాను కాంగ్రెస్ ఆ ఎన్నికల్లో 65స్థానాలు గెలుస్తుందని చెప్పానని రేవంత్ రెడ్డి గుర్తు చేశారు. ఇక్కడి నుంచే మరోసారి చెబుతున్నానని వచ్చే ఎన్నికల్లోనూ కాంగ్రెస్ 117స్థానాల్లో గెలుస్తుందని, ఇది రాముడిపై ఆన..కాంగ్రెస్ కార్యకర్తల ప్రతీన అని రేవంత్ రెడ్డి చెప్పుకొచ్చారు. కల్వకుంట్ల కుటుంబాన్ని తెలంగాణ రాజకీయ ముఖ చిత్రం నుంచి పాతాళానికి తొక్కేవరకు కాంగ్రెస్ కార్యకర్తలు విశ్రమించరని తేల్చి చెప్పారు. రాసి పెట్టుకో చంద్ర శేఖర్ రావు… నీ దొంగ సర్వేలు చేసే దొంగ ఏజెన్సీలు గుర్తు పెట్టుకోండని, ఈ మాట కోసం రోజుకు 18 గంటలు పనిచేస్తాం అని స్పష్టం చేశారు.
బీజేపీతో టచ్ లో హరీశ్ రావు
కేసీఆర్ కుటుంబంలో ఒకరంటే ఒకరికి నమ్మకం లేదని, నిత్యం పరస్పరం కుట్రలు చేసుకుంటారని, బావా బామ్మర్దులు పార్టీలో ఆధిపత్యం కోసం తంటాలు పడుతున్నారని రేవంత్ రెడ్డి ఆరోపించారు. కేసుల బాధకు బీఆర్ఎస్ ను బీజేపీలో విలీనం చేసే ప్రయత్నం చేశారని, ఆంధ్రా కాంట్రాక్టర్ల నుంచి 1,400కోట్ల పార్టీ ఫండ్ కొట్టేశారని సొంత కూతురు కవితనే ఆరోపణలు చేసిందని ఎద్దేవా చేశారు. హరీశ్ రావు చీకట్లో బీజేపీతో మంతనాలు సాగిస్తున్నాడని, అతను బీఆర్ఎస్ లో ఉంటాడో లేదో తెలియదని, బీజేపీలోకి వెళ్లనని మామ కేసీఆర్ మీద, భద్రాచలం రాముడి మీద ఒట్టేసి చెప్పాలని రేవంత్ డిమాండ్ చేశారు. నువ్వు ఎక్కడుంటావో తెలియదు.. మీ బావ ఎటు పోతాడో తెలియదని..ఇన్ని సమస్యలు, అవినీతి మీ ఇంట్లో పెట్టుకుని మళ్లీ తెలంగాణ సమాజం బీఆర్ఎస్ కు ఒటేస్తుందని సిగ్గులేకుండా ప్రచారం చేసుకుంటున్నారంటూ మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తున్న సన్న బియ్యం తిన్నవాళ్ళు, ఇందిరమ్మ ఇల్లు వచ్చిన వాళ్ళు, ఉచితంగా కరెంటు, 500 సిలిండర్, ఆర్టీసీలు ఉచిత ప్రయాణం పొందుతున్న ఆడబిడ్డలు, ఉద్యోగాలు తీసుకున్నా యువకులు, రైతు భరోసా, రుణమాఫీ పొందిన కుటుంబాలు వచ్చే ఎన్నికల్లో మాకు ఓట్లు వేస్తే బీఆర్ఎస్ కు డిపాజిట్ కూడా దక్కదు… ప్రతిపక్ష హోదా కూడా రాదు అని రేవంత్ తేల్చి చెప్పారు.
కన్నెపల్లి పంపులు ఆన్ చేస్తే భద్రాచలం, 44గ్రామాలు ముునుగుతాయి..
స్వార్ధ రాజకీయాల కోసం కన్నెపల్లి పంప్ హౌస్ ఆన్ చేయాలని, మేడిగడ్డలో నీళ్లు ఆపాలని బీఆర్ఎస్ నాయకులు డిమాండ్ చేస్తున్నారని, వారి చెప్పింది చేస్తే భద్రాచలం దేవాలయంతో సహా 44 గ్రామాలు కొట్టుకపోతాయని సీఎం రేవంత్ రెడ్డి పునురుద్ఘాటించారు. ప్రజల ప్రాణాలతో చెలగాటమాడే దుర్మార్గ రాజకీయాలు చేస్తున్నారని రేవంత్ మండిపడ్డారు. మేం పేదల సంక్షేమం కోసం ప్రతీ పేదవాడికి రేషన్ కార్డు, సన్న బియ్యం, 200 యూనిట్ల ఉచిత విద్యుత్, ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చాం అని, రైతు భరోసా 12 వేలకు పెంచాం, రైతు రుణమాఫీ చేసి రుణవిముక్తులను చేశాం అని రేవంత్ రెడ్డి చెప్పుకొచ్చారు. బీఆరెస్ అమలు చేసిన షాది ముబారక్, రైతు బందు పథకాలను మేం కొనసాగిస్తున్నామని గుర్తు చేశారు.
ఔర్ ఏక్ బార్ కాంగ్రెస్ సర్కార్
తెలంగాణలో కాంగ్రెస్ మరోసారి అధికారంలోకి వస్తుందని, ఔర్ ఏక్ బార్ కాంగ్రెస్ సర్కార్ ఖాయం అని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. 2023 జూలై లో పొంగులేటి చేరిక సందర్భంగా ఖమ్మం జిల్లా ప్రజలు ఉప్పెనలా వచ్చి బీఆరెస్ ను బొంద పెట్టారు. ఖమ్మంలో పువ్వాడ..హైదరాబాదులో ఒంటికన్ను శివరాజన్ అనబడే మాజీ మంత్రి పువ్వాడ అజయ్ ఆనాడు డబుల్ బెడ్ రూమ్ లో పేరుతో సినిమా కథలు చెప్పాడని, ఇప్పుడు మంత్రి పొంగులేటి ఏడు లక్షలుఇంద్రమ్మ ఇల్లు కట్టిస్తున్నారని గుర్తు చేశారు. కాంగ్రెస్ వస్తే కరెంటు ఉండదని కల్వకుంట్ల నుంచి ప్రచారం చేసిందని, ఇప్పుడు వాళ్లు కరెంటు తీగలు పట్టుకొని సలసలా మాడిపోకపోతే చూడండన్నారు. ఉచిత కరెంటు కాంగ్రెస్ పేటెంట్ అని స్పష్టం చేశారు. వచ్చే ఎన్నికల్లో రాహుల్ గాంధీని ప్రధాని చేసేందుకు రాష్ట్రంలోని 26 పార్లమెంట్ సీట్లలో 20 సీట్లు తెలంగాణ నుంచి ఇస్తాం అని, అందుకు కాంగ్రెస్ కార్యకర్తలు ప్రతిన పూనాలన్నారు. భట్టి విక్రమార్క కోరినట్లుగా మధిరకు ఇంజనీరింగ్ కాలేజీ మంజూరు చేస్తున్నాం అని రేవంత్ రెడ్డి ప్రకటించారు.
బిగ్ బ్రేకింగ్ న్యూస్
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంచలన ప్రకటన
వచ్చే అసెంబ్లీ ఎన్నికలు 2029 మే లేదా జూన్ లో ఉంటాయి
119 ఉన్న నియోజకవర్గాలు 182 కాబోతున్నాయి
182 లో 117 గెలిచి మళ్లీ మేమే అధికారంలోకి వస్తాం
ఆ భద్రాద్రి రాముడి మీద ఒట్టేసి చెప్తున్నా మళ్లీ వచ్చేది మేమే pic.twitter.com/Lg4tFLX2MO
— Tharun Reddy (@Tarunkethireddy) July 10, 2026
