రాబోయే వానాకాలంలో ఎలాంటి అత్యవసర పరిస్థితులనైని ఎదుర్కొనేందుకు ప్రభుత్వ యంత్రాంగం సిద్ధంగా ఉండాలని, విపత్తు నిర్వహణ శాఖ వద్ద ఉన్న రూ.1000 కోట్ల నిధులను నిబంధనల ప్రకారం, తక్షణ అవసరాల కోసం వినియోగించాలని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. వర్షా కాల సన్నద్ధతపై సెక్రటేరియట్ లో సంబంధిత శాఖల అధికారులతో సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. విపత్తుల సమయంలో ప్రాణ నష్టం, ఆస్తి నష్టం, పశు నష్టం వాటిల్లినప్పుడు అధికారులు ఏమాత్రం ఆలస్యం చేయకుండా తక్షణమే స్పందించాలని సూచించారు. క్షేత్రస్థాయిలో ప్రజలకు అందుబాటులో ఉంటూ సహాయక చర్యలు ముమ్మరం చేయాలి అని అధికారులను ఆదేశించారు. అన్ని శాఖల సమన్వయంతో వర్షాకాలంలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని ఆయన సూచించారు.
ఎల్ నినో ముప్పును పంట మార్పిడితో ఎదుర్కోవాలి
తెలంగాణ రాష్ట్రంలో ఎల్ నినో వాతావరణ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని రైతులను ముందస్తుగా అప్రమత్తం చేయాలని, తక్కువ నీటి వినరియోగంతో పండే పంటలను సాగు చేసేలా ప్రోత్సహించాలని రేవంత్ రెడ్డి సూచించారు. వర్షాభావ పరిస్థితులు ఎదురైతే తీసుకోవాల్సిన జాగ్రత్తలపై రైతులకు విస్తృతంగా అవేగాహన కల్పించాలని ఆదేశించారు. సాంప్రదాయ పద్ధతులకు భిన్నంగా పంట మార్పిడి, పంటల వైవిధ్యత ప్రాధాన్యతను రైతులకు అర్థమయ్యేలా చెప్పాలని స్పష్టం చేశారు. రాష్ట్రంలోని నీటి పారుదల ప్రాజెక్టుల మెయింటెనెన్స్ పనులపై రేవంత్ ఆరా తీశారు. ప్రాజెక్టుల గేట్లు, ఇతర నిర్వహణ పనులను యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ప్రాజెక్టుల మరమ్మతులు, మెయింటెనెన్సుకు అవసరమైన నిధులను తక్షణమే విడుదల చేయాలని ఆర్థిక శాఖను ఆదేశించారు. అటు రాష్ట్రంలో గతంలో దెబ్బతిన్న రోడ్లు, కూలిపోయిన వంతెనల (బ్రిడ్జీల) పునర్నిర్మాణానికి అవసరమైన నిధులను కూడా వెంటనే విడుదల చేయాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు.
ఈ సమావేశంలో నైరుతి రుతుపవనాలతో వచ్చే వర్షపాతం… ఎల్ నినో ప్రభావం, ఇతర అంశాలపై వాతావరణ శాఖ అధికారులు పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇచ్చారు. వ్యవసాయ, నీటి పారుదల, పట్టణాభివృద్ది, పంచాయతీ రాజ్, ఆరోగ్య, హోమ్, హైడ్రా, విపత్తు నిర్వహణ, అగ్నిమాపక శాఖల అధికారులు ఈ సమావేశానికి హాజరయ్యారు.