మాదకద్రవ్యాల విషయంలో కఠినంగా వ్యవహరిస్తాం : సీఎం రేవంత్‌ రెడ్డి

భ‌యం, బాధ్య‌త లేనప్పుడు విచ్చ‌ల‌విడిత‌నం వస్తుందని సీఎం చెప్పారు.. దీన్ని తమ ప్ర‌భుత్వం స‌హించ‌దని, నేర‌గాళ్ల ప‌ట్ల  క‌ఠినంగా వ్య‌వ‌హ‌రిస్తుందని చెప్పారు. ఎంత పెద్ద‌ కుటుంబ‌మైనా, రాజ‌కీయ నాయ‌కుడైనా, ఉన్న‌తాధికారుల కుటుంబ‌మైనా తాను లెక్క చేయబోనని సీఎం రేవంత్‌ రెడ్డి స్పష్టం చేశారు.

  • By: TAAZ |    telangana |    Published on : Apr 27, 2026 8:37 PM IST
మాదకద్రవ్యాల విషయంలో కఠినంగా వ్యవహరిస్తాం : సీఎం రేవంత్‌ రెడ్డి

విధాత, హైదరాబాద్:

లో మ‌న క‌ళ్ల ముందే  డ్రగ్స్‌ వ‌ల్ల యువ‌త‌ నిర్వీర్యం అయిందని, వ్యసనాల బారిన ప‌డి ఆ రాష్ట్రం కోలుకోని స్థితిలో ఉందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. అక్కడ పాఠశాలల ముందు చిన్న చిన్న దుకాణాల్లో గంజాయి అమ్ముతున్నారన్నారు. మ‌త్తుకు బానిస‌లైన వారు, గంజాయి తీసుకుంటున్న వారే మ‌హిళ‌లు, చిన్న పిల్లలపైన అకృత్యాల‌కు పాల్పడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. అందుకే తమ ప్రభుత్వం ఈగిల్ ఫోర్స్ను తీసుకువ‌చ్చి, డ్ర‌గ్స్ పైన క‌ఠినంగా వ్య‌వ‌హారిస్తోందన్నారు. ఇటీవ‌ల ఒక డ్ర‌గ్స్ కేసులో ప్ర‌జా ప్ర‌తినిధుల‌ను కూడా అరెస్టు చేశామన్నారు. పాఠశాలల్లో చేరే స‌మ‌యంలో డ్ర‌గ్స్  తీసుకోబోమంటూ విద్యార్థులు సెల్ఫ్ డిక్ల‌రేష‌న్ ఇవ్వాలన్నారు. భ‌యం, బాధ్య‌త లేనప్పుడు విచ్చ‌ల‌విడిత‌నం వస్తుందని సీఎం చెప్పారు.. దీన్ని తమ ప్ర‌భుత్వం స‌హించ‌దని, నేర‌గాళ్ల ప‌ట్ల  క‌ఠినంగా వ్య‌వ‌హ‌రిస్తుందని చెప్పారు. ఎంత పెద్ద‌ కుటుంబ‌మైనా, రాజ‌కీయ నాయ‌కుడైనా, ఉన్న‌తాధికారుల కుటుంబ‌మైనా తాను లెక్క చేయబోనని సీఎం రేవంత్‌ రెడ్డి స్పష్టం చేశారు.

తెలంగాణ రాష్ట్రం అంటే మ‌హిళ‌ల ర‌క్ష‌ణకు పర్యాయ ప‌దంగా తీర్చిదిద్దుతామని సీఎం అన్నారు. బంజారాహిల్స్ ఐసీసీసీలో సోమవారం ‘స్పందన టీమ్స్’ ప్రారంభోత్సవ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్య‌క్ర‌మంలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ, అభివృద్ధి చెందిన దేశాల్లో మ‌హిళ‌లు, పిల్ల‌ల‌కు భ‌ద్ర‌త ,ర‌క్ష‌ణ క‌ల్పించ‌డం ప్ర‌భుత్వాలు బాధ్య‌త‌గా భావిస్తాయన్నారు. ఏ దేశాల్లో పిల్ల‌లు, మ‌హిళ‌ల‌కు ర‌క్ష‌ణ క‌ల్పిస్తున్నారో అక్క‌డ అభివృద్ధి వేగంగా జ‌రుగుతుందని తెలిపారు. మ‌న‌ దేశానికి స్వాతంత్య్రం  వ‌చ్చిన వెంట‌నే మ‌హిళ‌ల‌కు ఓటు హ‌క్కు క‌ల్పించారని గుర్తు చేశారు. అమెరికాలో మహిళ‌ల‌కు ఓటు హ‌క్కు ఇవ్వ‌డానికి 150 యేళ్లు ప‌ట్టిందని అన్నారు. దేశం అభివృద్ధిలో పురుషుల‌తో పాటు మ‌హిళ‌ల‌కు తొలి ప్ర‌ధాని జవహర్ లాల్ నెహ్రు స‌మాన హ‌క్కులు క‌ల్పించారని చెప్పారు. దేశ ప్ర‌ధానిగా, లోక్ స‌భ స్పీక‌ర్ గా, రాష్ట్రాల గ‌వ‌ర్న‌ర్లు, న్యాయ‌మూర్తులు గా మ‌హిళ‌ల‌కు కాంగ్రెస్  పార్టీ  అవ‌కాశం ఇచ్చిందన్నారు. మ‌హిళా విద్యా, ఉద్యోగాల్లో రిజ‌ర్వేష‌న్ల‌తో పాటు స్థానిక సంస్థ‌ల్లో కూడా మ‌హిళ‌ల‌కు రిజ‌ర్వేష‌న్లు ఇచ్చి ప‌రిపాల‌న లో కాంగ్రెస్ పార్టీ భాగ‌స్వామ్యం చేసిందన్నారు. చ‌ట్ట‌స‌భ‌ల్లో మ‌హిళ‌ల రిజ‌ర్వేష‌న్ల కోసం 2013 లోనే బిల్లును కాంగ్రెస్ ప్రభుత్వం ఆమోదించిందన్నారు.

ఇప్ప‌టికీ కొన్ని విష‌యాల్లో మ‌హిళ‌ల‌పైన వివ‌క్ష ఉందని సీఎం రేవంత్‌ రెడ్డి అన్నారు. ‘రాష్ట్రం అభివృద్ధి జ‌ర‌గాలంటే మ‌హిళ‌ల‌కు ర‌క్ష‌ణ క‌ల్పించాలి, పిల్ల‌ల‌కు భ‌ద్ర‌త ఇవ్వాల‌ని మా ప్ర‌భుత్వం భావించింది. స్పంద‌న పేరుతో 24గంట‌ల పాటు అందుబాటులో ఉండేలా టీమ్స్ ను ఏర్పాటు చేశాం’ అని చెప్పారు. ‘స్పంద‌న ద్వారా త‌క్ష‌ణ‌మే బాదిత మ‌హిళ‌ల‌కు మాన‌సిక భ‌ద్ర‌త క‌ల్పిస్తారు. స‌మ‌స్య వ‌చ్చిన‌ప్పుడు నా ప‌క్కన నిల‌బ‌డుతుంద‌న్న విశ్వాసాన్ని మా ప్ర‌భుత్వం క‌ల్పిస్తోంది. తెలంగాణ రాష్ట్రంలో మ‌హిళ‌ల భ‌ద్ర‌త‌కు అత్యంత ప్రాధాన్య‌త ఇస్తుంద‌న్న సందేశం ఇవ్వ‌డం కోసం నేను ఈ కార్య‌క్ర‌మంలో పాల్గొన్నాను’ అన్నారు. స‌మ‌స్య వ‌చ్చిన త‌ర్వాత ప‌రిష్కరించ‌డం కాదు.. అస‌లు స‌మ‌స్య‌నే రాకుండా చూడాల్సిన సామాజిక బాధ్య‌త మ‌న‌పైన ఉందని అన్నారు. మ‌హిళ‌ల బాధలో అండ‌గా నిల‌బ‌డి ధైర్యాన్ని ఇచ్చే సామాజిక బాధ్య‌త అంద‌రిపైన ఉంది.

మ‌హిళ‌కు ఆర్థిక స్వాలంబన వ‌చ్చిన‌ప్పుడు కుటుంబం స‌మాజంలో నిల‌బ‌డుతుందని సీఎం రేవంత్‌ రెడ్డి అన్నారు. 2034 నాటికి వ‌న్ ట్రిలియ‌న్ , 2027 నాటికి మూడు ట్రిలియ‌న్ డాల‌ర్ల ఎకాన‌మీ గా చేయాల‌ని ప్ర‌భుత్వం ల‌క్ష్యం గా పెట్టుకుంది. ఇది జ‌ర‌గాలంటే మ‌హిళ‌ల‌కు భ‌ద్ర‌త ఉండాలనేది తమ ప్రభుత్వ లక్ష్యమని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.