రాష్ట్రంలోని ప్రతి పౌరుడికి అందుతున్న సంక్షేమ పథకాల వివరాలన్నీ ఒకే కార్డులో ఉండేలా ‘సమగ్ర సంక్షేమ కార్డును (యూనిఫైడ్ వెల్ఫర్ కార్డ్ ) రూపొందించాలని ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఏ పౌరుడికి ఏ శాఖ ద్వారా, ఏ పథకం కింద, ఎంత మేర లబ్ధి చేకూరుతోందో ఈ కార్డు ద్వారా స్పష్టంగా తెలిసేలా ఉండాలని సూచించారు. తక్షణమే అందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని, అన్ని శాఖల నుంచి లబ్ధిదారుల డేటాను సేకరించేందుకు ప్రత్యేక డ్రైవ్ చేపట్టాలని ఆదేశించారు.

ఆధార్ తరహాలో ప్రత్యేక యూనిక్ ఐడీతో యూనిఫైడ్ వెల్ఫర్ కార్డును జారీ చేయాలని ప్రభుత్వం ఆలోచన చేస్తుందని, సామాజిక, ఆర్థిక, కుల సర్వే డేటా కూడా కార్డుకు లింకు చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి వివరించారు.

మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, సీఎస్ రామకృష్ణారావు, సీఎం స్పెషల్ సెక్రటరీ బి.అజిత్ రెడ్డి, ఐటీ శాఖ జాయింట్ సెక్రటరీ అనుదీప్ దురిశెట్టి తదితర ఉన్నతాధికారుల సమీక్షలో సీఎం ఈ విషయాన్ని ప్రత్యేకంగా చర్చించారు.