CM Revanth Reddy | వేంకటేశ్వరుడి సన్నిధిలో రేవంత్‌రెడ్డి
తిరుమల ఏడుకొండల వేంకటేశ్వరస్వామిని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కుటుంబం బుధవారం దర్శించుకున్నది

విధాత: తిరుమల ఏడుకొండల వేంకటేశ్వరస్వామిని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కుటుంబం బుధవారం దర్శించుకున్నది. ఆయనతో పాటు భార్య, కుమార్తె, అల్లుడు, మనవడు ఉన్నారు. మనవడి పుట్టెంట్రుకల తీయించేందుకు మంగళవారం సాయంత్రం ముఖ్యమంత్రి తిరుమల చేరుకున్నారు. ఉదయం ఆ కార్యక్రమన్ని ముగించుకుని, స్వామివారికి ముడుపులు చెల్లించుకున్నారు. ఆలయంలోకి వైకుంఠము క్యూలైన్ ద్వారా ఆయన చేరుకుని స్వామివారిని దర్శించుకున్నారు.
దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు ఆశీర్వచనం పలుకగా, అధికారులు తీర్థప్రసాదాలు అందజేసి శేష వస్త్రంతో సత్కరించారు. శ్రీవారి జ్ఞాపికను అందజేశారు.. అనంతరం మీడియాతో మాట్లాడిన రేవంత్‌రెడ్డి.. ఏపీలో ఏర్పడే కొత్త ప్రభుత్వం సహకారంతో ఉభయ తెలుగు రాష్ట్రాల అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని తెలిపారు. ఉభయ రాష్ట్రాల్లో సమస్యల పరిష్కారానికి ఏపీ ముఖ్యమంత్రితో చర్చిస్తామన్నారు. తిరుమలలో, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున కళ్యాణ మండపం, వసతి గృహం ఏర్పాటుకు, నూతన ప్రభుత్వ సహకారం తీసుకుంటామని తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో వాతావరణం అనుకూలించి, రైతాంగం సస్యశ్యామలం కావాలని ఆకాక్షించారు.