కేసీఆర్ గజ్వేల్ క్యాంపు కార్యాలయంపై దాడి..భగ్గుమన్న బీఆర్ఎస్

గజ్వేల్‌లో కేసీఆర్ క్యాంపు కార్యాలయంపై కాంగ్రెస్ శ్రేణుల దాడి ఉద్రిక్తత రేపింది. ఘటనపై బీఆర్ఎస్ ఆగ్రహం వ్యక్తం చేస్తూ తీవ్ర విమర్శలు గుప్పించింది.

కేసీఆర్ గజ్వేల్ క్యాంపు కార్యాలయంపై దాడి..భగ్గుమన్న బీఆర్ఎస్

విధాత : బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న గజ్వేల్ నియోజకవర్గంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంపై శనివారం కాంగ్రెస్ శ్రేణులు దాడికి పాల్పడటం సంచలం రేపింది. కార్యాలయంలోకి చొచ్చుకెళ్లిన కార్యకర్తులు ఫర్నిఛర్ ధ్వంసం చేసి..అద్దాలు ధ్వసం చేశారు. ఈ ఘటన పట్ల బీఆర్ఎస్ శ్రేణులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ…పలుచోట్ల నిరసనలకు దిగారు. కాంగ్రెస్ విధ్వంస రాజకీయాలకు ఈ దాడి నిదర్శనమంటూ మండిపడ్డారు. ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చడం చేతగాక ప్రజల దృష్టి మరల్చేందుకు కాంగ్రెస్ ఇలాంటి చర్యలను ప్రోత్సహిస్తోందని మండిపడ్డారు. దాడిని నిరసిస్తూ సోమవారం  గజ్వేల్ పట్టణ బంద్ కు బీఆర్ఎస్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వంటేరు ప్రతాప్ రెడ్డి పిలుపునిచ్చారు.

దాడిపై హరీశ్ రావు ఆగ్రహం

ప్రతిపక్ష బీఆర్ఎస్ నేత, మాజీ ముఖ్యమంత్రి, గజ్వేల్ ఎమ్మెల్యే కేసీఆర్ క్యాంపు కార్యాలయంపై కాంగ్రెస్ గూండాల దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం అని మాజీ మంత్రి, బీఆర్ఎస్ శాసస సభ పక్ష డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్ రావు తెలిపారు. ముమ్మాటికీ ఇది సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలతో జరిగిన దాడి అని, ప్రజాస్వామ్యంపై సీఎం చేయించిన దాడి అని ఆగ్రహం వ్యక్తం చేశారు. పట్టపగలు అధికార మదంతో విర్రవీగుతూ సోయి మరచి వ్యవహరిస్తున్న కాంగ్రెస్ నాయకుల తీరు బీహార్ గ్యాంగ్‌ను తలపిస్తోందని మండిపడ్డారు.
ఏకంగా ప్రజా ప్రతినిధుల క్యాంపు కార్యాలయాలపైనే ముప్పేట దాడులు చేస్తుంటే రాష్ట్రంలో శాంతి భద్రతలు ఉన్నట్లా లేనట్లా? అని ప్రశ్నించారు. కాంగ్రెస్ పాలనలో ప్రజా ప్రతినిధులపై దాడులు, ప్రజా సంఘాలపై దాడులు, మీడియా పై దాడులు.. నిత్యకృత్యం కావడం సిగ్గుచేటు అన్నారు.

ఓ వైపు హేట్ స్పీచ్ బిల్లు..ఇంకోవైపు దాడులు

శాంతిభద్రతలను కాపాడాల్సిన పోలీసు యంత్రాంగం కాంగ్రెస్ పార్టీకి ప్రైవేట్ సైన్యంలా మారిపోయారా? ఎందుకు అడ్డుకోవడం లేదు? అని హరీశ్ రావు ప్రశ్నించారు. ఒకవైపు “హేట్ స్పీచ్ బిల్” పేరుతో ప్రజలు, ప్రతిపక్షాల నోళ్లు మూయిస్తూ… మరోవైపు కాంగ్రెస్ గూండాలతో దాడులు చేయించడమేనా మీ ప్రజా పాలన? అని దుయ్యబట్టారు. ఇందిరమ్మ రాజ్యం అని చెబుతూ… గూండా రాజ్యం అమలు చేస్తారా? అని, సీఎం, మంత్రులు ఇతర రాష్ట్రాల్లో పొలిటికల్ టూర్లు చేస్తూ… పాలనను గాలికి వదిలేసారా? అని నిలదీశారు. ముఖ్యమంత్రి, మంత్రులు ఇతర రాష్ట్రాల ఎన్నికల ప్రచారంలో ఉంటే… ఇక్కడ పాలనను ఎవరు చూస్తారు? అని ప్రశ్నించారు.

ఇదేనా మీ ఏడో గ్యారంటీ..?

బీఆర్ఎస్ ఎమ్మెల్యేల కార్యాలయాలపై దాడులు చేయాలని సందేశాలు ఇచ్చారా? కాంగ్రెస్ నాయకులకు ఫ్రీ హ్యాండ్ ఇచ్చారా? అని హరీశ్ రావు మండిపడ్డారు. ఏడవ గ్యారంటీగా ప్రజాస్వామ్య పునరుద్ధరణ అని డబ్బా కొట్టి ఇప్పుడు, ఉన్న ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారని, ఎమర్జెన్సీ పాలనను తలపిస్తున్నారని విమర్శించారు. మీ అణచివేతలకు, మీ నిర్బంధాలకు, మీ దాడులకు బీఆర్ఎస్ పార్టీ అదరదు బెదరదు అని, ప్రజాక్షేత్రంలో మిమ్మల్ని అడుగడుగునా నిలదీస్తూనే ఉంటామని, ప్రజల తరఫున పోరాటం చేస్తూనే ఉంటామని తెలిపారు. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం పై దాడులు జరిపిన కాంగ్రెస్ గూండాలను గుర్తించి వెంటనే అరెస్ట్ చేయాలని రాష్ట్ర డీజీపీని డిమాండ్ చేశారు. ఇలాంటి దాడులు ఆపకపోతే… ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు ప్రజలే వీధుల్లోకి రావాల్సిన పరిస్థితి వస్తుందని, తస్మాత్ జాగ్రత్త అని హరీశ్ రావు ప్రభుత్వాన్ని హెచ్చరించారు.

దాడి అప్రజాస్వామికం : నిరంజన్ రెడ్డి

కేసీఆర్ క్యాంపు కార్యాలయం ప్రభుత్వ ఆస్తి, దానిని ధ్వంసం చేయడం అంటే ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేయడమేనని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు. మాజీ ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయం మీద ఇలాంటి అప్రజాస్వామిక దాడులకు పాల్పడితే ఇక సామాన్యులకు రక్షణ ఎక్కడ ఉందని ప్రశ్నించారు. దాడికి పాల్పడిన దుండగులను గుర్తించి, కేసులు నమోదు చేసి వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్‌ చేశారు. ఈ ఘటనలో పోలీసులు అలసత్వం వహించడం గర్హనీయమని పేర్కొన్నారు. ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చడం చేతగాక ప్రజల దృష్టి మరల్చేందుకు కాంగ్రెస్ ఇలాంటి చర్యలను ప్రోత్సహిస్తోందని విమర్శించారు.

కాంగ్రెస్ దాడి శోచనీయం

గజ్వేల్ లో కేసీఆర్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం మీద కాంగ్రెస్ దాడి శోచనీయం అని తెలంగాణ రాష్ట్ర కల్లుగీత కార్పొరేషన్ మాజీ చైర్మన్ పల్లె రవికుమార్ గౌడ్ తెలిపారు. కేసీఆర్ కార్యాలయం విధ్వంసం అరాచక పాలనకు అద్దం పడుతుందన్నారు. కాంగ్రెస్ కెక్కిన అధికార దురహంకారానికి ఈ దాడి నిదర్శమని, ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయాన్ని ధ్వంసం చేయడం అంటే ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేయడమే. ప్రభుత్వ ఆస్తులకు రక్షణ లేకపోతే సామాన్యులకు రక్షణ ఎక్కడ? అని ప్రశ్నించారు. అధికారం కోసం ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చడం చేతగాక రేవంత్ రెడ్డి ప్రభుత్వం దౌర్జన్యకాండకు పాల్పడుతుందని విమర్శించారు. దాడులకు బాధ్యులైన వారిపట్ల కఠినంగా వ్యవహరించకపోతే అరాచకం, దౌర్జన్యాలను ప్రోత్సాహించినట్లు గుర్తించాల్సి వస్తుందన్నారు.

క్యాంపు కార్యాలయంపై దాడిని ఖండించిన ఎంపీ వద్దిరాజు రవిచంద్ర

గజ్వేల్ నియోజకవర్గ కేంద్రంలోని మాజీ సీఎం, ప్రతిపక్ష నాయకులు,స్థానిక శాసనసభ్యులు కల్వకుంట్ల చంద్రశేఖర రావు క్యాంప్ ఆఫీసుపై కాంగ్రెస్ గూండాలు దాడికి పాల్పడడాన్ని బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ డిప్యూటీ లీడర్, రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర తీవ్రంగా ఖండించారు. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం అంటే ప్రభుత్వానికి చెందిన ఆస్తి అని,దానిపై దాడికి దిగి ధ్వంసం చేసి భీభత్సం సృష్టించడమంటే ప్రభుత్వ ఆస్తులకు నష్టం కలిగించడమేనన్నారు. వాగ్దానాలను నెరవేర్చడంలో విఫలమై ప్రజల దృష్టి మరల్చేందుకు అధికార పార్టీ నాయకులు ఇలాంటి దుందుడుకు చర్యలను ప్రోత్సహిస్తున్నారని ఎంపీ రవిచంద్ర వ్యాఖ్యానించారు. మాజీ ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంపై వందల మంది చూస్తుండగా పట్టపగలు ఇలాంటి చర్యలకు పాల్పడితే ఇక సామాన్య ప్రజల పరిస్థితి ఏంటని ఆయన ప్రశ్నించారు. ఈ సందర్భంగా పోలీసులు ప్రేక్షక పాత్ర వహించడం శోచనీయమని ఎంపీ రవిచంద్ర అన్నారు. దాడికి పాల్పడిన కాంగ్రెస్ దుండగులను వెంటనే గుర్తించి,అరెస్టు చేసి చట్టపరంగా కఠినంగా శిక్షించాలని డీజీపీ శివధర్ రెడ్డిని ఎంపీ వద్దిరాజు డిమాండ్ చేశారు.

ఇవి కూడా చదవండి :

ఆర్ఎస్ కే దక్కిన ఇబ్రహీంపట్నం, క్యాతనపల్లి మున్సిపాలిటీలు!
మూసీపై నా పిటీషన్ డిస్పోజ్ మాత్రమే : బీఆర్ఎస్ నేత కార్తీక్ రెడ్డి