విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: పోలీసు అమరవీరుల ఆశయాలను కొనసాగిస్తూనే, వారి స్పూర్తితో విధుల్లో రాణినిస్తూ ప్రజలకు సేవలందించాలని వరంగల్ పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా తెలిపారు. వరంగల్ పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో శనివారం అమరవీరుల స్థూపం వద్ద పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవాన్ని (ఫ్లాగ్ డే)ను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గత ఏడాది నుండి ఇప్పటి వరకు దేశంలో విధి నిర్వహణలో మరణించిన 189 మంది పోలీసు అమరవీరుల పేర్లను క్రైమ్స్ డీసీపీ దాసరి మురళీధర్ చదివి వినిపించారు.
అనంతరం ముఖ్య అతిథిగా పాల్గొన్న వరంగల్ పోలీస్ కమిషనర్ తో పాటు వరంగల్ జిల్లా న్యాయమూర్తి రాధాదేవి, వరంగల్, హనుమకొండ జిల్లాల కలెక్టర్లు ప్రావీణ్య, సిక్తా పట్నాయక్, గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కమిషనర్ రిజ్వాన్, డీసీపీలు మురళీధర్, రవీందర్, అదనపు ఏసీపీలు, ఏసీపీలు, ఇన్ స్పెక్టర్లు, ఆర్ఐలు, పోలీస్ అమరవీరుల కుటుంబ సభ్యులు, పోలీస్ అధికారుల సంఘం సభ్యులు, సిబ్బంది పోలీస్ అమరవీరుల స్థూపం వద్ద పుష్పగుచ్ఛాలు వుంచి నివాళులు అర్పించారు. తర్వాత ఆర్ఐ చంద్రశేఖర్ సారథ్యంలో సాయుధ పోలీసులు ‘శోక్- క్రైస్త్’ చేసి మరణించిన పోలీసు అమరవీరులకు పోలీసు అధికారులు, సిబ్బంది, అమరవీరుల కుటుంబ సభ్యులు రెండు నిమిషాలు మౌనం పాటించారు.
ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ అసువులు బాసిన అమరవీరుల కుటుంబాలను కాపాడుకోవాల్సిన భాధ్యత మనందరిపై వుందన్నారు. వారికి ఎలాంటి సమస్య వున్న పోలీస్ విభాగం తరుపున పూర్తి సహకారం అందజేస్తామని తెలిపారు. అనంతరం పోలీస్ కమిషనరేట్ నుండి మిషన్ హాస్పిటల్ వరకు నిర్వహించిన ర్యాలీలో పోలీసులు, అధికారులు, సిబ్బంది, పోలీసు అమరవీరుల కుటుంబ సభ్యులతో పాటు పోలీసు జాగృతి కళాబృందం సభ్యులు పోలీసు అమరవీరులకు జోహార్లు అర్పించారు. అనంతరం రక్తదానం చేశారు.