Telangana Assembly : రేపు అసెంబ్లీలో వాటర్ వార్ .. పీపీటీతో కాంగ్రెస్ రె‘ఢీ’ !
రేపు తెలంగాణ అసెంబ్లీలో కృష్ణా జలాలపై కాంగ్రెస్–బీఆర్ఎస్ మధ్య వాటర్ వార్. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుపై పీపీటీతో కాంగ్రెస్ రెడీ.
విధాత, హైదరాబాద్ : అసెంబ్లీ వేదికగా నీళ్ల పంచాయతీ(వాటర్ వార్ ) కి కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు సన్నద్దమవుతున్నాయి. తెలంగాణ అసెంబ్లీలో రేపు శుక్రవారం కృష్ణా నది జలాల వాటాలు..పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు అంశాలపై చర్చ పెట్టేందుకు సీఎం రేవంత్ రెడ్డి సారధ్యంలోని కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయించుకుంది. చర్చలో కృష్ణ జలాల హక్కుల సాధన..ప్రాజెక్టుల నిర్మాణంలో ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టేందుకు ఓ వైపు బీఆర్ఎస్ శాసనసభ పక్షం..మరోవైపు ప్రతిపక్షం ఆరోపణలను తిప్పికొట్టేందుకు అధికార కాంగ్రెస్ పక్షం అవసరమైన సమాచారంతో అస్త్రశస్త్రాలు కూడగట్టుకుంటున్నాయి. రెండు వర్గాలు కూడా నీళ్ల లెక్కలతో కుస్తి పడుతూ రేపటి సభా సమరానికి సంసిద్దమవుతున్నాయి.
పవర్ పాయింట్ ప్రజెంటేషన్ తో అవగాహన
సభలో జరిగే చర్చలో ఎదుటి పక్షం వాదనలను సమర్ధవంతంగా తిప్పికొట్టే రీతిలో కాంగ్రెస్ మంత్రులు, ఎమ్మెల్యేలకు కృష్ణ జలాలు..పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుపైన, బనకచర్ల నల్లమల సాగర్ ప్రాజెక్టు సహా సంబంధిత అంశాలపైన అవగాహాన కల్పించాలని సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయించారు. ఇందుకోసం గురువారం సాయంత్రం రాష్ట్ర ఇరిగేషన్ శాఖ మంత్రి ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కార్యక్రమం ద్వారా వారికి ఆయా అంశాలపై అవగాహాన కల్పించే ప్రయత్నం చేశారు. బీఆర్ఎస్ చేస్తున్న ఆరోపణలు..కౌంటర్ గా చెప్పాల్సిన విషయాలను పీపీటీలో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు వివరించి అవగాహాన కల్పించారు. రాష్ట్రానికి సంబంధించిన నదీజలాల వాటా, వివిధ ప్రాజెక్టుల పరిస్థితి, ఏపీతో కొనసాగుతున్న జల వివాదాలు, బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో అనుసరించిన విధానాలు, అప్పట్లో తీసుకున్న నిర్ణయాలపై, ప్రస్తుత స్థితిగతులపై వివరించారు.
ప్రత్యేకంగా పాలమూరు – రంగారెడ్డి ఎత్తిపోతల పథకంపై ప్రతిపాదన దశ నుంచి ఇప్పటి వరకు చోటు చేసుకున్న పరిణామాలు, బీఆర్‌ఎస్ హయాంలో తీసుకున్న కీలక నిర్ణయాలు, పనుల పురోగతి, గత రెండేళ్లుగా కొనసాగుతున్న పరిస్థితి తదితర అంశాలపై కాంగ్రెస్ సభ్యులకు అవగాహాన కల్పించారు. కృష్ణా జలాల పంపిణీలో గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం వల్ల తెలంగాణకు అన్యాయం జరిగిందనే పాయింట్ మీదనే చర్చను కేంద్రీకరించాలని అధికార పక్షం వ్యూహరచన చేస్తోంది.
బీఆర్ఎస్ నుంచి మళ్లీ ఆ ఒక్కడే
కృష్ణా జలాల హక్కులు, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు సహా బనకచర్ల నల్లమల సాగర్ వంటి కృష్ణా గోదావరి ప్రాజెక్టులపై బీఆర్ఎస్ పక్షం నుంచి మరోసారి మాజీ నీటిపారుదల శాఖ మంత్రి టి.హరీష్ రావు చర్చలో పాల్గొననున్నారు. గత రెండేళ్లలో అసెంబ్లీలో నీటిపారుదల రంగం సమస్యలపై జరిగిన చర్చలలో ఆయనే ముందుండి ప్రభుత్వంపై విమర్శల దాడి సాగించారు. సీఎం రేవంత్ రెడ్డి సహా అధికార కాంగ్రెస్ సభ్యులు గత బీఆర్ఎస్ ప్రభుత్వంపై చేసిన విమర్శలకు హరీష్ రావు సమాధానం ఇచ్చారు. ఈ నేపథ్యంలో ఈసారి కూడా చర్చలో ఆయనే ప్రముఖంగా వ్యవహరించబోతున్నారు. మాజీ సీఎం కేసీఆర్ అసెంబ్లీలో కృష్ణ జలాల అంశంపై జరిగే చర్చకు రాకపోవచ్చని తెలుస్తుంది. ఆయన నల్లగొండ, మహబూబ్ నగర్, రంగారెడ్డి జిల్లాలలో బహిరంగ సభలకే పరిమితమవుతారని సమాచారం.
మాటల యుద్దం వీటిపైనే..
కేసీఆర్ హయాంలో పాలమూరు ప్రాజెక్టు పనులు 90 శాతం పూర్తయ్యాయని, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చీరాగానే ఆ ప్రాజెక్టు టెండర్లను రద్దు చేసిందని బీఆర్ఎస్ ఆరోపిస్తుంది. ముఖ్యంగా పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుకు బీఆర్ఎస్ 90టీఎంసీలు కేటాయిస్తే..కాంగ్రెస్ ప్రభుత్వంలో 45 టీఎంసీల జలాలు చాలు అని మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి కేంద్రానికి లేఖ రాశారని బీఆర్‌ఎస్ వాదిస్తుంది. డీపీఆర్ వెనక్కి వచ్చి ఏడాది అయినా ఎందుకు పట్టించుకోలేదు, ఇవాళ్టికీ కూడా మళ్ళీ పంపలేదు అని ఆరోపిస్తుంది. మేము ఏడు అనుమతులు తీసుకొచ్చాం, రెండేళ్లలో ఒక్క అనుమతి తీసుకొచ్చారా? అని ప్రశ్నిస్తుంది. బీఆర్ ఎస్ దాదాపు రూ.35 వేల కోట్లను మంజూరు చేయగా, రూ. 27,500 కోట్లను ఖర్చు 90 శాతం పనులను గత కేసీఆర్ పూర్తి చేశామని..మిగిలిన పది శాతం పనులను పూర్తి చేయడంలో రేవంత్ సర్కార్ కావాలనే తాత్సారం చేస్తుందని బీఆర్ఎస్ వాదిస్తుంది. మాకు పాలమూరు-రంగారెడ్డి అంశాలపై అసెంబ్లీలో చర్చకు సందర్బంగా అవసరమైతే పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వాలని బీఆర్‌ఎస్ డిమాండ్ చేస్తోంది. ఏపీ సీఎం చంద్రబాబు డైరెక్షన్‌లో బనకచర్ల ముందుకు వెలుతుందని, గత జూలై నెలలోనే 200 టీఎంసీల గోదావరి జలాల మళ్లింపునకు కేంద్రంలోని బీజేపీ సర్కార్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని, తెలంగాణ ప్రభుత్వానికి తెలిసినా 5 నెలలుగా గప్‌చుప్‌గా ఉందని బీఆర్ఎస్ ఆరోపిస్తుంది.
కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం పాలమూరు రంగారెడ్డి, బనకచర్ల నల్లమలపై బీఆర్ఎస్ చేస్తున్న విమర్శలను తోసిపుచ్చుతుంది. డీపీఆర్ బీఆర్ఎస్ హాయంలోనే వెనక్కి వచ్చిందని, మేం పాలమూరు రంగారెడ్డికి 45టీఎంసీలకే పరిమితమవుతూ లేఖ రాశామన్నది అవాస్తవమని, 45శాతం పనులు మాత్రమే చేసి 90శాతం పనులు చేశారని అన్ని అబద్దాలు చెబుతున్నారని కాంగ్రెస్ వాదిస్తుంది. నిజానికి కృష్ణా, గోదావరి జలాలపై బీఆర్ఎస్ హయాంలోనే తెలంగాణకు అన్యాయం జరిగిందని కాంగ్రెస్ ఆరోపిస్తుంది.
మొత్తం మీద అటు కాంగ్రెస్, ఇటు బీఆర్ఎస్ లు రేపు కృష్ణా జలాల అంశంపై అసెంబ్లీ వేదికగా సభా సమరానికి సిద్దమవుతున్న పరిణామం తెలంగాణ రాజకీయాల్లో ఆసక్తికరంగా మారింది. సభా సమరంలో తమ వాదనలు కూడా వినిపించేందుకు బీజేపీ, సీపీఐ, ఎంఐఎం సభ్యులు కూడా సిద్దమవుతుండటంతో ..రేపటి చర్చ..రచ్చగా మారి చలికాలంలో వేడి సెగలు రేపడం ఖాయంగా కనిపిస్తుంది.
ఇవి కూడా చదవండి :
Tirumala Laddu Sales : తిరుమల శ్రీవారి లడ్డూ విక్రయాల్లో సరికొత్త రికార్డు
New Year Drunk And Drive Cases : న్యూ ఇయర్ డ్రంక్ అండ్ డ్రైవ్ లో ఎంతమంది దొరికారో తెలుసా!
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram