Deputy CM Bhatti | విద్యుత్తు సంస్థల ప్రైవేటీకరణ అబద్ధం: డిప్యూటీ సీఎం భట్టి
రాష్ట్రంలోని విద్యుత్తు సంస్థలను ప్రైవేటీకరించాలనే ఆలోచన తమ ప్రభుత్వానికి లేదని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క స్పష్టం చేశారు.

విధాత, హైదరాబాద్ : రాష్ట్రంలోని విద్యుత్తు సంస్థలను ప్రైవేటీకరించాలనే ఆలోచన తమ ప్రభుత్వానికి లేదని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. కేంద్ర బడ్జెట్‌లో తెలంగాణకు జరిగిన అన్యాయంపై అసెంబ్లీలో చర్చ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ డిస్కంలను ప్రైవేటీకరణ చెయొద్దని.. దీనిపై సీఎం రేవంత్ అధికారికంగా ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు. డిస్కమ్‌లలో ఏం జరుగుతుందో ఆ శాఖ మంత్రి భట్టి విక్రమార్క తెలుసుకోవాలన్నారు. కరెంట్ బిల్లు కలెక్షన్లకు వెళ్తే అదానీ మనుషులు వచ్చారని గొడవలు అయ్యోయో లేదో తెలుసుకోవాలని సూచించారు. అదానీ మనుషులు వచ్చారంటూ పాతబస్తీలో గొడవలు జరిగాయని ఇంటలిజెన్స్ రిపోర్ట్ ఇచ్చిందో లేదో తెలుసుకోవాలన్నారు.
పాత బస్తీ ఎమ్మెల్యేలతో మీటింగ్ పెట్టి వారి భయాలు తొలగించాలని కోరారు. కేటీఆర్ ఆరోపణలపై భట్టి వివరణ ఇస్తూ హైదరాబాద్లో పవర్ సర్కిళ్లను ప్రైవేటువాళ్లకు ఇస్తున్నట్లు ఎక్కడా చెప్పలేదని, ఎవరో పత్రికల్లో రాసినదాన్ని పట్టుకుని సభలో మాట్లాడితే ఎలా అని కేటీఆర్‌పై మండిపడ్డారు. బీఆరెస్ వాళ్లలా ఏది పడితే అది చేసే వాళ్లం కాదన్నారు. కేటీఆర్ సభతో పాటు రాష్ట్రాన్ని తప్పుదోవ పట్టిస్తున్నారని భట్టి ఆగ్రహం వ్యక్తం చేశారు. భట్టి వ్యాఖ్యలపై కేటీఆర్ స్పందిస్తూ డిస్కమ్‌లను ప్రైవేటీకరణ చేయమని సీఎం ఒక స్టేట్‌మెంట్ ఇవ్వాలని, దానికి మాపై ఎదురుదాడి చేస్తే ఏమొస్తదని, మేం తప్పులు చేసి ఉంటే ప్రజలు మమ్మల్ని శిక్షించే కదా ఇక్కడ కూర్చోబెట్టారన్నారు. మీరు సరిగా చేయండన్నారు.