విధాత,మెదక్ ప్రత్యేక ప్రతినిధి: ఉమ్మడి మెదక్ జిల్లా కాంగ్రెస్ పార్టీలో టికెట్ల కేటాయింపు చిచ్చుపెట్టింది. బీఆరెస్ మల్కాజిగిరి ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు కాంగ్రెస్‌లో చేరికతో పార్టీలోని అసంతృప్తులు రగులుకున్నాయి. మెదక్ టికెట్ మైనంపల్లి కుమారుడు రోహిత్ కు కేటాయించడాన్ని ఆశావహులు వ్యతిరేకించారు.డీసీసీ అధ్యక్షుడు తిరుపతి రెడ్డి, మాజీ ఎమ్మెల్యే శశిధర్ రెడ్డి మొదటి నుండి మెదక్ టికెట్ ఆశించారు. ఈక్రమంలో వారు కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. మంత్రి హరీష్ రావు సమక్షంలో గులాబీ గూటికి చేరుకున్నారు.
10 స్థానాల్లో ఐదింటికి ఖరారు
మెదక్ ఉమ్మడి జిల్లాలో 10 అసెంబ్లీ నియోజకవర్గాలకు కాంగ్రెస్ ప్రకటించిన మొదటి జాబితా లో 5 స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేశారు. అందులో మెదక్, జహీరాబాద్ నియోజకవర్గాలకు కొత్త అభ్యర్థులను ప్రకటించింది. మరో ఐదు నియోజకవర్గాల్లో అభ్యర్థులు తేలాల్సి ఉంది.
బీఆరెస్ ను వీడిన మైనంపల్లి అనుచరులు
మైనంపల్లి హన్మంతరావు బీఆరెస్ పార్టీని వీడడంతో మెదక్ జిల్లాలో రాజకీయ సమీకరణలు మారాయి. మైనంపల్లి అనుచరులైన బీఆర్ఎస్ నేత రాజీ రెడ్డి, పాపన్నపేట మండల బీఆర్ఎస్ మాజీ అధ్యక్షులు ప్రశాంత్ రెడ్డి, రామాయంపేట మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ గంగా నరేందర్, న్యాయవాది జీవన్ రావు తదితరులు కాంగ్రెస్ లో చేరారు.
జహీరాబాద్ నియోజకవర్గంలో మాజీ మంత్రి గీతా రెడ్డికి కాకుండా వికారాబాద్ కు చెందిన మాజీ మంత్రి చంద్రశేఖర్ కు కేటాయించారు. గీతా రెడ్డికి కంటోన్మెంట్ టికెట్ కేటాయించ నున్నట్లు తెలుస్తోంది. ఇదిలాఉండగా ఆందోల్ నియోజకవర్గంలో మాజీ ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనరసింహకు కేటాయించారు. ఇక్కడ బీఆరెఎస్ నుండి రోగోడు మాజీ జడ్పీటీసీ కాంగ్రెస్ లో చేరారు. జహీరాబాద్ టికెట్ ఆశించిన నరోత్తం బీఆర్ఎస్ లో చేరారు.
గజ్వేల్ బీఆరెస్ లోనూ లుకలుకలు
సీఎం కేసీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న గజ్వేల్ నియోజకవర్గంలో సిద్దిపేట డీసీసీ అధ్యక్షులు తూమ్ కుంట నర్సారెడ్డికి కాంగ్రెస్ టికెట్ దక్కింది. ఇక్కడ మాజీ మున్సిపల్ చైర్మన్, బీఆర్ఎస్ నేత ఆపార్టీలోని అసమ్మతి నాయకులతో ఇటీవల సమావేశం నిర్వహించారు. ఇంకా పార్టీ మారనప్పటికీ, ప్రతాప్ రెడ్డికి మాత్రమే పార్టీలో ప్రాధాన్యత ఇస్తున్నారని.. తమను అధిష్టాన వర్గం పట్టించుకోవడం లేదని వారు మీడియా వేదికగా ఆరోపణలు గుప్పించారు.
బీఅర్ఎస్ పార్టీ 10 నియోజక వర్గాలకు నర్సాపూర్ మినహా అన్ని నియోజకవర్గాల్లో అభ్యర్థులను ప్రకటించి, బీ ఫామ్ లు కూడా అందించింది. ఆయా నియోజకవర్గాల్లో అభ్యర్థులు ఎన్నికల కదన రంగంలో దూసుకెళ్తున్నారు. సిద్దిపేటలో సీఎం బహిరంగ సభతో మరింత దూకుడు పెంచారు. కాంగ్రెస్ పార్టీ మిగతా 5 స్థానాల్లో అభ్యర్థులను ప్రకటిస్తే తప్ప ఇక్కడ పార్టీల బలాబలాలపై అంచనాకు రాలేమని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. క్షేత్రస్థాయిలో బీఆర్ఎస్ కు వ్యతిరేకత ఉన్నప్పటికీ, కాంగ్రెస్ అభ్యర్థులు ఏ మేరకు అందిపుచ్చుకుంటారన్న దాన్నిబట్టే ఫలితాలు ఉంటాయని అంటున్నారు.