విధాత, హైదరాబాద్ :బీజేపీకి దేశం ఫస్ట్..తర్వాత పార్టీ,పర్సనల్ అని..నేను పక్కా తెలంగాణ మట్టి బిడ్డనని..నాకు నా తెలంగాణ ఫస్ట్ అని, తర్వాత పార్టీ, తర్వాత పర్సనల్ అంశాలు అని మల్కాజ్ గిరి బీజేపీ ఎంపీ, మాజీ మంత్రి ఈటల రాజేందర్ స్పష్టం చేశారు. నన్ను కాల్చి చంపుతా అన్నా నేను తెలంగాణ ప్రజల విషయంలో రాజీపడబోనని, కాంగ్రెస్ ప్రభుత్వం రాజకీయ పట్టుదలకు పోకుండా రైతుల కోసం కాళేశ్వరం కన్నెపల్లి పంపులను ఆన్ చేయాలని డిమాండ్ చేశారు.
మేడిగడ్డలో నీళ్ళు నిలపకుండానే.. ఎత్తిపోయవచ్చని, ఇవాళ 90 వేల క్యూసెక్కుల నీళ్లు వస్తున్నాయని, 2 టీఎంసీల నీళ్లు లిఫ్ట్ చేసే సామర్థ్యం ఉన్నా.. ఎందుకు లిఫ్ట్ చేయడం లేదని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. సీఎం రేవంత్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి బేషజాలకు పోకుండా ఉత్తమంగా ఆలోచన చేసి గోదావరి నీళ్లను తెలంగాణ ప్రజలకు, రైతాంగానికి అందించాలని కోరారు.
నేను తెలంగాణ మట్టిబిడ్డను, ఉద్యమకారున్ని, అదే నా గుర్తింపు అని, రాజకీయాల కోసం తెలంగాణ ప్రజలకు నష్టం జరుగుతుంటే చూస్తూ ఊరుకోను.. చీల్చి చెందాడుతానని ఈటల స్పష్టం చేశారు. మేము స్వయం ప్రకాశితులం, ఎవరో మాట్లాడిస్తేనో.. స్క్రిప్ట్ రాసి ఇస్తేనో.. ఎవరి మెప్పుకోసమే మాట్లాడేవాళ్ళం కాదు, రిమోట్ కంట్రోల్ మనిషని కాదని అలా ఆరోపించే నీచులకు నేను సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు అన్నారు.
నీళ్లు అడిగితే రాజకీయ విమర్శలు సరికాదు..
నేను కాంగ్రెస్ పార్టీని ఇంకో పార్టీని తిట్టడానికి రాలేదని, పని చేయాల్సిన వారిని అడుగుతున్నానని, దేవాదులకు బరాజ్ లేదు… లేకుండా నీళ్ళు పంపు చేస్తున్నారని, మేడిగడ్డలో నీళ్ళు నింపమని అడగడం లేదు. కిందకు పోతున్న నీళ్లను పంప్ చేయమని అడుగుతున్నానని ఈటల స్పష్టం చేశారు. రాజకీయాలు చేసి రైతులను ఇబ్బంది పెడితే ఖబర్దార్ అని, హైదరాబాద్ కి ఇప్పుడే 107 MGD నీళ్లు సరఫరా తక్కువ ఉంది. నీటి కొరత వస్తె ఎటు పోవాలని ప్రశ్నించారు. ఈ ప్రభుత్వం గోదావరి నీళ్లను వదిలేస్తూ.. తప్పు చేస్తుంది అని ప్రజలు అంటున్నారని, హైదరాబాద్ ప్రజానీకాన్ని, ఉత్తర తెలంగాణ, ఖమ్మం, నల్లగొండ ప్రజలను మీరు బోనులో నిలబెడుతున్నారని, బీజేపీ ఏం చేయబోతుందన్నది.. నీకిందికి నీళ్లు వచ్చినప్పుడు తెలుస్తుందని ఈటల హెచ్చరించారు. ప్రజలకు కోపం వస్తె కేసీఆర్ లాంటి వాడే ఖతం అయ్యిండు, సందర్భం వస్తె పాతాళంలో పాతర వేస్తారన్నారు. ఇంజనీర్లతో మాట్లాడి పనులు చేయించు.. విమర్శలు బంద్ పెట్టు అని రేవంత్ కు హితవు పలికారు
కాళేశ్వరం అవినీతిపై చర్యలు తీసుకోండి
కాళేశ్వరం అవినీతి బయట పెట్టు.. భాధ్యున్ని తేల్చి అరెస్ట్ చేయండని, అంతే తప్ప రాజకీయాలకోసం ప్రజలను, రైతులను ఇబ్బంది పెట్టొద్దని సీఎం రేవంత్ రెడ్డికి సూచించారు. కాళేశ్వరం కట్టిన డబ్బులు ప్రజలవి అని, వాటిని వృథా చేయవద్దు అన్నారు. కాళేశ్వరం అవినీతి డబ్బులు రికవరీ చేయండని, కాళేశ్వరం ప్రాజెక్టులో లక్ష కోట్ల అవినీతి జరిగిందని బద్నాం చేస్తే ప్రజలు హర్షించరని, కాళేశ్వరం ప్రాజెక్ట్ అంటే ఒక్క మేడిగడ్డ (లక్ష్మీ) బ్యారేజీ మాత్రమే కాదని, మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల, మిడ్ మానేరు, అనంత సాగర్, రంగనాయక సాగర్, మల్లన్న సాగర్, కొండపోచమ్మ సాగర్, బసవాపురం వంటివి ఉన్నాయని, కొన్ని వందల టీఎంసీల రిజర్వాయర్లు, వందల కిలోమీటర్ల పైప్‌లైన్స్, కాలువలు, టన్నెల్స్, మోటార్లు, పంపులు, పెద్ద పెద్ద టవర్లు ఉన్నాయని గుర్తు చేశారు. మేము అడుగుతుంది నీళ్ళు ఎత్తిపోయండి అంటే.. రాజకీయాలు మాట్లాడుతున్నారని ఈటెల ఆక్షేపించారు. ఏకే 47 తుపాకీ తీసుకొచ్చి కణత మీద పెట్టినా ఈటల రాజేందర్ రాజీ పడబోడని, ధర్మం కోసం ప్రజల కోసం ఎంతకైనా సిద్ధం అని స్పష్టం చేశారు.
