వరంగల్ కేంద్రంగా రైతు సమస్యలపై బీఆర్ఎస్ పోరుబాట
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాక ముందు వరంగల్ కేంద్రంగా నాలుగేళ్ళ క్రితం ప్రకటించిన రైతు డిక్లరేషన్ లక్ష్యంగా బీఆర్ఎస్ పోరుబాటకు సన్నద్ధమైంది. అధికారంలోకి వచ్చినప్పటికీ రైతాంగ సమస్యలను పరిష్కరించకుండా మోసం చేశారంటూ కాంగ్రెస్ ప్రభుత్వం టార్గెట్‌గా మే 6వ తేదీన రైతులతో ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించేందుకు నిర్ణయించారు.
- మే 6న రైతాంగ సమస్యలపై ప్రత్యేకంగా సమావేశం
- గతంలో కాంగ్రెస్ డిక్లరేషన్, ఇప్పుడు బీఆర్ఎస్ నిరసన
- ఉమ్మడి వరంగల్ జిల్లా నుంచి జన సమీకరణ
- రైతాంగాన్ని మోసం చేస్తున్న కాంగ్రెస్ : బీఆర్ఎస్ నేత వినయ్
విధాత, ప్రత్యేక ప్రతినిధి:
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాక ముందు వరంగల్ కేంద్రంగా నాలుగేళ్ళ క్రితం ప్రకటించిన రైతు డిక్లరేషన్ లక్ష్యంగా బీఆర్ఎస్ పోరుబాటకు సన్నద్ధమైంది. అధికారంలోకి వచ్చినప్పటికీ రైతాంగ సమస్యలను పరిష్కరించకుండా మోసం చేశారంటూ కాంగ్రెస్ ప్రభుత్వం టార్గెట్‌గా మే 6వ తేదీన రైతులతో ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించేందుకు నిర్ణయించారు. ప్రతిపక్ష పార్టీగా నాలుగేళ్ళ క్రితం కాంగ్రెస్ పార్టీ హనుమకొండలోని ఆర్ట్స్ కాలేజీ గ్రౌండ్ వేదికగా మే 6వ తేదీన రైతులను సమీకరించి భారీ సభను నిర్వహించింది. అధికారంలోకి వస్తే రాష్ట్రంలో రైతుల కోసం చేపట్టే కార్యాచరణను ‘వరంగల్ డిక్లరేషన్’ పేరుతో కాంగ్రెస్ పార్టీ అధినేత రాహుల్ గాంధీ ఆ సందర్భంలో ప్రకటించారు. అప్పుడు రాష్ట్రంలో బీఆర్ఎస్ అధికారంలో ఉన్నది. ఆ తర్వాత కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో పాటు దాదాపు మూడేళ్ళు కావస్తున్నప్పటికీ రైతు డిక్లరేషన్ పేరుతో ఇచ్చిన హామీలు అమలు చేయడంలో ప్రభుత్వం విఫలమైందని బీఆర్ఎస్ నేతలు విమర్శిస్తున్నారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ వరంగల్ డిక్లరేషన్ నిర్వహించిన మే 6వ తేదీన రైతులతో సమావేశం ఏర్పాటు చేయాలని బీఆర్ ఎస్ నిర్ణయించింది. ఈ మేరకు మంగళవారం నిర్వహించిన ఉమ్మడి వరంగల్ జిల్లా బీఆర్ఎస్ ముఖ్యనాయకుల సమావేశంలో తాజా నిర్ణయం తీసుకున్నారు. ఈ సమావేశానికి ఆ పార్టీ వర్కింగ్ ప్రసిడెంట్ కేటీఆర్ హాజరయ్యారు. 6న జరిగే రైతు సమావేశానికి కూడా ఆయనను ఆహ్వానించారు.
కాంగ్రెస్ పార్టీ మాదిరి భారీ సభ కాకుండా ఉమ్మడి వరంగల్ జిల్లా స్థాయిలో రైతులను సమీకరించి ‘సమావేశం’ నిర్వహించాలని నిర్ణయించారు. ఇందులో పార్టీ సభ్యత్వ నమోదుతో పాటు పార్టీ పటిష్టత, ఎస్ఐఆర్ అమలుపట్ల జాగ్రత్తగా వ్యవహరించాలని చర్చించారు. గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో పార్టీ విజయం కోసం అనుసరించాల్సిన వ్యూహంపై కూడా చర్చించారు. ఈ నెల 20న జగిత్యాలలో భారీ సభ నిర్వహించిన నేపథ్యంలో పార్టీ ఆవిర్భావ సభను రాష్ట్ర కార్యవర్గానికే పరిమితం చేశారు. తాజాగా రైతుల నిరసనను భారీ సభగా కాకుండా సమావేశంగా జరపాలని నిర్ణయించినట్లు భావిస్తున్నారు. జన సమీకరణ సమస్యలు రాకుండా, ఆర్ధిక భారం పడకుండా ముందు జాగ్రత్తవహిస్తూ అధికార కాంగ్రెస్ పై సమరశంఖం పూరించే విధంగా ఈ కార్యాచరణ రూపొందించినట్లు భావిస్తున్నారు.
రైతాంగాన్ని మోసం చేస్తున్న కాంగ్రెస్ : బీఆర్ఎస్ నేత వినయ్
కాంగ్రెస్ రైతు డిక్లరేషన్ పేరిట మోసం చేసిందని బీఆర్ఎస్ హనుమకొండ జిల్లా అధ్యక్షుడు దాస్యం వినయ్ భాస్కర్ విమర్శించారు. అధికారంలోకి వచ్చి రెండున్నర సంవత్సరాలు దాటినా ఇప్పటికీ ఒక్క హామీని కూడా నెరవేర్చకుండా తన కపట మోసాన్ని కొనసాగిస్తున్నదని ఆయన విమర్శించారు. రాష్ట్రంలో ఎరువుల కొరత, విత్తనాల కొరత, ధాన్యం కొనుగోళ్లలో తీవ్రమైన సంక్షోభం వంటి సమస్యలు తలెత్తుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణలో తిరిగి రైతు ఆత్మహత్యలు ప్రారంభమయ్యాయని, కరెంట్ కోతలతో రైతులు ఇబ్బందులు పడుతున్నారని ఆయన మండిపడ్డారు. సమావేశంతో ప్రభుత్వాన్ని నిలదీస్తామని ప్రకటించారు.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram