విధాత: జెర్సీ డెయిరీ తమ ప్రాంత రైతుల పాలను కొనాలని డిమాండ్ చేస్తూ యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్‌లో పాడి రైతులు గురువారం విజయవాడ-హైద్రాబాద్ రహదారిపై కొద్దిసేపు రాస్తారోకో నిర్వహించి నిరసన తెలిపారు. రైతుల నిరసనతో రహదారిపై భారీగా వాహనాలు ఆగిపోవడంతో పోలీసులు జోక్యం చేసుకుని రైతులకు నచ్చ చెప్పి నిరసన విరమింపచేశారు.
ఈ సందర్భంగా పాడి రైతులు మాట్లాడుతూ ఇతర రాష్ట్రాల నుంచి వస్తున్న పాలను తక్కువ ధరతో కొనుగోలు చేస్తున్న జెర్సీ సంస్థ, స్థానిక రైతుల పాలను కొనడం లేదని ఆరోపించారు. వెంటనే స్థానిక రైతుల పాలను జెర్సీ కొనుగోలు చేయని పక్షంలో తమ ఆందోళన ఉదృతం చేస్తామన్నారు.