విధాత, హైదరాబాద్ : గతంలో ధాన్యం కొనుగోలులో తరుగు తీస్తే తోలు తీస్తా అని సీఎం రేవంత్ రెడ్డి పెద్ద పెద్ద మాట్లాడారని, మరి ఈరోజు నీ ప్రభుత్వం క్వింటాల్‌కు 5 కిలోల తరుగు తీస్తుందని, ఇప్పుడు నీ తోలు తీయాలా మరి రేవంత్ రెడ్డి? అని బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ టి.హరీశ్ రావు ప్రశ్నించారు. నల్లగొండ జిల్లా నాగార్జున సాగర్ నియోజకవర్గం బీఆర్ఎస్ కార్యకర్తల సమావేశానికి వెళ్లే క్రమంలో గుర్రంపోడు మండలం జూనూతల వద్ద ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించి రైతుల సమస్యలను తెలుసుకున్నారు. ధాన్యం కొనుగోళ్లు సక్రమంగా జరగడం లేదని, మిల్లుల వద్ద లారీలు అన్ లోడ్ చేయడం లేదని, తాలు, పచ్చ గింజ పేరుతో కోతలు విధిస్తున్నారని రైతుల తమ సమస్యలను హరీష్ రావు దృష్టికి తీసుకువెళ్లారు.
అనంతరం హరీశ్ రావు మాట్లాడుతూ సీఎంలు, మంత్రులు వారి కుర్చీలు, పదవులు కాపాడుకునేందుకు ఢిల్లీకి ఎక్కే విమానం, దిగే విమానం అన్నట్లుగా చక్కర్లు కొడుతున్నారని, ఇక్కడ పాలన గాలికి వదిలేశారని, కొనుగోలు కేంద్రం వైపు చూసే దిక్కు లేదన్నారు. నిన్నమొన్న రెండురోజులు సీఎం.. ఈ రోజు మంత్రులు అంతా ఢిల్లీకి పోయారని గుర్తు చేశారు. ఢిల్లీకి కప్పం కట్టాలి, కుర్చీ కాపాడుకోవాలన్న దానిపై పెడుతున్న శ్రద్ధ వారికి రాష్ట్ర ప్రజల, రైతుల సమస్యలపై లేదని హరీశ్ రావు విమర్శించారు.
15రోజులు గడిచినా.. ధాన్యం కొనుగోలుకు దిక్కులేదు. రుణమాఫీ చేస్తానని దేవుళ్ళపై ఒట్టు వేసి పచ్చి మోసం చేశాడు.రాష్ట్రంలో 60% రుణమాఫీ కాలేదు.., రైతు భరోసా అమలు కాలేదు.వడ్లకు బోనస్ ఎగ్గొట్టారు, పంటల బీమాను అందకుండా చేశారని ఆరోపించారు. ఎస్ఎల్బీసీ ప్రమాదంలో మృతదేహాలను వెలికి తీయలేని దద్దమ్మ ప్రభుత్వమని విమర్శించారు.
మళ్ళీ అధికారంలోకి వచ్చేది కేసీఆర్ ప్రభుత్వమే
రాష్ట్ర ప్రజలు సీఎం రేవంత్ ప్రభుత్వాన్ని పదవీచ్యుతులను చేసి, కేసీఆర్ తిరిగి అధికారంలోకి రావాలని కోరుకుంటున్నారని హరీశ్ రావు చెప్పుకొచ్చారు. రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి తెలంగాణ సంపదను దోచుకుంటున్నారని ఆరోపించారు. బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక వారి దోపిడీలన్నింటికి కక్కిస్తామని హెచ్చరించారు. నల్లగొండ జిల్లా మంత్రులు, ఎమ్మెల్యేలు.. మిల్లర్ల వద్ద డబ్బులు తీసుకుంటున్నారని, మిల్లర్లు రైతుల పొట్ట కొడుతున్నారని హరీశ్ రావు ఆరోపించారు.
