మూడు నెలలుగా జీతాలివ్వరా.. ట్విటర్ వేదికగా హరీశ్‌రావు ఫైర్

నేషనల్ హెల్త్ మిషన్ (ఎన్‌హెచ్‌ఎం) పరిధిలో పనిచేస్తున్న కాంట్రాక్ట్, అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు కాంగ్రెస్ ప్రభుత్వం మూడు నెలలుగా జీతాలు చెల్లించకపోవడం బాధాకరమని, తక్షణమే వారి జీతాలు విడుదల చేయాలని మాజీ మంత్రి హరీష్ రావు ట్విటర్ వేదికగా డిమాండ్ చేశారు.

మూడు నెలలుగా జీతాలివ్వరా.. ట్విటర్ వేదికగా హరీశ్‌రావు ఫైర్

విధాత, హైదరాబాద్‌ : నేషనల్ హెల్త్ మిషన్ (ఎన్‌హెచ్‌ఎం) పరిధిలో పనిచేస్తున్న కాంట్రాక్ట్, అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు కాంగ్రెస్ ప్రభుత్వం మూడు నెలలుగా జీతాలు చెల్లించకపోవడం బాధాకరమని, తక్షణమే వారి జీతాలు విడుదల చేయాలని మాజీ మంత్రి హరీష్ రావు ట్విటర్ వేదికగా డిమాండ్ చేశారు. అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్లు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, బస్తీ దవాఖానాలు, తెలంగాణ డయాగ్నోస్టిక్స్ తదితర 78 విభాగాలలో పనిచేస్తున్న 17,541 వైద్యులు, ఫార్మాసిస్టులు, ల్యాబ్ టెక్నీషియన్లు, నర్సులు, అకౌంటెంట్లు, డేటా ఎంట్రీ ఆపరేటర్లు, సెక్యూరిటీ గార్డులు, స్వీపర్లు తదితరులు జీతాలు రాక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు.

ప్రజల ఆరోగ్యాలను సంరక్షించేందుకు నిరంతరం కృషి చేసే వైద్య సిబ్బందికి నెలల తరబడి జీతాలు చెల్లించకపోవడం ప్రజారోగ్యంపై రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్న నిర్లక్ష్యానికి అద్దం పడుతుందన్నారు. ప్రతి నెల 1వ తేదీనే జీతాలు చెల్లిస్తున్నామని గొప్పలు చెప్పుకుంటున్న కాంగ్రెస్ ప్రభుత్వం మాటలు దొల్ల అని చెప్పడానికి ఇది మరో నిదర్శనం అన్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి మూడు నెలల పెండింగ్ జీతంతో పాటు, పీఆర్సీ బకాయిలను తక్షణమే చెల్లించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.