37 Maoist Surrender : మావోయిస్టు పార్టీకి భారీ షాక్..ఇద్దరు రాష్ట్ర కమిటీ సభ్యులు సహా 37మంది లొంగుబాటు

టీఎస్ డీజీపీ ఎదుట రాష్ట్ర కమిటీ సభ్యులు ఆజాద్, రమేష్ సహా 37మంది మావోయిస్టులు లొంగిపోయారు. భారీగా ఆయుధాలు స్వాధీనం కావడంతో కేసు పెద్ద సంచలనం రేపింది.

37 Maoist Surrender : మావోయిస్టు పార్టీకి భారీ షాక్..ఇద్దరు రాష్ట్ర కమిటీ సభ్యులు సహా 37మంది లొంగుబాటు

విధాత, హైదరాబాద్ : మావోయిస్టు పార్టీకి మరో బిగ్ షాక్ తగిలింది. తెలంగాణ రాష్ట్ర కమిటీ సభ్యులు సమ్మయ్య అలియాస్ ఆజాద్, సౌత్ బస్తర్ డివిజన్ కమిటీ కార్యదర్శి, దండకారణ్య స్పెషల్ కమిటీ సభ్యుడు ఎర్రా, మావోయిస్టు పార్టీ సాంకేతిక విభాగం ఇన్ చార్జీ అప్పాసి నారాయణ అలియాస్ రమేష్ సహా 37మంది డీజీపీ శివధర్ రెడ్డి ముందు లొంగిపోయారు. లొంగిపోయిన మావోయిస్టులలో 25మంది మహిళలు ఉన్నారని..వీరంతా సీఎం రేవంత్ రెడ్డి పిలుపు మేరకు జన జీవన స్రవంతిలో కలిసినట్లుగా డీజీపీ తెలిపారు. లొంగిపోయిన మావోయిస్టులలో 34 మంది ఛత్తీస్‌గఢ్‌కు చెందిన వారని వెల్లడించారు. ముగ్గురు డివిజనల్‌ కమిటీ సభ్యులు, తొమ్మిది మంది ప్రాంతీయ కమిటీ సభ్యులు, 22 మంది దళ సభ్యులు లొంగిపోయారని చెప్పారు. 37 మందికి తక్షణ సాయం కింద ఒక్కొక్కరికి రూ.25 వేలు అందజేశామన్నారు.

లొంగిపోయిన మావోయిస్టుల నుంచి భారీగా ఆయుధాలు స్వాధీనం చేసుకున్నామని, 303 రైఫిల్, జీ 3 రైఫిల్, ఎస్ఎల్ఆర్, ఏకే 47 రైఫిల్, బుల్లెట్స్, క్యాట్రీడ్జ్ లు సీజ్ చేసినట్లుగా తెలిపారు. లొంగిపోయిన మావోయిస్టులకు రివార్డు నగదుతో పాటు ఇతర పునరావాస సహాయం అన్ని కూడా అందిస్తామని డీజీపీ తెలిపారు. ఆజాద్‌పై రూ.20 లక్షలు, అప్పాస్‌ నారాయణపై రూ.20 లక్షల రివార్డు ఉందని.. వీరితోపాటు లొంగిపోయిన మావోయిస్టులందరిపైనా కలిపి మొత్తం రూ.1.41కోట్ల రివార్డు ఉందని.. ఆ మొత్తాన్ని వారికే అందజేస్తాం అని తెలిపారు. గత 10నెలలుగా 465మంది లొంగిపోయారు. ఇంకా తెలంగాణ నుంచి మావోయిస్టు పార్టీలో 59మంది కొనసాగుతున్నారని, వారిలో 5గురు సెంట్రల్ కమిటీ సభ్యులు ముప్పాల లక్ష్మణ్ రావు అలియాస్ గణపతి, మల్లా రాజీరెడ్డి అలియాస్ సంగ్రామ్, తిప్పిరి గణపతి అలియాస్ దేవ్ జీ, , పాక హన్మంతు అలియాస్ గణేష్, బడే చొక్కారావు అలియాస్ దామోదర్ సహా 10మంది స్టేట్ కమిటీ సభ్యులు ఉన్నారని తెలిపారు. వారిలో చాలమంది సీనియర్లు వృద్ధాప్యం, అనారోగ్యంతో బాధపడుతున్నారని వెల్లడించారు.వారంతా వీలైనంత త్వరగా లొంగిపోవాలని సూచిస్తున్నాం అని డీజీపీ శివధర్‌రెడ్డి తెలిపారు.

పార్టీకి చెప్పే లొంగిపోయాం: అజాద్, ఎర్రా

మారుతున్న పరిస్థితుల్లో ఉద్యమాన్ని నడిపించడం కష్టంగా ఉందని..ఇప్పుడున్న పరిస్థితుల్లో లొంగిపోవడమే మంచిదన్న ఆలోచనతో మేమంతా జనజీవన స్రవంతిలో కలిసి పోవాలని నిర్ణయించుకున్నామని మావోయిస్టు నేతలు ఆజాద్, ఎర్రాలు తెలిపారు. మేం పార్టీకి చెప్పే లొంగిపోయాం అని వెల్లడించారు. మా ఆరోగ్య పరిస్థితిలు కూడా సహకరించడం లేదు అన్నారు. ప్రస్తుతం స్టేట్ కమిటీలో ఇద్దరు అగ్రనేతలు ఉన్నారని, వారితో పాటు మిగతా మావోయిస్టులు కూడా లొంగిపోవడం మంచిదని కోరారు.

ఇవి కూడా చదవండి :

Principal Warning | ‘చంపి పడేస్తా’.. విద్యార్థికి ప్రిన్సిపాల్ వార్నింగ్
Hidma Flexi Controversy : హన్మకొండ జిల్లాలో మావోయిస్టు హిడ్మా ఫ్లెక్సీల కలకలం