విధాత, హైదరాబాద్ : ప్రపంచంలోని దిగ్గజ ఫైనాన్స్ సంస్థలన్నీ తమ గ్లోబల్ సామర్థ్య కేంద్రాల(GCC) ఏర్పాటుకు హైదరాబాద్ నగరాన్ని గమ్యస్థానంగా ఎంచుకున్నాయని ఐటి, పరిశ్రమల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు వెల్లడించారు. నైపుణ్యాలతో కూడిన టేలెంట్ పూల్, అంతర్జాతీయ స్థాయి మౌలిక సదుపాయాలు, ట్రాఫిక్ సమస్య లేని రోడ్లు, అందుబాటులో ఉండే అద్దెలు ప్రముఖ కంపెనీలని ఆకర్షిస్తున్నాయని ఆయన తెలిపారు. న్యూయార్స్ కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహించే పీకో టెక్నాలజి (PICO Technology) సంస్థప్రతినిధులు శనివారం బీఆర్ అంబేద్కర్ సచివాలయంలో శ్రీధర్ బాబుతో భేటీ అయ్యారు. రోడ్లు, భవనాల మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కూడా సమావేశంలో పాల్గొన్నారు.
ఫైనాన్సియల్ మార్కెట్ కు సంబంధించిన సేవలు అందించే పీకో టెక్నోలజీ సంస్థ పీకో టెక్నాలజీ ఇండియా అనే అనుబంధ కంపెనీ ద్వారా ఇక్కడ జీసీసీ ఏర్పాటు చేయడానికి ముందుకొచ్చిందని తెలిపారు. ఈ సందర్భంగా శ్రీధర్ బాబు వారికి ఇక్కడి అవకాశాలు, మౌలిక వసతుల గురించి వివరించారు. రానున్న 5-10 సంవత్సరాలు, తర్వాత 20 సంవత్సరాల అవసరాలకు తగిన విధంగా మౌలిక సదుపాయాలు మెరుగు పర్చేందుకు ప్రణాళికలు అమలు చేస్తున్నట్టు ఆయన తెలిపారు. బెంగళూరు, ముంబాయి నగరాలతో పోలిస్తే ఇక్కడ ఆఫీసు స్థలాల ఆక్యుపెన్సీ 73 శాతం ఉందని చెప్పారు. ముంబాయిలో అది 52 శాతం మాత్రమేనని తెలిపారు.
బెంగళూరు, ముంబాయి మెట్రో నగరాల్లో ట్రాఫిక్, వాయు కాలుష్యం ప్రధాన సమస్యలుగా మారినందున ఐటి సంస్థలు, జిసిసిలు హైదరాబాద్ కు తరలి వస్తున్నాయని తెలిపారు.
