కామారెడ్డిలో.. కేసీఆర్‌పై రేవంత్ పోటీ?

  • Publish Date - October 21, 2023 / 01:03 PM IST
  • రాజు కోటలోనే ముఖాముఖి
  • గేమ్ చేంజ్‌కు మైండ్ గేమ్‌


విధాత : తెలంగాణలో కాంగ్రెస్‌ను ఎలాగైనా అధికారంలోకి తీసుకొచ్చేందుకు శాయశక్తుల పోరాడుతున్న పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి మరో సాహసోపేత నిర్ణయం తీసుకోబోతున్నారని తెలుస్తున్నది. తెలంగాణ ఎన్నికల పోరులో విజయ సాధనకు పోటాపోటీగా వ్యూహా ప్రతి వ్యూహాలను పన్నుతున్న కాంగ్రెస్‌-బీఆరెస్‌ పార్టీల సంగ్రామంలో సీఎం కేసీఆర్‌ను కామారెడ్డి బరిలో ఢీ కొట్టేందుకు రేవంత్‌రెడ్డి సిద్ధమయ్యారని సమాచారం.


యుద్ద క్షేత్రంలో మోహరించిన సైన్యాన్ని నడిపించేందుకు సిద్ధమైన రాజును కోటలోనే కట్టడి చేసే మానసిక యుద్ధానికి.. ముఖాముఖి సమరానికి రేవంత్ సిద్దపడ్డారని తెలుస్తోంది. ఈ మేర‌కు కాంగ్రెస్ అధిష్టానం కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింన‌ట్లు స‌మాచారం. శ‌నివారం సాయంత్రం ఢిల్లీలో ఏఐసీసీ జ‌న‌ర‌ల్ సెక్ర‌ట‌రీ, కేసీ వేణుగోపాల్ ఇంట్లో జ‌రిగిన స‌మావేశంలో ఈ విష‌యంపై చ‌ర్చిస్తున్న‌ట్లు విశ్వ‌స‌నీయంగా తెలిసింది.


కొడంగల్‌తో పాటు కామారెడ్డిలో కేసీఆర్‌పై పోటీ చేయాలని రేవంత్ నిర్ణయించుకున్నట్లుగా తెలుసుకున్న గులాబీ బాస్ రేవంత్ వ్యూహాన్ని ఎలా ఎదుర్కొంటారన్నది ఆసక్తికరంగా మారింది. కామారెడ్డిలో పోటీ చేయడం ద్వారా చుట్టుముట్టు నియోజకవర్గాల్లో దాని ప్రభావాన్ని బీఆరెస్ అభ్యర్థుల విజయాలకు విస్తరించాలని సీఎం కేసీఆర్ భావించారు. అయితే కేసీఆర్ ఎత్తుకు పై ఎత్తు అన్నట్లుగా ఆయనను కామారెడ్డికే కట్టడి చేయాలని రేవంత్ పన్నిన వ్యూహం కేసీఆర్ ఊహించనిదే.


కామారెడ్డిలో రేవంత్ పోటీతో కేసీఆర్ తన గెలుపు కోసం తీవ్రంగా శ్రమించాల్సివుంటుంది. ఇందుకోసం తనతో పాటు కేటీఆర్, హరీశ్‌రావు, కవితలను సైతం కామారెడ్డిపై ఫోకస్ పెట్టమని చెప్పకతప్పదు. అప్పుడు రాష్ట్రంలోని ఇతర నియోజకవర్గాల్లో కేసీఆర్ సహా వారి ఫోకస్ పలుచబడనుంది. ఈ పరిస్థితి ఆ పార్టీ అభ్యర్థులకు కొంత ప్రతికూలం కాక తప్పదు. ఇదే మైండ్ గేమ్‌తో రేవంత్‌రెడ్డి కామారెడ్డి బరిలో కేసీఆర్‌ను ఢీ కొట్టాలని నిర్ణయించుకున్నారని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.



గజ్వెల్‌లోనూ..


గజ్వెల్‌లో కాంగ్రెస్ నుంచి బలమైన అభ్యర్ధి తూముకుంట నర్సారెడ్డిని, బీజేపీ నుంచి ఈటల రాజేందర్‌ను ఢీ కొనడంపై ఇప్పటికే సీఎం కేసీఆర్ ముందెన్నడు లేని రీతిలో గట్టిగా ఫోకస్ చేయాల్సిన పరిస్థితులు నియోజకవర్గంలో ఎదురవుతున్నాయి. సీఎంగా ఉన్న కేసీఆర్‌ స్వయంగా తమ ఎమ్మెల్యేగా ఉన్నప్పటికి…ఆయన అందుబాటులో ఉండని దుస్థితి తమదన్న అసంతృప్తి కేడర్‌లో, గజ్వెల్‌ వాసుల్లో బలపడింది. దీనికి తోడు 50వేల మేరకు ఉన్న ముదిరాజ్ ఓటర్ల అండతో ఈటల గజ్వెల్‌లో కేసీఆర్‌ను సవాల్ చేస్తున్నారు.


కాంగ్రెస్ గాలితో గెలుపుపై ఆశలు పెట్టుకున్న నర్సారెడ్డితో కూడా కేసీఆర్ గట్టిపోటీ ఎదుర్కోవాల్సి వస్తున్నది. ఈ నేపధ్యంలో గజ్వెల్‌లో గట్టి పోటీ తప్పదని గ్రహించిన కేసీఆర్ తాజాగా గజ్వెల్‌ నియోజకవర్గం కార్యకర్తల సమావేశం నిర్వహించి కేడర్‌కు దగ్గరయ్యే ప్రయత్నం చేశారు. తాను ఇంతకాలం మీకు అందుబాటులో ఉండకపోవడం తప్పేనంటూ తగ్గి మాట్లాడారు. ఎంత మెజార్టీతో గెలిపిస్తారో మీ దయ అంటూ వ్యాఖ్యానించారు. నియోజవర్గంలోని రిజర్వాయర్‌ల భూ నిర్వాసితులకు ఓదార్పు మాటలు చెప్పారు.


రాష్ట్రంలో తాను ఒక్క సీటు కూడా ఇవ్వకపోవడంతో తనపై గుర్రుగా ఉన్న ముదిరాజ్‌లను మచ్చిక చేసుకునేందుకు తాను చిన్నప్పుడు ముదిరాజ్ తల్లి పాలు తాగి పెరిగానంటూ సెంటిమెంట్ డైలాగ్‌లు వదిలారు. సీఎం కేసీఆర్‌లో ఇంతలో అంత మార్పు చూసిన రాజకీయ విశ్లేషకులు కేసీఆర్‌ తన గెలుపు సులబం కాదన్న సత్యాన్ని గ్రహించారంటున్నారు. గజ్వెల్‌లో నెలకొన్న గడ్డు పరిస్థితిని అధిగమించే ప్రయత్నంలో ఉన్న సీఎం కేసీఆర్‌కు ఇప్పుడు కామారెడ్డిలో రేవంత్‌రెడ్డిని ఢీ కొట్టాల్సిరావడం మరింత ఉక్కిరి బిక్కిరి చేయడం ఖామయని భావిస్తున్నారు.