విధాత, ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా ప్రతినిధి: పాలమూరు జిల్లాలో పలు పార్టీల్లో నాయకుల కప్పదాట్లు ఎన్నికల సెగ పుట్టిస్తోంది. ప్రధాన పార్టీలకు చేరికల పర్వం ఊపందుకుంది. బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు ఆయా పార్టీల్లో అసంతృప్తుల వేటలో పడ్డారు. వల విసిరి కండువా కప్పి, అక్కున చేర్చుకుంటున్నారు. ముఖ్య నేతల ఇళ్లు, పార్టీ కార్యాలయాల్లో కండువాల సందడి విస్తుగొల్పుతోంది.
అయితే.. నేతల దృష్టి అంతా చేరికలపైనే కేంద్రీకృతమైంది. బీఆరెస్ లో మంత్రి శ్రీనివాస్ గౌడ్, ఇటీవల కాంగ్రెస్ లో చేరిన ఎన్నం శ్రీనివాస్ రెడ్డి పోటా పోటీగా చేరికలను ఆహ్వానిస్తున్నారు. ఎన్నికల ప్రచారం చాటున ఈతంతు ముగిసిపోతోంది. ఇతర పార్టీ లకు చెందిన నాయకులు, కార్యకర్తలను అధిక శాతం మందిని తమవైపు తిప్పుకునే ప్రయత్నం చేస్తున్నారు.
మంత్రి శ్రీనివాస్ గౌడ్ సమక్షంలో..
నాయకులు ప్రతి రోజు ఒక గ్రామానికి వెళ్లి ప్రచారం నిర్వహిస్తూ, అక్కడి అసంతృప్తులను పార్టీలోకి చేరే విధంగా ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికే పాలమూరు జిల్లాకేంద్రంతో పాటు ఇతర మండలాల నేతలు ఆయా పార్టీల ముఖ్య నేతల సమక్షంలో పార్టీ కండువా వేసుకుంటున్నారు. గత రెండు, మూడు రోజులుగా ఈ రెండు పార్టీల్లో భారీ సంఖ్యలో ఇతర పార్టీల నాయకులు వచ్చి చేరుతున్నారు.
బీఆరెస్ అభ్యర్థి, మంత్రి శ్రీనివాస్ గౌడ్ సమక్షంలో పలు సంఘాల నేతలు ఆపార్టీలో చేరారు. పాలమూరు రజక, మాల సంఘాల నేతలు గురువారం శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో గులాబీ కండువా వేసుకున్నారు. స్థానిక తిరుమల దేవుని గుట్ట ప్రాంతానికి చెందిన బీజేపీ కార్యకర్తలు భారీ సంఖ్యలో చేరారు. హన్వాడ మండలంలోని పలు గ్రామాలకు చెందిన ఇతర పార్టీల కార్యకర్తలు శ్రీనివాస్ గౌడ్ సమక్షంలో గులాబీ కండువా వేసుకున్నారు.
ఎన్నం వలలో మరింత మంది..
కాంగ్రెస్ నేత ఎన్నం శ్రీనివాస్ రెడ్డి పాలమూరు పట్టణంలో విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. రెండురోజుల్లో కాంగ్రెస్ పార్టీలో భారీ ఎత్తున చేరికలు కొనసాగుతున్నాయి. పట్టణంలోని పలు వార్డులకు చెందిన బీఆర్ఎస్ కార్యకర్తలు, యువత, నిరుద్యోగులు ఎన్నం సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. మరో వైపు డీసీసీ అధ్యక్షులు మధుసూదన్ రెడ్డి ఆధ్వర్యంలో భారీ ఎత్తున ఇతర పార్టీ నాయకులు కాంగ్రెస్ కండువా వేసుకున్నారు.
మాజీ మున్సిపల్ చైర్మన్ రాధా అమర్ ఆధ్వర్యంలోనూ కాంగ్రెస్ లో చేరికల పర్వం కొనసాగుతోంది. జిల్లాలోనే కాకుండా ఇక్కడి నేతలు స్వయంగా వెళ్లి రేవంత్ రెడ్డి సమక్షంలో లో కాంగ్రెస్ పార్టీ లో స్వచ్ఛదంగా చేరుతున్నారు. నాగర్ కర్నూల్ జిల్లా బిజినేపల్లి మండల జడ్పీటీసీ హరిచరణ్ రెడ్డి, రైతు సమితి సభ్యుడు పర్వత రెడ్డితో పాటు మరికొందరు బీఆర్ ఎస్ నేతలు టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు.
ఇదే జిల్లా తెలకపల్లి మండలంలోని పలు గ్రామాలకు చెందిన బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు రేవంత్ రెడ్డిని కలిసి కాంగ్రెస్ కండువా వేసుకున్నారు. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో బీ ఆర్ఎస్ను వీడి కాంగ్రెస్ లో చేరిన వారి సంఖ్య ఎక్కువగా ఉంటోంది. దీంతో అ పార్టీ నేతలకు తలనొప్పిగా మారింది. పార్టీ వీడేవారిని నిలువరించినా ఫలితం దక్కడం లేదు.
జడ్చర్ల నియోజకవర్గంలో కూడా కాంగ్రెస్ నేత అనిరుద్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరే వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. ఇప్పటికే చాలా గ్రామాల్లో పాదయాత్ర చేపట్టి ఇతర పార్టీల నాయకులను కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు అనిరుద్ రెడ్డి విశ్వప్రయత్నం చేసి సక్సెస్ అయ్యారు. ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ ఇంకా చేరికల ఉధృతి ఉంటుందని ఆయా పార్టీ ల నేతల్లో చర్చ సాగుతోంది.