కేసీఆర్‌కు తుంటి మార్పిడి శస్త్ర చికిత్స విజయవంతం

- అర్ధరాత్రి కిందపడిన మాజీ ముఖ్యమంత్రి
- ఎర్రవెల్లి ఫాంహౌస్‌లో ప్రమాదం
- వెంటనే దవాఖానకు తరలింపు
- ఉదయం నుంచీ వైద్య పరీక్షలు
- ఆయనను నడిపించడంపై శనివారం నిర్ణయం
- యశోద హాస్పిటల్ బులెటిన్ వెల్లడి
మాజీ ముఖ్యమంత్రి, బీఆరెస్ అధినేత కే చంద్రశేఖర్‌రావుకు తుంటి మార్పిడి శస్త్రచికిత్సను యశోద వైద్యులు విజయవంతంగా పూర్తి చేశారు. ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసిన అనంతరం ఎర్రవెల్లిలోని తన ఫాంహౌస్‌లో ఉంటున్న కేసీఆర్.. గురువారం అర్ధరాత్రి దాటిన తర్వాత బాత్‌రూమ్‌లో కాలుజారి కిందపడ్డారు. ఈ ఘటనలో ఆయన ఎడమ తుంటి ఎముక విరిగింది. వెంటనే ఆయనను యశోద హస్పిటల్‌కు తీసుకువచ్చారు. ఉదయం నుంచి ప్రత్యేక వైద్యుల బృందం ఆయనకు పరీక్షలు నిర్వహించింది. కేసీఆర్ వయసు రీత్యా ఎముకను అతికించడం కంటే.. తుంటి ఎముకను మార్చడమే ఉత్తమమని అభిప్రాయానికి వచ్చిన వైద్యులు.. ఆ మేరకు ఏర్పాట్లు చేశారు. సాయంత్రం ఆయనకు విజయవంతంగా శస్త్రచికిత్స చేశారు. శస్త్రచికిత్స అనంతరం సహజంగా ఇచ్చే ఐవీ ఫ్లూయిడ్స్, యాంటిబయాటిక్స్, నొప్పి నివారణ మందులు ఇస్తున్నట్టు యశోద వైద్యులు తాజా బులెటిన్‌లో తెలిపారు. శనివారం ఉండే పరిస్థితులకు అనుగుణంగా ఆయనను నడిపించడం, ఫిజియోథెరపీ వంటివాటిపై నిర్ణయం తీసుకుంటామని పేర్కొన్నారు.