ఇకిలించినట్టున్న ఇందిరమ్మ రాజ్యం: కేసీఆర్‌

ప్రస్తుత ప్రభుత్వ అసమర్థ, అవివేక, తెలివి తక్కువ విధానాల వల్లే తెలంగాణలో వ్యవసాయ రంగం సంక్షోభానికి గురయ్యే పరిస్థితికి వచ్చిందని మాజీ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు ఆరోపించారు

  • Publish Date - April 5, 2024 / 09:05 AM IST
  • ప్ర‌భుత్వ అస‌మ‌ర్థ‌త వ‌ల్లే క‌రువు
  • ఎకరాకు 25 వేల పరిహారం ఇవ్వాలి
  • కాంగ్రెస్‌ ఇచ్చిన హామీల అమలేది?
  • మోసపు వాగ్దాలతో గెలిచారు
  • మళ్లీ రెఫరెడం అంటూ హామీలు
  • మీడియా సమావేశంలో కేసీఆర్‌

విధాత‌: ప్రస్తుత ప్రభుత్వ అసమర్థ, అవివేక, తెలివి తక్కువ విధానాల వల్లే తెలంగాణలో వ్యవసాయ రంగం సంక్షోభానికి గురయ్యే పరిస్థితికి వచ్చిందని మాజీ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు ఆరోపించారు. 2014కు ముందున్న పరిస్థితులే రాష్ట్రంలో మళ్లీ ఉత్పన్నం అవుతున్నాయన్నారు. మోసపు వాగ్దానాలు చేసి కేవలం 1.8% ఓట్లతో కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చిందని దుయ్యబట్టారు. చవటలు, దద్దమ్మల రాజ్యంలో ఉన్నాం కనుకనే ఈ పరిస్థితులు తలెత్తాయని మండిపడ్డారు. రాష్ట్రవ్యాప్తంగా పంటలు ఎండని, కరెంటు మోటర్లు కాలని జిల్లానే లేదన్నారు. ఇవన్నీ చూస్తుంటే ఇందిరమ్మ రాజ్యంలో ఇకిలించినట్టయ్యిందని ఎద్దేవాచేశారు. శుక్రవారం సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని బీఆరెస్‌ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. అంతకుముందు పొలం బాటలో భాగంగా కరీంనగర్, చొప్పదండి, సిరిసిల్ల నియోజకవర్గాల పరిధిలోని పంట పొలాలను సందర్శించిన ఆయన పంట నష్టాన్ని పరిశీలించి రైతులకు భరోసా ఇచ్చే ప్రయత్నం చేశారు. గోదావరి బేసిన్‌లో ఉన్న జిల్లాల్లో కూడా ఇంత కరువెందుకు? ఇది కాలం తెచ్చిన కరువా? కాంగ్రెస్ తెచ్చిందా? అంటూ ప్రశ్నించారు. తాము అధికారంలో ఉన్నప్పుడు 200 కిలోమీటర్ల పాటు గోదావరి సజీవ జలధారగా ఉండేటట్టు చూశామన్నారు. ఎస్సారెస్పీ పునరుజ్జీవన పథకంలో భాగంగా వరద కాలువను పూర్తి చేసి ఒకటిన్నర టీఎంసీ నీరు నిల్వ ఉంచేలా చేశామన్నారు. ఫలితంగా లక్షల టన్నుల ధాన్యం ఉత్పత్తి జరగడానికి ఆస్కారం ఏర్పడిందని తెలిపారు. కాంగ్రెస్ మంత్రులు కొందరు వర్షాభావ పరిస్థితులే ప్రస్తుత దుస్థితికి కారణమని చెపుతున్నారని, వాస్తవానికి ఉత్తర తెలంగాణతో పాటు రాష్ట్రవ్యాప్తంగా గత వర్షాకాలంలో కొన్ని జిల్లాలలో ఏడు శాతం, మరికొన్ని జిల్లాలలో 16% అధిక వర్షపాతం నమోదైందని చెప్పారు. కాలం కాకపోతే రైతులు ఎంత నష్టపోయేవారు కాదని, పెట్టిన పెట్టుబడులు గంగపాలై ప్రతి గ్రామంలోనూ రైతులు రోధిస్తున్నారని తెలిపారు. పంట నష్టపోయిన ప్రతి రైతుకు ఎకరాకు 25 వేల పరిహారం ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు.

హామీల అమలేది..

గత శాసనసభ ఎన్నికల ముందు ఇచ్చిన ఏ ఒక్క హామీని కాంగ్రెస్ ప్రభుత్వం నెరవేర్చలేదని కేసీఆర్‌ ఆరోపించారు. లోక్‌సభ ఎన్నికలు రాగానే సిగ్గు లేక మరో నాలుగు ఐదు హామీలు ఇవ్వడానికి సిద్ధపడుతున్నారని విమర్శించారు. రైతుబంధు అమలుకు పాలసీ లేదు, తమ విధానం గురించి రైతులకు చెప్పే ధైర్యం, తెలివితేటలు లేవు.. మూడు, నాలుగు, ఐదెకరాలంటూ రైతుబంధు చెల్లింపుల విషయంలో తొండి పెడుతూ వస్తున్నారని ఆరోపించారు. తాను నల్లగొండ పర్యటనకు వెళుతున్నానని తెలియగానే, ఆగమేఘాల మీద కాలువలకు నీటిని విడుదల చేశారని, తాను కరీంనగర్ పర్యటనకు వస్తుంటే కూలిపోయిందని ప్రచారం చేస్తున్న కాళేశ్వరం పంపులు ఆన్ చేసి వరద కాలువకు నీటిని వదిలారని చెప్పారు. తాము అధికారం చేపట్టిన రోజే రైతుకు రెండు లక్షల రుణమాఫీ చేస్తామని ఇచ్చిన హామీ ఎటు పోయిందని నిలదీశారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత గొర్రెల పంపిణీ, దళిత బంధు పథకాలు ఆగిపోయాయన్నారు. కళ్యాణ లక్ష్మితో పాటు మహిళలకు తులం బంగారం ఇస్తామన్న హామీ ఎటు పోయింది? మార్కెట్లో బంగారం దొరకడం లేదా? అని నిలదీశారు. నేత కార్మికుల సమస్యలపై ఓ కాంగ్రెస్ నేత నిరోధ్‌లు, పాపడాలు అమ్ముకొని బతుకుతారంటూ చేసిన వ్యాఖ్యల్ని ప్రస్తావిస్తూ మీరు మనుషులేనా అని ప్రశ్నించారు. చేనేత కార్మికులు కాంగ్రెస్ ప్రభుత్వానికి మనుషుల్లా కనిపించడం లేదా? అని నిలదీశారు. నేత కార్మికుల ఆర్డర్లు, బకాయిలపై హైకోర్టులో దావా వేయాలని, అందుకు అవసరమైన లాయర్ల ఫీజు ఇస్తామని చెప్పారు. తాము 1,30,000 మంది లబ్ధిదారులకు దళిత బంధు మంజూరు చేస్తే, ఈ పథకం కోసం విడుదల చేసిన నిధులు కూడా ప్రస్తుత ప్రభుత్వం ఫ్రీజ్ చేసిందన్నారు. ఇటు యాదవులు, అటు దళితులు ప్రస్తుత ప్రభుత్వానికి కరువు కాల్చి వాత పెట్టడం తధ్యమన్నారు. ప్రస్తుత ప్రభుత్వ పాలన చూస్తే అన్న వస్త్రం కోసం పోతే, ఉన్న వస్త్రం ఊడిపోయినట్టు తయారైందన్నారు. ఆనాడు సిరిసిల్లలో 11 మంది నేత కార్మికులు ఒకేరోజు ఆత్మహత్య చేసుకుంటే, వారిని ఆదుకునేందుకు తమ పార్టీ తరఫున ఒక ట్రస్ట్ ఏర్పాటు చేసి 50 లక్షల విరాళం అందించిన విషయాన్ని గుర్తు చేశారు.ము అధికారంలోకి వచ్చిన తర్వాత పాఠశాల విద్యార్థుల యూనిఫామ్ లు, బతుకమ్మ చీరల ఆర్డర్లు ఇవ్వడం ద్వారా చేనేత కార్మికుల్లో ధైర్యం నింపగలిగామన్నారు. ప్రస్తుత ప్రభుత్వం బతుకమ్మ చీరల ఆర్డర్లు నిలిపివేయడం, గత బకాయిలు చెల్లించకపోవడంతో నేత కార్మికులు ఆత్మహత్యలే శరణ్యం అంటున్నారని చెప్పారు. నేత కార్మికుల సమస్యలపై ఓ కాంగ్రెస్ నేత నిరోధ్ లు, పాపడాలు అమ్ముకొని బతుకుతారంటూ చేసిన వ్యాఖ్యల్ని ప్రస్తావిస్తూ మీరు మనుషులేనా అని ప్రశ్నించారు. చేనేత కార్మికులు కాంగ్రెస్ ప్రభుత్వానికి మనుషుల్లా కనిపించడం లేదా? అని నిలదీశారు. నేత కార్మికుల ఆర్డర్లు, బకాయిలపై హైకోర్టులో దావా వేయాలని, అందుకు అవసరమైన లాయర్ల ఫీజు ఇస్తామని చెప్పారు.

పదివేల మందితో ధర్నా..

పాత బకాయిలు, బతుకమ్మ చీరల ఆర్డర్ల కోసం నేత కార్మికులు పదివేల మందితో శనివారం ధర్నా కార్యక్రమం చేపడుతున్నారని చెప్పారు. ఈ కార్యక్రమానికి తమ పార్టీ నేతలు అండగా ఉంటారని తెలిపారు.