దసరా పండుగ నేపథ్యంలో రైళ్లు ప్రయాణికులతో నిండిపోతున్నాయి. ఈ క్రమంలో రద్దీని తగ్గించేందుకు రైల్వేశాఖ ప్రత్యేక రైళ్లను ప్రవేశపెడుతున్నది. ఇప్పటికే పలు మార్గాల్లో ప్రత్యేక రైళ్లను తీసుకువచ్చిన దక్షిణ మధ్య రైల్వే కొత్తగా ఆరు మార్గాల్లో స్పెషల్ ట్రైన్స్‌ను నడుపనున్నట్లు వెల్లడించింది. సంత్రగాచి నుంచి సికింద్రాబాద్ (07646) ప్రత్యేక రైలు నడుపనున్నట్లు చెప్పింది. రైలు సంత్రగాచి నుంచి శనివారం (21వ తేదీ) మధ్యాహ్నం 12.20 గంటలకు బయలుదేరి మరుసటి రోజు మధ్యాహ్నం 3 గంటలకు సికింద్రాబాద్ చేరుకోనున్నది.
నాందేడ్-కాకినాడ (07050) రైలు 21న మధ్యాహ్నం 3.25 గంటలకు కాకినాడ నుంచి బయలుదేరి మరుసటి రోజు ఉదయం 7.30 గంటలకు కాకినాడకు చేరుకుంటుంది. కాకినాడ టౌన్-నాందేడ్ (07056) రైలు 22న కాకినాడ టౌన్ నుంచి రాత్రి 9గంటలకు బయలుదేరి మరుసటి రోజు మధ్యాహ్నం 1.50 గంటలకు నాందేడ్ చేరుకుంటుంది. సికింద్రాబాద్ -నర్సాపూర్ (07062) రైలు 22న అందుబాటులో ఉండనున్నది. రాత్రి 8.05 గంటలకు సికింద్రాబాద్ నుంచి బయలుదేరి తెల్లవారి 7.10 గంటలకు నర్సాపూర్ చేరుకుంటుంది.
విశాఖపట్నం – కర్నూల్ సిటీ (08585) మధ్య రైలు ఈ నెల 24, 31, నవంబర్ 7, నవంబర్ 14 తేదీల్లో నడుస్తుందని పేర్కొంది. ఈ రైలు సాయంత్రం 17.35 గంటలకు విశాఖపట్నం నుంచి బయలుదేరి మరుసటిరోజు మధ్యాహ్నం 1.25 గంటలకు కర్నూలు సిటీకి చేరనున్నది. కర్నూల్ సిటీ-విశాఖపట్నం (08586) రైలు ఈ నెల 25, నవంబర్ ఒకటి, నవంబర్ 8, నవంబర్ 15 తేదీల్లో అందుబాటులో ఉండనుండగా.. మధ్యాహ్నం 3.50 గంటలకు కర్నూల్ సిటీ నుంచి బయలుదేరి.. తెల్లవారి 9.50 గంటలకు విశాఖపట్నం చేరుకుంటుంది. ఆయా రైళ్లలో ఫస్ట్ ఏసీ, సెకండ్ ఏసీ, థర్డ్ ఏసీ, స్లీపర్, జనరల్ క్లాస్ కోచ్‌లు అందుబాటులో ఉన్నాయని దక్షిణ మధ్య రైల్వే వివరించింది.