విధాత బ్యూరో, కరీంనగర్: రాష్ట్రంలో నియంతృత్వ పాలనకు ప్రజలు విసిగిపోయారని, బీఆర్ఎస్ ను గద్దె దించడానికే కాంగ్రెస్ పార్టీతో కలిసి పని చేయాలని నిర్ణయించినట్లు తెలంగాణ జన సమితి అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం తెలిపారు. శుక్రవారం కరీంనగర్ లో ఆయన రాహుల్ గాంధీతో భేటీ అయ్యారు. అనంతరం కోదండరాం మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో జరుగుతున్న నియంతృత్వ పాలనకు వ్యతిరేకంగా గత పదేళ్లుగా పోరాడుతున్న విషయాన్ని గుర్తు చేశారు.
బీఆర్ఎస్ ను గద్దె దించేందుకు అనుసరించాల్సిన వ్యూహంపై రాహుల్ గాంధీతో చర్చించినట్టు చెప్పారు. ప్రజాస్వామిక తెలంగాణ కోసం కలసి పనిచేయాలని, అందుకు తమకు మద్దతు ఇవ్వాలని రాహుల్ ను కోరినట్టు తెలిపారు. కాంగ్రెస్ తో సీట్ల సర్దుబాటు విషయమై మరోసారి సమావేశం అవుతామన్నారు. రాష్ట్ర కాంగ్రెస్ నేతలతో చర్చల అనంతరం సీట్ల సర్దుబాటుపై స్పష్టత వస్తుందన్నారు. రాష్ట్రంలో నియంతృత్వ పోకడలు అవలంభిస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్ ను ఓడించడమే తమ ప్రాధాన్యాల్లో మొదటిదని చెప్పారు