కాంగ్రెస్ గూటికి కోమ‌టిరెడ్డి రాజ‌గోపాల్ రెడ్డి..? సాయంత్రంలోపు స్ప‌ష్ట‌త‌..!

  • Publish Date - October 23, 2023 / 07:16 AM IST

విధాత‌: మునుగోడు మాజీ ఎమ్మెల్యే, బీజేపీ నాయ‌కుడు కోమ‌టిరెడ్డి రాజ‌గోపాల్ రెడ్డి పార్టీ మార‌నున్న‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది. బీజేపీ తొలి జాబితాలో ఆయ‌న పేరు లేక‌పోవ‌డంతో, కాంగ్రెస్ పార్టీలో చేరాల‌ని మ‌ద్దతుదారుల నుంచి తీవ్ర ఒత్తిడి వ‌స్తున్న‌ట్లు స‌మాచారం. ఈ నేప‌థ్యంలో కోమ‌టిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బీజేపీని వీడి కాంగ్రెస్ పార్టీలో చేరనున్న‌ట్లు వార్త‌లు షికారు చేస్తున్నాయి. ఈ ప‌రిణామాల‌పై రాజ‌గోపాల్ రెడ్డి స్పందించారు.


కాంగ్రెస్ పార్టీలో చేరే విష‌యంపై ఇంకా నిర్ణ‌యం తీసుకోలేద‌ని రాజ‌గోపాల్ రెడ్డి పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీలో చేరాల‌న్న ఒత్తిడి ప్ర‌జ‌ల నుంచి ఉంద‌న్నారు. కాంగ్రెస్‌లో చేరిక‌పై సోమ‌వారం సాయంత్రం లోపు స్ప‌ష్ట‌త వ‌చ్చే అవ‌కాశం ఉంద‌ని తెలిపారు.


అయితే కాంగ్రెస్, క‌మ్యూనిస్టుల పొత్తులో భాగంగా మునుగోడు నుంచి సీపీఐ బ‌రిలో ఉంటే తాను పోటీ చేస్తాన‌ని బీజేపీ అధిష్టాన్ని రాజ‌గోపాల్ రెడ్డి కోరిన‌ట్లు స‌మాచారం. లేదంటే తన‌కు ఎల్‌బీన‌గ‌ర్ టికెట్ ఇవ్వాల‌ని, మునుగోడులో త‌న భార్య‌కు టికెట్ ఇవ్వాల‌ని కోరిన‌ట్లు తెలుస్తోంది.


అయితే ఎల్‌బీన‌గ‌ర్ టికెట్ ఇవ్వ‌లేమ‌ని, మునుగోడు నుంచే బ‌రిలో ఉండాల‌ని బీజేపీ అగ్ర నాయ‌క‌త్వం రాజ‌గోపాల్ రెడ్డికి తేల్చిచెప్పిన‌ట్లు స‌మాచారం. ఈ ప‌రిణామాల నేప‌థ్యంలో రాజ‌గోపాల్ రెడ్డికి తొలి జాబితాలో స్థానం ద‌క్క‌లేద‌ని స‌మాచారం. మొత్తానికి రాజ‌గోపాల్ రెడ్డి కాంగ్రెస్‌లో చేరే అవ‌కాశం ఉన్న‌ట్లు వార్త‌లు ఊపందుకున్నాయి.