సీఎం రేవంత్ రెడ్డిపై కూతురు కొండా సుస్మిత చేసిన వ్యాఖ్యలపై మంత్రి కొండా సురేఖపైన..అటు డబ్బులకు టికెట్ అమ్ముకున్నారంటూ వ్యాఖ్యానించిన కాంగ్రెస్ సీనియర్ నేత, ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు జి.చిన్నారెడ్డిపైన టీపీసీసీ క్రమశిక్షణా సంఘం కమిటీ చర్యలు తీసుకోవాలంటూ ఇచ్చిన నివేదిక రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. చిన్నారెడ్డి, సురేఖలను పదవుల నుంచి తొలగించాలంటూ కాంగ్రెస్ క్రమశిక్షణా కమిటీ నివేదిక పార్టీ హైకమాండ్ కు సిఫారసు చేసింది.
బీసీ..మహిళా మంత్రిని తొలగిస్తారా..?
నిజంగా క్రమశిక్షణా కమిటీ చేసిన సిఫారసుల మేరకు కాంగ్రెస్ హైకమాండ్ సురేఖ, చిన్నారెడ్డిలపై చర్యలు తీసుకుంటుందా లేదా అన్నదానిపై రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చ కొనసాగుతుంది. పార్టీలో వారిద్దరూ సినీయర్ నాయకులు కావడం..ముఖ్యంగా కొండా సురేఖ పద్మశాలి బీసీ సామాజిక వర్గం సీనియర్ నేతగానే కాదు..ఉమ్మడి వరంగల్ జిల్లా కాంగ్రెస్ లో కొండా కుటుంబం కీలకంగా కొనసాగేతుంది. తెలంగాణ కులగణన ప్రామాణికం అని..ఇదే మోడల్ లో దేశం అంతా కుల గణన చేసి..బీసీ రిజర్వేషన్లను పెంచాలంటున్న కాంగ్రెస్ పార్టీ మరి తెలంగాణలో బీసీ మహిళా మంత్రి కొండా సురేఖను తప్పిస్తారా? అన్నదానిపై సందేహాలు వినిపిస్తున్నాయి.
మరోవైపు కాంగ్రెస్ అధికారంలో ఉన్న కర్ణాటక, హిమాచల్ ప్రదేశ్ కేబినెట్లలో ఒక్క మహిళా మంత్రి కూడా లేరు. డీలిమిటేషన్, మహిళా బిల్లు వంటి అంశాలపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతున్న ఈ సమయంలో, కాంగ్రెస్ ఒక బీసీ మహిళా మంత్రిని తొలగించే అవకాశం ఉందా? అన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి. మహిళ సాధికారత, 33శాతం రిజర్వేషన్లపై మాట్లాడే కాంగ్రెస్ నాయకులు, కొండా సుస్మిత వ్యాఖ్యలకు కొండా సురేఖను తొలిగిస్తే..దానిని రేపు ఎలా సమర్థించుకుంటారన్న ప్రశ్న ఎదురుకాక తప్పదు.
రేవంత్ ఒత్తిడి పనిచేస్తుందా..!
కొండాపై చర్యలకు సీఎం రేవంత్ రెడ్డి ఒత్తిడి తేవచ్చన్న వాదన వినిపిస్తున్నప్పటికి..కొండా ఎపిసోడ్ తో పార్టీలో రేవంత్ మద్దతుదారుల ఎమ్మెల్యేల సంఖ్య పట్టుమని పాతిక మంది కూడా లేరని తేలిపోవడంతో ఆయన ఒత్తిడికి హైకమాండ్ స్పందిస్తుందా లేదా అన్నది మరో ఆసక్తికర అంశంగా కనిపిస్తుంది. సురేఖ ఎపిసోడ్ తో సీఎల్పీలో రేవంత్ బలం తేటతెల్లమైపోవడంతో హైకమాండ్ కొండా సురేఖ వ్యవహరంపై తన నిర్ణయాన్ని మార్చుకోవచ్చన్న ప్రచారం కూడా వినిపిస్తుంది. అయితే ప్రస్తుతం దేశ వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీకి కర్ణాటక తర్వాతా తెలంగాణ కీలక వనరుగా ఉండటంతో సీఎం రేవంత్ రెడ్డికి అనుకూలంగా హైకమాండ్ వ్యవహరించడంలో అశ్చర్యం లేకపోవచ్చన్న వాదన కూడా కొనసాగుతుంది.
కొండా సురేఖ కార్యక్రమంలో మంత్రి సీతక్క
తనకు వ్యతిరేకంగా క్రమశిక్షణా కమిటీ నివేదిక ఇచ్చినా..దీనిపై బహిరంగంగా స్పందించని సురేఖ..ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గేతో భేటీ తరువాత మంత్రిగా తన పని తాను చేసుకుంటూ వెళ్తుండటం ఆసక్తికరం. చిత్రంగా బుధవారం కొండా సురేఖ నిర్వహించిన వనమహోత్సవ కార్యక్రమానికి రేవంత్ విధేయురాలైన మంత్రి సీతక్క హాజరుకావడం అందరిని ఆశ్చర్యపరిచింది. సురేఖ కార్యక్రమానికి ఇతర మంత్రులు, ఎమ్మెల్యేలు హాజరు కానప్పటికి..సీతక్క ఒక్కరే పాల్గొనడం కాంగ్రెస్ వర్గాల్లో చర్చనీయాంశమైంది. సీఎం రేవంత్ రెడ్డి దూతగా ఆమె సయోధ్యకర్తగా వచ్చారా? అన్న ప్రచారం చోటుచేసుకుంది. సీఎం రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా సురేఖ కూతురు చేసిన వ్యాఖ్యల వివాదంపై సీతక్క ఇప్పటివరకు బహిరంగంగా స్పందించకపోవడం గమనార్హం.
క్రమశిక్షణా కమిటీ నివేదికపై తక్షణ చర్యలు సందేహమే..!
ఇకపోతే పార్టీకి కొండా సుస్మిత చేసిన వ్యాఖ్యలు పార్టీకి నష్టదాయకంగా ఉన్నాయంటే …ఆ తరహా వ్యాఖ్యలు గతంలోనూ చాలమంది చేశారు. ఒరిజినల్ కాంగ్రెస్-వలస కాంగ్రెస్, తెలుగు కాంగ్రెస్-అసలు కాంగ్రెస్ వివాదం ఎన్నికల ముందు నుంచి కూడా కొనసాగుతునే ఉంది. కొండా కుటుంబం రాజకీయ పరిణామ క్రమంలో పార్టీలు మారి తిరిగి కాంగ్రెస్ గూటికి వచ్చినప్పటికి ..ప్రస్తుత రాజకీయాల్లో పార్టీలు మారడం సాధారణమైన నేపథ్యంలో కొండా కుటుంబం పార్టీ మార్పు ఇప్పుడు అసలు సమస్యనే కాదు. ఆ మాటకొస్తే కొండా సురేఖను కేబినెట్ నుంచి బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేసిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలలో పార్టీలు మారిన వారే మెజార్టీగా ఉన్నారన్న వాదన ఉండనే ఉంది. ఈ నేపథ్యంలో కొండా సురేఖ, చిన్నారెడ్డిలపై చర్యలు తీసుకోవాలంటూ క్రమశిక్షణా కమిటీ ఇచ్చిన నివేదికను హైకమాండ్ తాత్కాలికంగా కోల్డ్ స్టోరేజీలో పెట్టవచ్చన్న వాదన వినిపిస్తుంది.
కేబినెట్ పునర్ వ్యవస్థీకరణ వరకు ఆగుతారా..?
కేబినెట్ పునర్ వ్యవస్థీకరణ ప్రక్రియ వరకు కొండా సురేఖపై క్రమశిక్షణా చర్యలు తీసుకోకపోవచ్చని..పునర్ వ్యవస్థీకరణలో భాగంగా ఆమెతో పాటు మరో ఒకరిద్దరు మంత్రులను తొలగించవచ్చన్న చర్చ బలంగా వినిపిస్తుంది. ఏది ఏమైనా క్రమశిక్షణా కమిటీ నివేదిక హైకమాండ్ కు చేరిపోయినందునా..ఇక అక్కడి నుంచి వచ్చే నిర్ణయమే ఫైనల్ అని..హైకమాండ్ ఏం నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాల్సి ఉందంటున్నాయి కాంగ్రెస్ పార్టీ వర్గాలు. కానీ నిర్ణయం ఇప్పుడల్లా వస్తుందని మెజార్టీ కాంగ్రెస్ నేతలే నమ్మకపోతుండటంతో..కొండా, చిన్నారెడ్డి ఎపిసోడ్ లలో హైకమాండ్ వ్యూహం..నిర్ణయం ఏమిటన్నది చర్చనీయాంశంగా మారింది.
కొండా ఫ్యామిలీతో టచ్‌లోకి బీజేపీ హైకమాండ్..?
కాంగ్రెస్ హైకమాండ్ కొండా సురేఖను కేబినేట్ నుంచి తొలగించి, పార్టీ నుంచి సస్పెండ్ చేసిన పక్షంలో ఆమె భవిష్యత్తు కార్యాచరణ ఏమిటన్నది మరో ఆసక్తికర అంశం. కాంగ్రెస్ నుంచి, కేబినెట్ నుంచి ఆమెను తొలగిస్తే తమ పార్టీలోకి ఆహ్వానించేందుకు బీజేపీ సిద్దంగా ఉందన్న ప్రచారం వినిపిస్తుంది. మధ్యప్రదేశ్ ఎంపీ ద్వారా కొండా మురళిని అమిత్ షా సంప్రదించినట్టుగా కథనాలు వినిపిస్తున్నాయి.
మంత్రి కొండా సురేఖ కార్యక్రమంలో సీతక్క
ఉమ్మడి వరంగల్ జిల్లా రాజకీయాల్లో ఆసక్తికర పరిణామం
కొండా సురేఖ పిలుపునిచ్చిన వనమహోత్సవ కార్యక్రమానికి హాజరైన సీతక్క
సురేఖ కార్యక్రమానికి ఇతర మంత్రులు, ఎమ్మెల్యేల హాజరుపై చర్చ
సీతక్క ఒక్కరే పాల్గొనడం రాజకీయ వర్గాల్లో ఆసక్తికరం
సురేఖ… pic.twitter.com/fr3OuqAAn2
— PulseNewsBreaking (@pulsenewsbreak) August 26, 2026
