KTR : ఓవర్ యాక్షన్ చేసే అధికారులపై అధికారంలోకి వచ్చాక చర్యలు

కేటీఆర్: అధికారంలోకి వచ్చిన తర్వాత ఓవర్ యాక్షన్ చేసే అధికారులపై చర్యలు, రైతుల సమస్యలు, BRRS పథకాల అమలు విశ్లేషణ.

KTR : ఓవర్ యాక్షన్ చేసే అధికారులపై అధికారంలోకి వచ్చాక చర్యలు

రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో ఓవర్ యాక్షన్ చేస్తున్న అధికారులపై తాము అధికారంలోకి వచ్చిన తర్వాత చర్యలు తీసుకుంటామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వార్నింగ్ ఇచ్చారు.
హైదరాబాద్ తెలంగాణ భవన్ లో సోమవారం నాడు ఆర్మూర్ అసెంబ్లీ నియోజకవర్గానికి చెందిన బీజేపీ నాయకులు విజయ భారతి ఆ పార్టీకి రాజీనామా చేసి కేటీఆర్ సమక్షంలో బీఆర్ఎస్ లో చేరారు. ఓవర్ యాక్షన్ చేస్తున్న పోలీస్ అధికారులు లేదా ఇతర అధికారుల గురించి రోడ్లపైకి వచ్చి ఆందోళన చేయాల్సిన అవసరం లేదన్నారు. వాళ్ల పేర్లు రాసి పెట్టుకోవాలని ఆయన పార్టీ శ్రేణులకు సూచించారు. అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ అధికారుల సంగతి తేలుస్తామని ఆయన అన్నారు. గతంలో తొమ్మిదిన్నర ఏళ్లలో ఉన్నట్టుగా పరిస్థితి ఉండదన్నారు. ఎన్నికల సమయంలో ఉచిత హామీల వాగ్దానాలు, పథకాల జాతరను కాంగ్రెస్ చేసిందని ఆయన విమర్శించారు. అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ హామీలను అమలు చేయడం లేదన్నారు. ఎన్నికల సమయంలోనే కేసీఆర్ ఈ విషయాన్ని చెప్పినా పట్టించుకోలేదన్నారు. మార్పు కోసమని కాంగ్రెస్ ను గెలిపిస్తే ఏం చేశారని ఆయన ప్రశ్నించారు. మార్పు వచ్చిందా అని ఆయన అడిగారు.

బీఆర్ఎస్ అనేక మంచి పనులు చేసిందని… కానీ, ఆ పనులను ప్రచారం చేసుకోలేకపోయిందని కేటీఆర్ అన్నారు. ఈ పనుల గురించి ప్రచారం చేసుకోలేక ఓడిపోయామన్నారు. తమ ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో రైతు బంధు సకాలానికి రైతులకు అందేదని ఆయన అన్నారు. కానీ, తాము ఇస్తామన్న దానికి అదనంగా ఇస్తామని రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారని సకాలంలో రైతు భరోసా అందుతోందా అని ఆయన ప్రశ్నించారు. రైతుల ఖాతాల్లో రైతు భరోసా కింద రూ. 15 వేలు జమ చేస్తామన్న హామీని రేవంత్ రెడ్డి సర్కార్ అమలు చేయడం లేదని ఆయన విమర్శించారు. ప్రతి ఏటా 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని నరేంద్ర మోడీ హామీ ఇచ్చారని ఆయన గుర్తు చేశారు. ప్రతి ఏటా రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామని రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారని ఆయన గుర్తు చేశారు. ఈ హామీలు అమలు అయ్యాయా అని ఆయన ప్రశ్నించారు. అదానీని రాహుల్ గాంధీ విమర్శిస్తే రేవంత్ రెడ్డి పొగుడుతున్నారని ఆయన అన్నారు. ఇద్దరూ కలిసి రాహుల్ గాంధీని ఆటలో అరటిపండుగా మార్చారని ఆయన విమర్శించారు. మోడీ, రేవంత్ రెడ్డి కలిసి రాహుల్ గాంధీ పెద్ద షాక్ ఇవ్వడం ఖాయమని ఆయన అన్నారు తెలంగాణకు హిమాలయాలు కరిగించిన నీళ్లు ఇస్తారట అని ఆయన ఎద్దేవా చేశారు. బీజేపీ, కాంగ్రెస్ లకు 8 మంది ఎంపీలుంటే రాష్ట్రానికి ఏం చేశారని ఆయన ప్రశ్నించారు. రేవంత్ రెడ్డికి రక్షణ కవచంలా బీజేపీ పనిచేస్తోందని ఆయన ఆరోపించారు. రేవంత్ ప్రతి తప్పును బీజేపీ ఎంపీలు కాపాడుతున్నారని ఆయన విమర్శించారు. కేంద్రంలో రేవంత్ రెడ్డి బంధువును బీజేపీ కాపాడితే, బీజేపీ ఎంపీకి రేవంత్ రెడ్డి రోడ్డు కాంట్రాక్టు ఇచ్చారని కేటీఆర్ చెప్పారు. రేవంత్ రెడ్డి, మోడీ ఇద్దరూ ఒక్కటేనని ఆయన అన్నారు. ప్రశ్నించిన వారిపై మోడీ ఈడీ కేసులు బనాయిస్తే రేవంత్ రెడ్డి ఏసీబీ కేసులు పెడుతున్నారని ఆయన ఆరోపించారు. యూరియా కోసం రైతులు రోజుల తరబడి క్యూ లైన్లలో నిలబడుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆయన అన్నారు.