మేడ్చల్ : బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ రాష్ట్రానికి మోదీ చేసిందేమీ లేదు.. కాబట్టి చెప్పుకునేందుకు ఏం లేక జైశ్రీరాం అంటున్నారని కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. జై శ్రీరాం నినాదం.. జై శ్రీరాం నినాదం కడుపు నింపదు.. ఉద్యోగం ఇవ్వదు అని వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలిపారు. మేడ్చల్ నియోజకవర్గంలో నిర్వహించిన మల్కాజ్‌గిరి పార్లమెంట్ సమావేశంలో కేటీఆర్ ఈ వ్యాఖ్యలు చేశారు.
తెలంగాణలో నిజమైన సెక్యులర్ పార్టీ ఏదైనా ఉందా అంటే అది కేసీఆర్ నాయకత్వంలోని బీఆర్ఎస్ మాత్రమే అని కేటీఆర్ స్పష్టం చేశారు. మనిషిని మనిషిగా చూసే పార్టీ.. మతం కోణంలో చూడని పార్టీ కూడా బీఆర్ఎస్సే. పిల్లలు ఎవరైనా జై శ్రీరాం అంటే సముదాయించాలి. జై శ్రీరాం అనే నినాదాం కడుపు నింపదు.. నీకు ఉద్యోగం ఇవ్వదు.. ఉద్వేగాలు కాదు.. ఉద్యోగాలు కావాలి.. కొట్టాడేటోళ్లు కావాలి.. మీ కోసం పార్లమెంట్‌లో కొట్లాడేవాళ్లు కావాలని యువతకు వివరించి చెప్పాలని కేటీఆర్ సూచించారు.
ఈ దేశాన్ని పదేండ్లు పాలించిన మోదీ.. తెలంగాణకు చేసిందేమీ లేదు. కానీ కేసీఆర్ ఈ పదేండ్లు సీఎంగా ఉండి.. ఎన్నో సంక్షేమ, అభివృద్ధి పథకాలు అమలు చేశారు. ప్రతి కుటుంబం కూడా ఏదో ఒక సంక్షేమ పథకంతో లాభపడింది. మల్కాజ్‌గిరి పార్లమెంట్‌కు మోదీ ఏం చేశారో చెప్పి ఈటల రాజేందర్ ఓట్లు అడగాలని డిమాండ్ చేస్తున్నట్లు కేటీఆర్ తెలిపారు. ఒక్క విద్యాసంస్థ కూడా మోదీ తెలంగాణకు ఇవ్వలేదు. తెలంగాణ ఏం చేశారని మోదీని, బీజేపీ ప్రభుత్వాన్ని నిలదీస్తే చెప్పేటందుకు ఏం లేక.. జై శ్రీరాం అంటున్నారు. మేం కూడా జై శ్రీరామ్ అంటున్నం. కానీ మేం రాముడి పేరు చెప్పి ఓట్లు అడుగుతలేం. యాదాద్రి ఆలయాన్ని కేసీఆర్ అద్భుతంగా నిర్మించారు.. దాన్ని రాజకీయంగా వాడుకోలేదు. నిజమైన హిందువు ధర్మాన్ని ఆచరిస్తున్నాడు. దేవుడిని అడ్డం పెట్టుకుని రాజకీయం చేయడు అని కేటీఆర్ పేర్కొన్నారు.