KTR : ఆల్మట్టి ఎత్తు పెంపుతో తెలంగాణకు కర్ణాటక కాంగ్రెస్ మరణశాసనం

ఆల్మట్టి ఎత్తు పెంపుతో తెలంగాణ రైతులకు ముప్పు, కర్ణాటక కాంగ్రెస్‌పై కేటీఆర్ తీవ్ర విమర్శలు, రేవంత్ నిర్లక్ష్యాన్ని ప్రశ్నించారు.

KTR Vs Revanth Reddy

హైద‌రాబాద్‌, సెప్టెంబ‌ర్‌19(విధాత‌): కర్ణాటక కాంగ్రెస్ ప్రభుత్వం ఆల్మట్టి డ్యాం ఎత్తు పెంచి తెలంగాణ రైతాంగానికి మరణ శాసనం రాస్తుంటే, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీలో జల్సాలు చేస్తున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటీఆర్ మండిపడ్డారు. ఆల్మట్టి డ్యాం ఎత్తును 519 అడుగుల నుంచి 524 అడుగులకు పెంచాలని మూడు రోజుల కిందట కర్ణాటక మంత్రిమండలి నిర్ణయం తీసుకుంటే దున్నపోతు మీద వాన పడ్డట్టుగా సిఎం రేవంత్ రెడ్డి వ్యవహరిస్తున్నారని విరుచుకుపడ్డారు. కేవలం 100 టిఎంసీల కోసమే ఆల్మట్టి ఎత్తు పెంచడం లేదన్న కేటీఆర్, కృష్ణా జలాల్లోని తెలంగాణ హక్కును బొందపెట్టి ఉమ్మడి మహబూబ్ నగర్, నల్గొండ, రంగారెడ్డిలను ఎడారులుగా మార్చేందుకు కర్నాటక కాంగ్రెస్ కుట్ర పన్నిందని ఆరోపించారు. అక్కడా కాంగ్రెస్సే, ఇక్కడా కాంగ్రెస్సే అయినా మాట్లాడే దమ్ము, తెలంగాణ రైతుల పొట్టగొడుతుంటే ఆపే ధైర్యం లేవా? అని రేవంత్ ను నిలదీశారు. ఈ కుట్రపై ముఖ్యమంత్రి రేవంత్ తో పాటు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తెలంగాణ ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. జాతీయ పార్టీకి జాతీయ విధానం ఉండాలి. కర్ణాటక రాష్ట్ర ప్రయోజనాల కోసం తెలంగాణ రాష్ట్రాన్ని, ఇక్కడి రైతులను బలిస్తారా? అని ప్రశ్నించారు. కర్నాటక కాంగ్రెస్ ప్రభుత్వ కుట్రను వెంటనే అడ్డుకోకపోతే రైతులతో కలిసి మహోద్యమాన్ని నిర్మిస్తామని హెచ్చరించారు. కేవలం ఐదు అడుగుల ఎత్తు పెంచేందుకు అవసరమైన భూసేకరణ కోసమే 70 వేల కోట్లు ఖర్చు చేయడంతో పాటు లక్షా 30 వేల ఎకరాలను భూమిని సేకరిస్తున్నామని కర్ణాటక ప్రభుత్వం చెపుతుందన్నారు. మరి 5 అడుగుల భూసేకరణకే అంత ఖర్చయితే, 3 బ్యారేజీలు, 15 రిజర్వాయర్లు, 19 సబ్ స్టేషన్లు, 21 పంపింగ్ స్టేషన్లు, 203 కిలోమీటర్ల టన్నెల్స్, 1700 కిలోమీటర్ల కాలువలు.. 40 లక్షల ఎకరాలకు నీళ్లిచ్చే కాళేశ్వరం ప్రాజెక్టుకు 93 వేల కోట్ల ఖర్చు చేయడంలో తప్పేం ఉందన్నారు. ఆల్మట్టి ఎత్తు పెంపు అంశం సుప్రీంకోర్టులో పెండింగ్ లో ఉండగానే కర్ణాటక సర్కారు ఇంత దుర్మార్గమైన నిర్ణయం తీసుకుంటే తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు ప్రశ్నించడం లేదని కేటీఆర్ నిలదీశారు.

ఓట్ చోరి కంటే ఎమ్మెల్యేల చోరి పెద్ద నేరం- కేటీఆర్‌

ఓట్ చోరీపై గొంతు చించుకుంటున్న కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ, తెలంగాణలో తమ పార్టీ చేసిన ఎమ్మెల్యేల చోరీపై ఏం సమాధానం చెబుతారని కేటీఆర్ ప్ర‌శ్నించారు. ఓట్ల చోరీ ఒక నేరమైతే, ప్రజలు ఎన్నుకున్న ఎమ్మెల్యేలను దొంగిలించడం అంతకంటే పెద్ద నేరమని, అది ప్రజాస్వామ్యాన్ని పట్టపగలు ఖూనీ చేయడమేనని మండిపడ్డారు. రాహుల్ గాంధీకి సిగ్గు,శరం ఉంటే బీఆర్ఎస్ గుర్తుపై గెలిచి కాంగ్రెస్ కండువా కప్పుకున్న ఎమ్మెల్యేలతో వెంటనే రాజీనామా చేయించాలని కేటీఆర్ సవాల్ విసిరారు. అప్పుడే ఆయనకు ఓట్ల చోరీ గురించి మాట్లాడే నైతిక అర్హత ఉంటుందని స్పష్టం చేశారు.