విధాత, హైద్రాబాద్ : ఆత్మహత్య చేసుకున్న గ్రూప్-2 అభ్యర్థిని ప్రవళిక కుటుంబానికి అండగా ఉంటామని బీఆరెస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ హామీ ఇచ్చారు. ప్రగతిభవన్‌లో మంత్రి కేటీఆర్‌ను ప్రవళిక కుటుంబ సభ్యులు కలిశారు. ఈ సందర్భంగా ప్రవళిక తల్లిదండ్రులకు, సోదరుడికి మంత్రి ప్రగాఢ సానుభూతి తెలియజేసి వారిని ఓదార్చారు. కుటుంబానికి అన్ని విధాలుగా అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.
ఈ సందర్భంగా ప్రవళిక తల్లిదండ్రులు మంత్రి కేటీఆర్‌తో ప్రవళిక మరణానికి శివరామ్ అనే వ్యక్తి కారణం అని, అతన్ని కఠినంగా శిక్షించాలని కోరారు. కుటుంబ సభ్యులను ఓదార్చి వారికి మంత్రి భరోసా ఇచ్చారు. ఈ సంఘటనకు సంబంధించి అన్ని వివరాలను డీజీపీతో మాట్లాడి తెలుసుకున్నట్లు చెప్పారు.
కాగా.. విచారణను మరింత వేగంగా పూర్తి చేయాలని ఆదేశించానని, ప్రవళిక మృతికి కారణమైన వ్యక్తికి తప్పకుండా తగిన శిక్ష పడేలా చూస్తామని వారికి మంత్రి భరోసా ఇచ్చారు. ప్రవళిక కుటుంబాన్ని అన్ని విధాలా ఆదుకుంటామని, ఆమె సోదరుడికి ఉద్యోగం ఇప్పిస్తానని మంత్రి హామీ ఇచ్చారు. కేటీఆర్ ఇచ్చిన భరోసాకు ప్రవళిక కుటుంబ సభ్యులు ధన్యవాదాలు తెలిపారు.