Ponnam Prabhakar | వారంలో జిల్లాలకు కొత్తగా 350 బస్సులు

Ponnam Prabhakar | వారం రోజుల్లో మహిళా సమైక్య సంఘాల నుండి 350 బస్సులు ప్రారంభం అవుతున్నాయని మహబూబ్ నగర్ జిల్లాలో మండలానికి ఒకటి చొప్పున బస్సులు కేటాయిస్తున్నట్టు మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు.

  • By: raj |    telangana |    Published on : Mar 27, 2026 8:17 AM IST
Ponnam Prabhakar | వారంలో జిల్లాలకు కొత్తగా 350 బస్సులు

కొత్త రూట్లు, బస్ స్టేషన్‌ల అభివృద్ధి చర్యలు
మహాలక్ష్మీ ద్వారా మౌలిక సదుపాయాలు
ఆర్టీసీ యాక్షన్ ప్లాన్ పై మంత్రులు, ఎమ్మెల్యేలతో పొన్నం ముఖాముఖి

Ponnam Prabhakar | విధాత, ప్రత్యేక ప్రతినిధి: వారం రోజుల్లో మహిళా సమైక్య సంఘాల నుండి 350 బస్సులు ప్రారంభం అవుతున్నాయని మహబూబ్ నగర్ జిల్లాలో మండలానికి ఒకటి చొప్పున బస్సులు కేటాయిస్తున్నట్టు మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. మహబూబ్ నగర్, వరంగల్ , నిజామాబాద్ జిల్లా మంత్రులు ,ఎమ్మెల్యేలు తో ఆర్టీసీ అధికారుల సమక్షంలో గురువారం మంత్రి పొన్నం ప్రభాకర్ ముఖాముఖి నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేల ప్రతిపాదనల అనంతరం ఆర్టీసీ చేపట్టనున్న కార్యాచరణ ప్రణాళిక పై మంత్రి వివరించారు. మహా లక్ష్మీ పథకం ద్వారా పెరుగుతున్న ప్రయాణికులకు అనుగుణంగా బస్సుల సంఖ్య పెంచుతున్నామని కొత్త రూట్ లలో బస్సులు నడుపుతున్నామని అందువల్లే గ్రామాల్లో కావలసిన కొత్త రూట్ లు ,బస్ స్టేషన్ల అభివృద్ధి పై ప్రజా ప్రతినిధులు ద్వారా వినతులు స్వీకరిస్తున్నామని పేర్కొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని బస్ స్టేషన్ లలో టాయిలెట్స్ నిర్మాణాలు చేపట్టాలని ఆదేశించారు. ఆర్టీసీ విస్తించడమే లక్ష్యంగా పని చేస్తున్నామని మంత్రి పొన్నం ప్రభాకర్ వెల్లడించారు.

ఈ సందర్భంగా మంత్రులు జూపల్లి కృష్ణారావు, వివేక్ వెంకట్ స్వామి, సీతక్క , వాకిటి శ్రీహరి మాట్లాడుతూ కొత్త రూట్ లలో బస్సులు కావాలని, విద్యార్థుల కాలేజీ సమయానికి బస్సులు నడపాలని సూచించారు. చిన్న పల్లెలకు మినీ బస్సులు నడిపాలని, ఆదిలాబాద్ జిల్లాలో బస్సుల కెనెక్టివిటీ పెంచాలని కోరారు. చెన్నూరు లో బస్ స్టేషన్ అభివృద్ధి చేయాలని , మెదక్ జిల్లాలో కొత్త రూట్లలో బస్సులు నడిపించాలని సూచించారు. ములుగు జిల్లాలో ఏటూరు నాగారం బస్ డిపో ములుగు జిల్లా కేంద్రానికి మంజూరైన బస్ స్టేషన్ పనులు వేగవంతం చేయాలని మంత్రి సీతక్క సూచించారు. మేడారం సమ్మక్క సారలమ్మ ఆలయం వద్ద శాశ్వత పరిష్కారంగా బస్ స్టేషన్ నిర్మించాలని కోరారు. అందుకు దేవాదాయ శాఖ ,టూరిజం నుండి ప్రత్యేక నిధులు కేటాయించేలా చర్యలు తీసుకుంటామన్నారు. శని, ఆదివారాల్లో హనుమకొండ నుండి మేడారం కి బస్సులు వేయాలని కోరారు.

ఎమ్మెల్యేలు మాట్లాడుతూ భూపాలపల్లి జిల్లా రేగొండ లో శంకుస్థాపన చేసుకున్న బస్ స్టేషన్ పనులు వేగవంతం చేయాలని కోరారు. వరంగల్ లో కాకతీయ యూనివర్సిటీ కి ప్రత్యేక బస్సులు నడిపించాలని, పురాతన హనుమకొండ బస్ స్టేషన్ మోడర్న్ బస్ స్టేషన్ గా మార్చాలని, వర్షకాలంలో వరద లో బస్ స్టేషన్లో కి నీళ్ళు వస్తున్నాయని చెప్పారు. నర్సంపేట బస్ స్టేషన్ అభివృద్ధి చేయాలని, నెక్కొండ బస్ కాంప్లెక్స్ ఏర్పాటు చేయాలని కోరారు. మానుకోటలో కొత్త రూట్లలో బస్సులు వేయాలని కోరారు,వర్ధన్నపేట లో ఉన్న ఆర్టీసీ స్థలంలో డ్రైవర్ శిక్షణ స్కూల్ ఏర్పాటు చేయాలని పాలకుర్తి బస్ స్టేషన్ అభివృద్ధి చేయాలని సూచించారు. కొమురవెల్లి బస్ స్టేషన్ ఆధునీకరించాలని కోరారు. ఎల్లారెడ్డి అధునాతన బస్ స్టేషన్ ప్రయాణికులకు ఎంతగానో ఉపయోగపడుతుందని తెలిపారు. నిజామాబాద్ బస్ స్టేషన్ ను అధునాతన హంగులతో నిర్మించాలని కోరారు. ఆర్మూరు కొత్త బస్ స్టేషన్ నిర్మించాలని కోరారు. రాయచూరు కి దగ్గర లో ఉండడం వల్ల ఆర్టీసీ అదనపు బస్సులు నడిపించాలని కోరారు. నాగర్ కర్నూల్ నియోజకవర్గానికి అదనంగా 10 కొత్త బస్సులు కావాలని కోరారు.

ఈ సమావేశంలో ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా ఎమ్మెల్యేలు యెన్నం శ్రీనివాస్ రెడ్డి,అనిరుధ్ రెడ్డి, మధుసూదన్ రెడ్డి, కుచుకుళ్ళ రాజేష్ రెడ్డి ,వంశీ కృష్ణ ,మేఘా రెడ్డి ,బండ్ల కృష్ణమోహన్ రెడ్డి , విజయుడు , చిట్టెం పర్ణిక రెడ్డి , వరంగల్ జిల్లా ఎమ్మెల్యేలు పల్లా రాజేశ్వర్ రెడ్డి,యశస్విని రెడ్డి,మురళి నాయక్,దొంతి మాధవ రెడ్డి, కే ఆర్ నాగరాజు ,రేవూరి ప్రకాష్ రెడ్డి, నాయిని రాజేందర్ రెడ్డి, గండ్ర సత్యనారాయణ , నిజామాబాద్ జిల్లా నుండి ఎమ్మెల్యేలు రాకేష్ రెడ్డి, పోచారం శ్రీనివాస్ రెడ్డి, దన్ పాల్ సూర్యనారాయణ, మదన్ మోహన్ లు,స్పెషల్ సీఎస్ వికాస్ రాజ్,ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డి, ఈడి లు , ఆర్ఎం లు, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.