ఈడి తరువాత మోడీ వ‌స్తారు: మంత్రి సీత‌క్క

ఈడి తరువాత మోడీ వ‌స్తారు: మంత్రి సీత‌క్క

 

విప‌క్షాల పై వివిధ ఒత్తిడులు
బీజేపీలో చేరితే క్లీన్ స‌ర్టిఫికేట్
హామీలు అమ‌లుచేయ‌ని మోడీ
బీజేపీ, బీఆర్ఎస్ విష‌ప్ర‌చారం
క‌లిసిక‌ట్టుగా పనిచేస్తే విజ‌యం

విధాత‌, వ‌రంగ‌ల్ ప్ర‌తినిధిః దేశంలో ఎక్క‌డ ఎన్నిక‌లు జ‌రిగినా ప్ర‌తిప‌క్ష పార్టీల‌ను ఇబ్బందుల్లోకి నెట్టివేధించేందుకు ముందు ఎన్‌ఫోర్సుమెంట్ డిపార్టు మెంట్ (ఈడి) వ‌స్తోంద‌ని, దాని వెనుక మోడీ ప్ర‌చారానికి వ‌స్తారంటూ రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ మంత్రి దనసరి అనసూయ సీతక్క విమ‌ర్శించారు. కొత్త‌గూడెం, గంగారం మండ‌లాల ప‌రిధి కాంగ్రెస్ కార్య‌క‌ర్త‌ల స‌మావేశం గురువారం జ‌రిగింది. ఈ స‌మావేశంలో మంత్రి సీత‌క్క‌తో పాటు కాంగ్రెస్ పార్టీ మ‌హ‌బూబాద్ ఎంపీ అభ్య‌ర్ధి పోరిక బ‌ల‌రామ్ నాయ‌క్ పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రతిపక్ష పార్టీల్లో ఉండే నేతలను అవినీతి పరులంటూ విమ‌ర్శిస్తున్న బీజేపీ నాయ‌కులు ఆరోప‌ణ‌లు చేసిన వ్య‌క్తులే ఆ పార్టీలో చేరగానే వాషింగ్ పౌడర్ నిర్మా లెక్క పునీతులు అవుతున్నార‌ని ఎద్దేవా చేశారు. బీజేపీ, బీఆర్ఎస్ హ‌యాంలో పేద బలహీన వర్గాల మీద అన్యాయం జరిగిందన్నారు. మన ప్రాంతంలో అధికంగా పొడు భూమి ఉందని, రైతులు బోరు వేయాలంటే అడ్డంకులు ఉంటాయిగానీ, కార్పొరేట్ దిగ్గజాలకు మైనింగ్ ల కోసం రెడ్ కార్పేట్ లు వేసి బీజేపీ స్వాగ‌తం ప‌లుకుతోంద‌న్నారు. ప‌దేళ్ళు అధికారంలో ఉన్నా పేద‌ల‌కు బీజేపీ ప్రభుత్వ హయాంలో గుంట భూమి ఇచ్చింది లేదని విమ‌ర్శించారు. అదాని, అంబానీలకు మన వనరులని కట్టబెట్టి బడా వ్యాపారవేత్త‌లకు మన బతుకులు అప్పగించారని అన్నారు. జీవించే హక్కులని హరించే దిశగా బీజేపీ అడుగు వేస్తుందన్నారు.జనధన్ ద్వారా ప్రతి ఒక్కరికి రూ. 15లక్షలు అని ప్రగల్బాలు పలికిన నరేంద్ర మోడీ, బీజేపీ పార్టీ నాయకులు గ్రామాలకు వస్తే ప్రశ్నించాలని పిలుపు నిచ్చారు.

రాష్టాన్ని నాశ‌నం చేసిన బీఆర్ఎస్‌

ప‌దేండ్లు రాష్ట్రాన్ని పాలించిన బీఆర్ఎస్ పాల‌న‌లో రాష్ట్రం నాశ‌న‌మైంద‌ని మంత్రి విమ‌ర్శించారు. తెచ్చిన అప్పులకు 70వేల కోట్ల వడ్డీలు కట్టాల్సిన పరిస్థితి నెల‌కొంద‌న్నారు. అప్పులు ఉన్న అభివృద్ధి, సంక్షేమం ఆపకుండా కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు వెళ్తుందన్నారు. తలపున గోదారి ఉండి గొంతు తడప లేని దుస్థితి తెచ్చిన గత ప్రభుత్వానికి అసెంబ్లీ ఎన్నిక‌ల్లో బుద్దిచెప్పిన‌ట్లే పార్ల‌మెంట్ ఎన్నిక‌ల్లో కర్ర‌కాల్చివాత పెట్టాల‌న్నారు.కేవలం కమిషన్ ల కోసం కాళేశ్వ‌రం త‌దిత‌ర ప్రాజెక్ట్ లను రీ డిజైన్ చేశార‌ని ఆరోపించారు. మ‌న అగ్ర నేత రాహుల్ గాంధీ ప్రధానిగా చేసుకోవాలంటే ఎంపీగా బ‌ల‌రామ్ నాయ‌క్ ను గెలిపించాల‌ని పిలుపు నిచ్చారు. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ఆరు గ్యారంటీలు అమ‌లు చేసేందుకు చ‌ర్య‌లు చేప‌ట్టింద‌న్నారు. కానీ,ఉచిత బస్సు పథకం అమ‌లు చేస్తుంటే బీఆర్ఎస్ నాయ‌కులు ఆటో సోదరులకు అన్యాయం జరుగుతుందని విష ప్రచారం చేస్తున్నార‌ని అన్నారు. పేద‌లకు 200 యూనిట్ల వ‌ర‌కు ఉచిత విద్యుత్తు స‌ర‌ఫ‌రాచేస్తున్నామ‌ని అన్నారు. రానున్న ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ విజ‌యానికి కార్య‌క‌ర్త‌లు క‌లిసిక‌ట్టుగా ప‌నిచేయాల‌ని మంత్రి సీత‌క్క పిలుపునిచ్చారు.