విధాత, ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా ప్రతినిధి: బలం, బలగం బీఆర్ఎస్ సైన్యమేనని రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. మహబూబ్ నగర్ జిల్లాకేంద్రంలోని మంత్రి క్యాంప్ కార్యాలయంలో ఆదివారం నియోజకవర్గంలోని బీఆర్ఎస్ బూత్ ఇంచార్జుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఇతర పార్టీలకు లేనంత మంది కార్యకర్తలున్న పార్టీ బీఆర్ఎస్ అని గర్వంగా చెప్పుకుంటామన్నారు. క్రమశిక్షణ ఉన్న ఈ పార్టీ సైనికులు క్షేత్రస్థాయిలో పార్టీ బలోపేతం అయ్యేలా ఎంతో కృషి చేస్తున్నారన్నారు. బీఆర్ఎస్ అంటేనే అభివృద్ధికి చిరునామా అని, పదేళ్లలో రాష్ట్రంలో, మహబూబ్ నగర్ లో జరిగిన అభివృద్ధే తమను మరోసారి అఖండ విజయం సాధించేలా చేస్తుందని ధీమా వ్యక్తం చేశారు.
క్షేత్రస్థాయిలో మిగతా పార్టీలకు కనీసం ఏజెంట్లు దొరకని పరిస్థితి ఉందని, అయినప్పటికీ పోలింగ్ వరకు పార్టీ కేడర్ అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఎన్నికలప్పుడు వచ్చి నెల, రెండు నెలలు మాత్రమే ఉండి వెళ్లే గెస్ట్ క్యారెక్టర్ల పట్ల అప్రమత్తంగా ఉండాలని, ప్రజలకు తెలిసేలా చేయాలన్నారు. 24 గంటలు, 365 రోజులు ప్రజలకు అందుబాటులో ఉండి వారికి విద్య, వైద్యం, ఉపాధి, ఉద్యోగాలు సహా అనేక అంశాల్లో సాయమందిస్తున్న గులాబీకి ప్రజాబలం బలంగా ఉందని, అది త్వరలో జరిగే ఎన్నికల్లో వెల్లడవుతుందని మంత్రి పేర్కొన్నారు. కార్యక్రమంలో జిల్లా బీఆర్ఎస్ నాయకులు రాజేశ్వర్ గౌడ్, గోపాల్ యాదవ్, శాంతన్న యాదవ్, నర్సింహులు, వెంకన్న, వెంకటయ్య, రెహ్మాన్, గణేష్, గిరధర్ రెడ్డి పాల్గొన్నారు.