చివరి గింజ వరకు కొంటాం : మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి

రైతులు పండించిన ధాన్యం చివరి గింజ వరకు మద్దతు ధరతో కొనుగోలు చేస్తామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి హామీ ఇచ్చారు. రాష్ట్రవ్యాప్తంగా కొనుగోళ్లను వేగవంతం చేయాలని అధికారులకు ఆదేశించారు.

చివరి గింజ వరకు కొంటాం : మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి

రైతులు పండించిన ధాన్యం చివరి గింజ వరకు మద్దతు ధరతో కొనుగోలు చేస్తామని, రైతులు ఆందోళన చెందవద్దని తెలంగాణ పౌరసరఫరాల శాఖ మంత్రి ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. గురువారం మంత్రులు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, అడ్లూరి లక్ష్మణ్ లతో కలిసి నల్లగొండ జిల్లాలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను సందర్శించి రైతుల సమస్యలను తెలుసుకున్నారు. కొనుగోలు కేంద్రానికి వచ్చిన ధాన్యం, కొనుగోలు చేసి మిల్లుకు పంపిన ధాన్యం, ఇంకా ఎంత ధాన్యం ఉన్నది, ఎన్ని రోజుల్లో పూర్తి ధాన్యం కొనుగోలు చేస్తారన్న వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. కొనుగోలులో వేగం పెంచి యుద్ద ప్రాతిపదికన పూర్తి చేయాలని.. సేకరించిన ధాన్యం వెంటనే మిల్లులకు తరలించేలా ఏర్పాట్లు చేయాలని అందుకు అనుగుణంగా లారీల సంఖ్య పెంచాలని ఆదేశాలు జారీ చేశారు.

90లక్షల టన్నుల కొనుగోలు పూర్తికి చర్యలు

ఈ సందర్బంగా మంత్రి ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ ..నేడు తెలంగాణ రాష్ట్రం వరి ధాన్యం ఉత్పత్తిలో నంబర్ వన్ గా నిలిచిందని తెలిపారు. ఈ రబీలో 65 లక్షల ఎకరాల్లో 140 లక్షల మెట్రిక్ టన్నుల వరి పండగా, ప్రభుత్వం 90 లక్షల మెట్రిక్ టన్నులను సేకరించనుందని తెలిపారు. ఇందుకోసం 8,575 కేంద్రాలను ఏర్పాటు చేసి, ఇప్పటి వరకు 3.84 లక్షల మంది రైతుల నుండి ధాన్యం సేకరించినట్లుగా వెల్లడించారు. రాష్ట్రవ్యాప్తంగా 30 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు పూర్తి చేసి, రైతుల ఖాతాల్లో రూ. 4,600 కోట్లు జమ.. మరో రూ. 3,000 కోట్లు చెల్లింపులు కొనసాగుతున్నాయన్నారు.

నల్లగొండ జిల్లాలో 14.65 లక్షల మెట్రిక్ టన్నుల దిగుబడి రాగా, ఇప్పటి వరకు 7.24 లక్షల మెట్రిక్ టన్నులు కొనుగోలు చేశారని, 53,611 మంది రైతుల ఖాతాల్లో రూ. 692 కోట్లు జమ చేశామని, మరో రెండు రోజుల్లో రూ. 400 కోట్లు జమ చేస్తామని తెలిపారు.తరుగు, తాలు పేరుతో మిల్లర్లు రైతులను ఇబ్బంది పెడితే సహించేది లేదని, వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడుతూ… గతం కంటే ఈసారి జిల్లాలో 30 వేల మెట్రిక్ టన్నుల ధాన్యం అధికంగా పండిందని చెప్పారు. రానున్న 10 రోజుల్లో కొనుగోలు పూర్తి చేయాలని, అవసరమైతే మరిన్ని లారీలను వినియోగించాలని కలెక్ట ర్ ను ఆదేశించారు. రైతుల సంక్షేమం కోసం కాంగ్రెస్ పార్టీ ప్రాజెక్టులు నిర్మించిందని, ఉచిత విద్యుత్ తెచ్చిందని గుర్తు చేశారు. శ్రీరామ్ సాగర్, నాగార్జునసాగర్, శ్రీశైలం లాంటి ప్రాజెక్టులను కాంగ్రెస్ ప్రభుత్వాలు కట్టాయని, రైతుల కోసం సాగునీటి ప్రాజెక్టులు కట్టిన ఫలితంగా ధాన్యం సాగు పెరిగిందన్నారు. జిల్లాలోని ఏఎమ్మార్పీ కాలువల లైనింగ్ కోసం రూ. 450 కోట్లు ఖర్చు చేస్తున్నామని, ఎస్ఎల్బీసీ పూర్తయితే దిగుబడులు మరింత పెరుగుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు.

జిల్లా ఇన్ చార్జ్ మంత్రి అడ్లూరు లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ.. హమాలీలు, రవాణా సమస్యలను అధిగమించి రైతుల చెంతకే వచ్చి ధాన్యం కొంటున్నామని, నిర్ణీత సమయంలోనే డబ్బులు జమ చేస్తామని తెలిపారు. క్షేత్రస్థాయిలో ఉన్న కొన్ని సమస్యలు ఒక్కొక్కటిగా అధిగమిస్తూ రైతు శ్రేయస్సు కోసం పనిచేస్తున్నాం అని స్పష్టం చేశారు. చివరి గింజ వరకు మా ప్రభుత్వం మద్దతు ధరకు కొనుగోలు చేస్తుందని పునరుద్ఘాటించారు.

ఇవి కూడా చదవండి :

అగ్రిగోల్డ్‌ బాధితులకు 6 నెలల్లో న్యాయం: సీఎం చంద్రబాబు
కేరళం సీఎంగా వీడీ సతీశన్…కాంగ్రెస్ హైకమాండ్ ప్రకటన