విధాత : కుటుంబ రాజకీయాల గురించి ప్రియాంక గాంధీ, రాహుల్‌గాంధీలు మాట్లాడటం పెద్ద జోక్ అని బీఆరెస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఎద్దేవా చేశారు. మోతీలాల్ కొడుకు నెహ్రూ.. జవహర్‌లాల్ కూతురు ఇందిరా.. ఆమె కొడుకు రాజీవ్.. ఆయన కూతురు ప్రియాంక అని సంగతి మరిచి కుటుంబ రాజకీయాలపై విమర్శలు చేయడం హాస్యాస్పదంగా ఉందన్నారు. తెలంగాణ ప్రజలు వారి మాటలు విని నవ్వుకుంటున్నారని ఎమ్మెల్సీ కవిత ఎద్దేవా చేశారు. ఎవరో రాసిచ్చిన స్క్రిప్ట్‌ను రాహుల్, ప్రియాంకలు చదువుతున్నారని విమర్శించారు.
ఆర్మూర్‌లో బీఆర్‌ఎస్ అభ్యర్థి జీవన్ రెడ్డితో కలిసి మీడియాతో మాట్లాడారు. కాళేశ్వరం, మిషన్ భగీరథ ప్రాజెక్టుల ఖర్చు రూ.లక్ష కోట్ల లోపే ఉంటుందని, అలాంటప్పుడు లక్ష కోట్ల అవినీతి జరిగిందని రాహుల్ ఎలా అంటారని ప్రశ్నించారు. ఆర్మూర్ నియోజకవర్గంలో 365 రోజుల పాటు చెరువులు కళకళలాడుతున్నాయని చెప్పారు. రైతులంటే కాంగ్రెస్ పార్టీకి చిన్నచూపని విమర్శించారు.
My humble suggestion to Mrs. Priyanka Gandhi Garu, before casting stones, those in glass houses should introspect.
ప్రియాంక గాంధీ గారు ఫ్యామిలీ పాలిటిక్స్ గురించి మాట్లాడడం ఈ ఎన్నికల ప్రచారంలో అతి పెద్ద జోక్ pic.twitter.com/NGdlQwKh04
— Kavitha Kalvakuntla (@RaoKavitha) October 19, 2023
ధరణిని బంగాళాఖాతంలో పడేస్తే రైతుబంధు ఎలా వస్తుందని ప్రశ్నించారు. ఇది తెలంగాణ ద్రోహులకు తెలంగాణ ప్రేమికులకు మధ్య జరుగుతున్న యుద్ధమన్నారు. రేవంత్ రెడ్డి పక్కా తెలంగాణ వ్యతిరేకి అని విమర్శించారు. ఆయన రేవంత్ రెడ్డి కాదని, రేటెంత రెడ్డి అని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ పార్టీ శుష్క వాగ్ధానాలతో ప్రజలను మోసం చేస్తున్నదని విమర్శించారు. విభజన హామీలపై కేంద్రాన్ని ఏనాటూ ప్రశ్నించలేదన్నారు.
సింగరేణిని నాశనం చేసిందే కాంగ్రెస్ పార్టీ అని, తాడిచర్ల లాంటి గనులను ప్రైవేటు పరం చేసిందే కాంగ్రెస్ పార్టీ అని విమర్శించారు. కేంద్రం కోల్ బ్లాకులను వేలం వేస్తుంటే కాంగ్రెస్ చోద్యం చూసిందన్నారు. మోసం కాంగ్రెస్ నైజం అని, ఆ పార్టీకి ఓటేస్తే మనకూ కర్ణాటక గతే పడుతుందని ఎమ్మెల్సీ కవిత అన్నారు.
కాంగ్రెస్ వస్తే కరెంటు కటకటలు తప్పవని సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా హస్తం పార్టీపై విమర్శలు గుప్పించారు. 20 గంటలపాటు కరెంటు ఇస్తామని ఎన్నికలప్పుడు చెప్పి ఇప్పుడు 5 గంటల కరెంట్‌తో సరిపెట్టుకోండని కర్ణాటక విద్యుత్ శాఖ మంత్రి అంటున్నారని మంత్రి ట్వీట్‌కు కౌంటర్‌గా స్పందించారు.
కర్ణాటక మంత్రిలానే తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు కూడా 3 గంటల కరెంటు సరిపోతుందని, 24 గంటల కరెంటు ఇవ్వడం అనవసరమని అన్నారని దుయ్యబట్టారు. కరెంటు కష్టాలు తెచ్చే కాంగ్రెస్ మనకెందుకని, 5 గంటలు, 3 గంటల పార్టీలు మనకొద్దని సూచించారు. దేశంలో ఉచితంగా 24 గంటల కరెంటు ఇస్తున్న ఏకైక ముఖ్యమంత్రి కేసీఆర్‌కే మద్దతుగా నిలుద్దామంటూ ట్వీట్ చేశారు.