ఉమ్మడి నిజామాబాద్ లో అనూహ్య తీర్పు
ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని 9 నియోజకవర్గాల్లో ప్రజలు వినూత్న తీర్పునిచ్చారు. కాంగ్రెస్, బీజేపీని ఆదరించారు. గత ఎన్నికల్లో వికసించిన గులాబీ కాస్త నిరాశ చెందింది

– కాంగ్రెస్ -4, బీజేపీ -3, బీఆరెస్ -2 స్థానాల్లో విజయం
– పలు స్థానాల్లో మూడోస్థానానికి దిగజారిన అధికార బీఆరెస్
విధాత ప్రతినిధి, ఉమ్మడి నిజామాబాద్: ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని 9 నియోజకవర్గాల్లో ప్రజలు వినూత్న తీర్పునిచ్చారు. కాంగ్రెస్, బీజేపీని ఆదరించారు. గత ఎన్నికల్లో వికసించిన గులాబీ కాస్త నిరాశ చెందింది. ఉమ్మడి నిజమాబాద్ జిల్లాలోని 9 అసెంబ్లీ స్థానాల్లో 4 కాంగ్రెస్, 3 బీజేపీ, 2 బీఆర్ఎస్ అభ్యర్థులు విజయం సాధించారు. నిజామాబాద్ జిల్లా పరిధిలోని 6 శాసనసభ నియోజకవర్గాల ఓట్ల లెక్కింపు నగరంలోని పాలిటెక్నిక్ కళాశాలలో ఆదివారం జరిగింది. బోధన్ లో కాంగ్రెస్ అభ్యర్థి సుదర్శన్ రెడ్డి విజయం సాధించగా, సిటింగ్ ఎమ్మెల్యే మహ్మద్ షకీల్ రెండో స్థానానికి పరిమితమయ్యారు.
నిజమాబాద్ అర్బన్ లో బీజేపీ అభ్యర్థి ధన్ పాల్ విజయం సాధించగా, రెండో స్థానంలో కాంగ్రెస్ అభ్యర్థి షబ్బీర్ అలీ, మూడో స్థానంలో సిటింగ్ ఎమ్మెల్యే పరిమితమయ్యారు. నిజామాబాద్ రూరల్ లో కాంగ్రెస్ అభ్యర్థి భూపతి రెడ్డి గెలుపొందగా, ద్వితీయ స్థానంలో సిటింగ్ ఎమ్మెల్యే బాజిరెడ్డి ఉన్నారు. ఆర్మూర్ నుండి బీజేపీ అభ్యర్థి పైడి రాకేష్ రెడ్డి విజయం పొందగా, ద్వితీయ స్థానంలో కాంగ్రెస్ అభ్యర్థి వినయ్ నిలువగా, సిటింగ్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి మూడో స్థానానికి పరిమితమయ్యారు. బాన్సువాడ నుండి స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి విజయం సాధించగా, కాంగ్రెస్ అభ్యర్థి ఏనుగు రవీందర్ ద్వితీయ స్థానంలో చేరారు. బాల్కొండ నియోజక వర్గంలో వేముల ప్రశాంత్ రెడ్డి హ్యాట్రిక్ సాధించగా, రెండో స్థానంలో కాంగ్రెస్ అభ్యర్థి సునీల్ రెడ్డి నిలిచారు. కామారెడ్డిలో బీజేపీ అభ్యర్థి కాటిపల్లి వెంకటరమణ రెడ్డి ఉద్దండులైన సీఎం కేసీఆర్, టీపీసీసీ చీఫ్ రేవంత్ లను చిత్తుచేశారు.
ఎల్లారెడ్డిలో సైతం సిటింగ్ కు పరాభవం తప్పకపోగా, కాంగ్రెస్ అభ్యర్థి మధన్ మోహన్ రావు విజయం సాధించారు. జుక్కల్ లో సైతం కాంగ్రెస్ హవా కొనసాగింది, సిటింగ్ ఎమ్మెల్యే హన్మంతు షిండే పరాజయం పాలవగా, కాంగ్రెస్ నుండి పోటీ చేసిన లక్ష్మీకాంత రావు విజయం సాధించారు. కాగా పటిష్ట బందోబస్తు మధ్య లెక్కింపు ప్రశాంతంగా నిర్వహించారు. నిన్నటివరకు అధికారంలో ఉన్న బీఆరెస్ లో నైరాశ్యం నెలకొంది. జిల్లా ఎన్నికల అధికారి రాజీవ్ గాంధీ హన్మంతు ఎప్పటికప్పుడు పరిశీలన జరిపారు. ప్రజా దీవెనను శిరసావహిస్తూ వారి కష్టసుఖాల్లో భాగస్వాములమై అభివృద్ధికి తోడ్పాటు అందిస్తామని విజేతలు ఈ సందర్భంగా భరోసా కల్పించారు.