అసెంబ్లీలో చూపెట్టింది ట్రైలర్ మాత్రమే: మాజీ మంత్రి హరీశ్ రావు

ఇటివల జరిగిన తెలంగాణ శాసనసభ సమావేశాల్లో కాంగ్రెస్ ప్రభుత్వానికి బీఆరెస్‌ చూపెట్టింది ట్రైలర్ మాత్రమేనని, అసలు సినిమా ముందుందని మాజీ మంత్రి

  • Publish Date - January 11, 2024 / 01:27 PM IST

విధాత : ఇటివల జరిగిన తెలంగాణ శాసనసభ సమావేశాల్లో కాంగ్రెస్ ప్రభుత్వానికి బీఆరెస్‌ చూపెట్టింది ట్రైలర్ మాత్రమేనని, అసలు సినిమా ముందుందని మాజీ మంత్రి, సీనియర్ బీఆరెస్ నేత టి.హరీశ్‌రావు కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ భవన్‌లో గురువారం జరిగిన మహబూబాబాద్ పార్లమెంటరీ స్థాయి సమావేశంలో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డాక జరిగిన తొలి అసెంబ్లీ సమావేశాల్లో బీఆరెస్ పాలనపై సీఎం రేవంత్ రెడ్డి, మంత్రుల మధ్య విమర్శలు, ప్రతి విమర్శల వార్ సాగింది. ఈ నేపధ్యంలో హరీశ్‌రావు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం బీఆరెస్ పాలనపై విమర్శలు చేస్తే తిప్పికొట్టేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు.


మునుముందు మరింత తీవ్రంగా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నించి నిలదీస్తామన్నారు. రానున్న ఎంపీ ఎన్నికల్లో అందరం కష్టపడాలని, మీరు చెప్పిన అంశాలు ప్రతిదీ చర్చిస్తామన్నారు. నెల అయితే కేసీఆర్ కూడా తెలంగాణ భవన్‌లో ఉంటారని, అందరం ఇక్కడే ఉంటామన్నారు. ఏ ఒక్కరికీ సమస్య వచ్చినా.. అందరం బస్ వేసుకొని మీ ముందుకు వస్తామని చెప్పారు. అంతేకాకుండా.. కార్యకర్తలను కాపాడుకునేందుకు ట్రస్ట్ ఏర్పాటు చేస్తామన్నారు. అవసరమైన వారి పిల్లలకు సహకారం అందిస్తామని చెప్పారు. అక్రమ కేసుల నుంచి కార్యకర్తలను కాపాడేందుకు లీగల్ సెల్ ఏర్పాటు చేస్తామన్నారు. జిల్లా కార్యాలయాల్లో కూడా ఏర్పాటు చేస్తామని హరీష్ రావు పేర్కొన్నారు. మరోవైపు ఖమ్మంలో మూడు రకాల కాంగ్రెస్ పార్టీలు ఉన్నాయని హరీశ్‌రావు వ్యాఖ్యానించారు. ఖమ్మం కాంగ్రెస్ మంత్రుల్లో వారిది వారికే పడటం లేదని విమర్శించారు. కాళేశ్వరం, విద్యుత్తు శాఖల్లో అవినీతి అని గోబెల్స్ ప్రచారం చేస్తున్నారన్నారు. అంతకుముందు కడియం శ్రీహరి మాట్లాడుతూ ఖమ్మం జిల్లా మంత్రి పొంగులేటి తాను నెంబర్ 2 అని చెప్పుకుంటుంటే, డిప్యూటీ సీఎం భట్టి సతీమణి మా ఆయనకు సీఎం పదవి రాలేదని వాపోతుందన్నారు. తుమ్మలది మరోదారని కాంగ్రెస్ నాయకుల్లో అంతర్గత కలహాలు, ఆధిపత్య పోరు సాగుతుందని, వారు ఎన్నికల హామీలు నెరవేర్చడంపై దృష్టి పెడితే బాగుంటుందన్నారు.